కర్ర విరగకుండా పాము(టీడీపీ)ని చంపేస్తున్నారు ఏపీ సీఎం జగన్. ఇన్నాళ్లు దూకుడుకు మారుపేరుగా ఉండే జగన్.. ఇప్పుడు వ్యూహాత్మకంగా తను అనుకున్న లక్ష్యాన్ని తన చేతికి మట్టి అంటకుండా పూర్తి చేస్తున్న వైనం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. జగన్ ఇంత తెలివిగా అమరావతి రాజధానిని డీల్ చేస్తున్న వైనం విమర్శకులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోందని అంటున్నారు.
జగన్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఎంత పెద్ద సమస్య వచ్చినా దాన్ని తెరవెనుక ఉండి కూల్ గా నడిపించేస్తున్నారు. మీడియా ప్రచారానికి దూరంగా కరెక్ట్ గా డీల్ చేస్తున్నారు. ఎక్కడా తాను మాట్లాడకుండా.. తనకు మరక రాకుండా కథ నడిపిస్తున్నారు.
తాజాగా సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఏపీకి రాజధాని అమరావతి మార్పుపై రోజుకో మాట మాట్లాడి దాన్ని ప్రజల్లో నానేలా చేశారు. చంద్రబాబు - టీడీపీ ఓ రేంజిలో చెలరేగిపోతున్నా జగన్ మౌనం వీడడం లేదు. మంత్రులను ముందుపెట్టి ఏపీ రాజధానిపై జగన్ స్పందించకపోవడంతో ఆయన ఏం చేస్తాడోనన్న ఆందోళన టీడీపీ నేతలను వెంటాడుతోంది.
తాజాగా టీడీపీనే కాదు.. రాజధానిపై బీజేపీ - సీపీఎం - జనసేన పార్టీలు కూడా రోడ్డెక్కాయి. రాజధాని మార్చవద్దని పవన్ రైతుల వద్దకు వెళ్లారు. అయినా జగన్ నోరు విప్పడం లేదు.
జగన్ చాలా వ్యూహాత్మకంగానే ఈ విషయాన్ని కొనసాగిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీనివల్ల టీడీపీ ఎంతో బదనాం అవుతోంది. జగన్ సైలెంట్ గా ఉంటూనే అమరావతిపై టీడీపీ కుట్రలను మంత్రులతో బయటపెడుతున్నారు. లోకేష్ తోడల్లుడు శ్రీధర్ - సుజనాచౌదరిలు కొన్న భూముల లెక్కలను బయటపెడుతున్నాడు. అమరావతిపై టీడీపీ చేసిన కుట్రలు - కుతంత్రాలు బయటకు వస్తున్నాయి.
మరో వైపు అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు మేలే చేసేలా తాజాగా వారికి ఇవ్వాల్సిన డబ్బులను జగన్ సర్కారు విడుదల చేసింది. రైతులకు కౌలుని చెల్లించింది.
ఇలా జగన్ ఓ వైపు అమరావతిపై మౌనం దాల్చి అది కొనసాగించాలా లేదా అనే విషయంపై ప్రజల స్పందనను చూస్తున్నారు. మరో వైపు టీడీపీని - దాని బినామీలను టెన్షన్ లో పెడుతున్నారు. అమరావతి భూబాగోతాల్లో టీడీపీ అక్రమాల చిట్టాను బయటపెడుతున్నారు.ఇక రాజధాని రైతులకు ఆర్థిక సాయం చేస్తున్నారు. ఏకకాలంలో జగన్ మౌనంగా విభిన్న వ్యూహాలతో పసుపు శిబిరంలో కలవరం పెంచుతున్నారు. రాజధాని విషయంలో జగన్ ఆడుతున్న గేమ్ చూసి ఇప్పుడు టీడీపీకి చంద్రబాబుకు ముచ్చెమటలు పడుతున్నాయని పొలిటికల్ అనిలిస్టులు చెబుతున్నారు.