Begin typing your search above and press return to search.

ఆ ఎమ్మెల్యేకు జ‌గ‌న్ నో అపాయింట్‌మెంట్‌

By:  Tupaki Desk   |   9 Feb 2022 8:30 AM GMT
ఆ ఎమ్మెల్యేకు జ‌గ‌న్ నో అపాయింట్‌మెంట్‌
X
గ‌త ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యంతో ఏపీలో అధికారంలోకి వ‌చ్చిన సీఎం జ‌గ‌న్ రెండున్న‌రేళ్ల ప‌ద‌వీ కాలం ముగిసింది. జ‌గ‌న్ పేరుతో గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున గెలిచిన ఆ పార్టీ నేత‌ల‌కు ఇప్పుడు ఆయ‌న‌పై అసంతృప్తి త‌ర‌చుగా బ‌య‌ట‌ప‌డుతోంది.

కొంత‌మంది నాయ‌కులు బహిరంగంగానే జ‌గ‌న్ పై ప్ర‌భుత్వంపై త‌మ కోపాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. న‌వ‌ర‌త్నాల పేరుతో ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాల ఫ‌లితాలు అందిస్తున్న జ‌గ‌న్‌.. నేరుగా వాళ్ల ఖాతాల్లో డ‌బ్బులు వేయ‌డంతో ఎమ్మెల్యేలు, ఎంపీల‌కు ప‌ని లేకుండా పోయింది.

జ‌గ‌న్ బ‌ట‌న్ నొక్క‌గానే డ‌బ్బులు ఖాతాల్లో ప‌డుతున్నాయి. దీంతో త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌జ‌లు త‌మ‌ల్ని ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేద‌ని వైసీపీ ప్ర‌జా ప్ర‌తినిధులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తారు. తాజాగా సీఎంను క‌లుద్దామంటే అపాయింట్‌మెంట్ కూడా దొర‌క‌డం లేద‌ని సొంత పార్టీ ఎమ్మెల్యేనే అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఆయ‌నే రాజంపేట ఎమ్మెల్యే మేడా మ‌ల్లిఖార్జున్‌రెడ్డి.

జ‌గ‌న్ సొంత జిల్లా, సొంత పార్టీ ఎమ్మెల్యేనే కూడా సీఎం ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల జిల్లాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా రాయ‌చోటి కేంద్రంగా అన్న‌మ‌య్య జిల్లాను ప్ర‌క‌టించారు. దీంతో పెద్ద ఎత్తున వివాదం చెల‌రేగింది. లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ‌మైన రాజంపేట‌ను కాద‌ని రాయ‌చోటిని జిల్లా కేంద్రంగా ప్ర‌క‌టించ‌డంపై ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త వ‌చ్చింది. రాజంపేట ఎమ్మెల్యే మేడా మ‌ల్లిఖార్జున‌రెడ్డి కూడా ప్ర‌జ‌ల ప‌క్షాన నిల‌బ‌డ‌క త‌ప్ప‌లేదు.

రాజంపేట‌ను కాద‌ని రాయ‌చోటిని జిల్లా కేంద్రంగా ప్ర‌క‌టిండాన్ని ఒప్పుకునేది లేద‌ని మ‌ల్లిఖార్జున్‌రెడ్డితో పాటు అన్ని స్థాయిల్లోని వైసీపీ పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులు తేల్చి చెప్పారు. రాజంపేట‌, రైల్వేకోడూరు నియోజ‌క‌వ‌ర్గాల్లోని అన్ని పార్టీల నేత‌లు క‌లిసి రాజంపేట జిల్లా సాధ‌న స‌మితి పేరుతో పోరాటానికి సిద్ధ‌మ‌య్యారు. మ‌ల్లిఖార్జున్‌రెడ్డి నేతృత్వంలో నేత‌లంతా క‌లిసి ఇటీవ‌ల క‌డ‌ప క‌లెక్ట‌ర్‌కు విన‌తి ప‌త్రం కూడా అంద‌జేశారు. ఈ నేప‌థ్యంలో సీఎం జ‌గ‌న్ క‌లిసి ప్ర‌జ‌ల డిమాండ్‌ను వివ‌రిద్దామ‌నుకున్న మ‌ల్లిఖార్జున్‌రెడ్డికి నిరాశే ఎదురైంది.

ఆయ‌న‌కు సీఎం జ‌గ‌న్ అపాయింట్‌మెంట్ ఇవ్వ‌లేద‌ని తెలిసింది. తాను తీసుకున్న నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తున్న మ‌ల్లిఖార్జున్‌రెడ్డితో మాట్లాడేందుకు జ‌గ‌న్ ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని స‌మాచారం. ఇదే విష‌యాన్ని మ‌ల్లిఖార్జున్‌రెడ్డి సోద‌రుడు విజ‌య‌శేఖ‌ర్‌రెడ్డి బ‌హిరంగంగా ప్ర‌జ‌ల‌కు వెల్ల‌డించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇక్క‌డి స‌మ‌స్య‌ను వివ‌రించ‌డానికి ఎమ్మెల్యేకు జ‌గ‌న్ అపాయింట్‌మెంట్ ఇవ్వ‌లేద‌ని ఆయ‌న‌కు అంత‌కంటే ప‌నేముంద‌ని? విజ‌య‌శేఖ‌ర్ విమ‌ర్శించారు.