Begin typing your search above and press return to search.

కోవింద్‌ - మోదీల‌కు జ‌గ‌న్ లేఖ!... ఎందుకంటే?

By:  Tupaki Desk   |   2 April 2018 10:54 AM GMT
కోవింద్‌ - మోదీల‌కు జ‌గ‌న్ లేఖ!... ఎందుకంటే?
X
దేశంలో ఎస్సీ - ఎస్టీల‌పై అగ్ర‌వర్ణాల దాడుల‌ను నిర్మూలించేందుకు ఉద్దేశించిన ఎస్సీ - ఎస్టీ అత్యాచార నిరోధక చ‌ట్టం... చాలా క్లిష్ట‌మైన చ‌ట్టంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే... ఈ సెక్ష‌న్ కింద కేసు న‌మోదైతే నిందుతుల‌కు ఎలాంటి ముంద‌స్తు బెయిల్ రాదు. అంతేనా... వెనువెంట‌నే నిందితుల‌ను అరెస్ట్ చేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. మొత్తంగా ఈ సెక్ష‌న్ కింద న‌మోద‌య్యే కేసులు అటు నిందితుల‌తో పాటు ఇటు కేసుల‌ను ద‌ర్యాప్తు చేసే బాధ్య‌త‌ల్లోని పోలీసుల‌కు కూడా ముచ్చెమ‌ట‌లు ప‌ట్ట‌డం ఖాయ‌మేన‌ని చెప్పాలి. ఇక ఈ కేసుల్లో విచార‌ణ కూడా నిర్దేశిత స‌మ‌యంలోగా పూర్తి కావాల్సిందే. అవ‌స‌ర‌మైతే దాడులు జ‌రిగిన చోటే ప్ర‌త్యేక కోర్టుల‌ను ఏర్పాటు చేసే వీలు కూడా ఈ చ‌ట్టం కింద ఉంది. మొత్తంగా ఆర్థికంగానే కాకుండా సామాజికంగానూ అట్ట‌డుగున ఉన్న ద‌ళితులు - గిరిజ‌నుల‌కు ఈ చ‌ట్టం వ‌ర‌ప్ర‌సాదినిగానే ప‌రిణ‌మిస్తోందని చెప్ప‌క త‌ప్ప‌దు. అయితే ఇటీవ‌లి కాలంలో ఈ చ‌ట్టాన్ని కూడా కొంద‌రు దుర్వినియోగం చేస్తున్నార‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. ద‌ళిత‌ - గిరిజ‌న సామాజిక వ‌ర్గాల‌కు చెందిన వారే... త‌మ‌కు ర‌క్ష‌ణ‌గా నిలుస్తున్న ఈ చ‌ట్టాన్ని త‌మ స్వార్థ ప్ర‌యోజ‌నాల‌కు వినియోగించుకుంటూ త‌మ‌కు ప్ర‌త్య‌ర్థులుగా భావిస్తున్న వ్య‌క్తుల‌ను వేధించేందుకు వారిపై ఈ కేసుల‌ను బ‌నాయిస్తున్నార‌న్న వాద‌న లేక‌పోలేదు.

అయితే ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌లు చాలా అరుదుగానే చోటుచేసుకుంటున్నా... ఈ త‌ర‌హా సంస్కృతి మ‌రింత‌గా విస్త‌రిస్తే... చ‌ట్టం ఉద్దేశ్య‌మే గంగ‌లో క‌లిసిపోతుంద‌ని నిపుణులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న ప‌రిస్థితి మ‌న‌కు తెలియ‌నిదేమీ కాదు. ఈ క్ర‌మంలోనే దాఖ‌లైన ఓ పిటిష‌న్‌ ను విచారించిన సంద‌ర్భంగా స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు మొన్నామ‌ధ్య సంచ‌ల‌న తీర్పు చెప్పింది. ఈ చ‌ట్టం కింద నేరస్తుల‌ను అరెస్ట్ చేసే విష‌యంలో పోలీసు ఉన్న‌తాధికారుల అనుమ‌తి అవ‌స‌ర‌మంటూ సుప్రీం చేసిన వ్యాఖ్య‌ల‌పై నిజంగానే దేశ‌వ్యాప్తంగా ద‌ళితులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. త‌మ‌కు ర‌క్ష‌ణ క‌వ‌చంలా ఉన్న చ‌ట్టానికి సుప్రీం తీర్పు గొడ్డ‌లిపెట్టేనంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ... ద‌ళిత సంఘాలు నేడు భార‌త్ బంద్‌ కు పిలుపునిచ్చిన విష‌యం కూడా తెలిసిందే. దీనిపై ఇత‌ర రాజ‌కీయ పార్టీల నేత‌ల‌కంటే చాలా వేగంగా స్పందించిన ఏపీ అసెంబ్లీలో విప‌క్ష నేత‌ - వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి... ద‌ళితులు - గిరిజ‌నుల‌కు భ‌రోసా క‌ల్పించే చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఇందులో భాగంగా ఆయ‌న కాసేప‌టి క్రితం నేరుగా రాష్ట్రప‌తి రాంనాథ్ కోవింద్‌ - ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీల‌కు లేఖ‌లు రాశారు.

ఎస్సీ - ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పును పునసమీక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని జ‌గ‌న్ ఆ లేఖ‌ల్లో కోవింద్‌ - మోదీలకు విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు తీర్టు ఎస్సీ - ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉందని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఎస్సీ - ఎస్టీలు అభద్రతా భావానికి లోనవుతారని తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఏపీలో ద‌ళితుల ప‌ట్ల సీఎంగా ఉన్న టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు - మంత్రిగా ఉన్న ఆదినారాయ‌ణ‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌ను కూడా జ‌గ‌న్ ప్ర‌స్తావించారు. దళితుడిగా పుట్టాలని ఎవరూ కోరుకోరంటూ బాబు వ్యాఖ్యలు చేస్తున్నారని. దళితులు అపరిశుభ్రంగా ఉంటారని మంత్రి ఆది అవ‌హేళ‌న చేస్తున్నార‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దళితులను కించపరిచే వ్యాఖ్యలు ఏపీలో ప్రస్తుత పాలకుల ఫ్యూడల్ భావజాలానికి నిదర్శనమని, పాలకులే అలా మాట్లాడితే మిగిలిన వారి సంగతి ఏంటో మీరే ఆలోచించాలి. భారత రాజ్యాంగం కుల రహిత సమాజాన్ని కోరుకుందని రాష్ట్రపతి, ప్రధానిలకు రాసిన లేఖల్లో వైఎస్ జగన్ పేర్కొన్నారు.