Begin typing your search above and press return to search.

ప్రభుత్వ ప్రకటనల విషయంలో జగన్ కీలక నిర్ణయం

By:  Tupaki Desk   |   9 Dec 2019 7:11 AM GMT
ప్రభుత్వ ప్రకటనల విషయంలో జగన్ కీలక నిర్ణయం
X
కీలక నిర్ణయాల్ని తీసుకునే విషయంలో ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేగం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా మరెవరైనా సరే.. ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత ప్రభుత్వం కుదురుకొని.. తాముఅనుకున్న దిశగా పాలనా రథాన్ని పరుగులు పెట్టించటానికే ఆర్నెల్ల సమయం తీసుకుంటారు. అలాంటిది జగన్ మాత్రం అందుకు భిన్నంగా ఆర్నెల్ల వ్యవధిలో కుదురుకోవటం తర్వాత.. పాలనా పరంగా తాను అనుకున్న దిశగా నడిపించటంలో సక్సెస్ అయ్యారు.

ఇదొక్కటే కాదు.. సీఎం పదవిని చేపట్టిన నాటి నుంచి తానిచ్చిన హామీల అమలు కోసం తరచూ కొత్త పథకాల్ని తెర మీదకు తీసుకొస్తూ వాటిని స్టార్ట్ చేస్తున్నారు. పాలనపై పూర్తిస్థాయి పట్టును ప్రదర్శిస్తున్నజగన్.. ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోయే నిర్ణయాన్ని తీసుకున్నారు.

ఇకపై ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రకటనల్లో ముఖ్యమంత్రి ఫోటో తప్పించి మరెవరి ఫోటోను వాడరు. ప్రభుత్వ పథకాల ప్రచారంలో మంత్రుల ఫోటోలు వాడకూడదని డిసైడ్ చేశారు. సీఎం ఫోటోల్ని మాత్రమే వాడాలని సీఎంవో స్పష్టం చేసింది. ఒక్క మీడియాలోనే కాదు.. సోషల్ మీడియాలో నిర్వహించే ప్రచారంలోనూ వైఎస్ జగన్ ఫోటోను మాత్రమే వాడాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది సీఎంవో.

అయితే.. ఇదంతా జగన్ సొంత నిర్ణయం ఏ మాత్రం కాదు. గతంలో సుప్రీంకోర్టు విడుదల చేసిన గైడ్ లైన్స్ ప్రకారమే ప్రభుత్వ పథకాల ప్రచారాన్ని ఏ రీతిలో నిర్వహించాలన్న దానిపై విడుదల చేసిన మార్గదర్శకాలకు తగ్గట్లే ప్రకటనలను రూపొందించాలని నిర్ణయించటం గమనార్హం.