Begin typing your search above and press return to search.

చెల్లెలు అరెస్టు వేళ.. అంత తక్కువ ప్రాధాన్యత ఇవ్వటమా జగన్?

By:  Tupaki Desk   |   30 Nov 2022 3:08 AM GMT
చెల్లెలు అరెస్టు వేళ.. అంత తక్కువ ప్రాధాన్యత ఇవ్వటమా జగన్?
X
అన్నను కాదని అనొచ్చు. అన్న మాటకు భిన్నంగా నిర్ణయిం తీసుకొని ఉండొచ్చు. అన్న మాట కాదని తెలంగాణలో పార్టీ పెట్టి ఉండొచ్చు. ఎన్ని చేసినా.. జగన్ కు రక్తం పంచుకు పుట్టిన సోదరి. ఆయనకు కష్టం వచ్చినప్పుడు.. పలు కేసుల కారణంగా జైలుకు వెళ్లాల్సి వచ్చిన వేళలో.. అన్న వదిలిన బాణంగా.. అన్న గొంతుగా మారిన షర్మిల..అప్పట్లో పార్టీ కోసం ఎంతలా శ్రమించారో? మరెంతగా ఆరాటపడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అలాంటి షర్మిల తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టే విషయంపై జగన్ కు కొన్ని అభిప్రాయాలు ఉండిఉండొచ్చు.

వాటిని కాదని షర్మిల తెలంగాణకు వచ్చి పార్టీ పెట్టి ఉండొచ్చు. ఎంత లెక్కలు తేడా వస్తే మాత్రం.. కష్టం వచ్చినప్పుడు.. రాజకీయంగా అనుచిత ధోరణిని ఎదుర్కొన్నప్పుడు.. గాయాలు అయినప్పుడు.. సీరియస్ కారణాలు పెద్దగా లేకున్నా అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచే వరకు విషయం వెళ్లటం తెలిసిందే.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆమె డ్రైవ్ చేస్తున్న కారులో నుంచి కిందకు దిగాలని పోలీసులు కోరితే.. ససేమిరా అన్న ఆమెను కారుతో సహా లిఫ్టు చేసి.. ఆ వాహనాన్ని టోయింగ్ వాహనానికి కట్టేసి తీసుకెళ్లిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అన్నింటికి మించి సోమవారం నిర్మల్ జిల్లాలో చోటు చేసుకున్న పరిణామాలు.. ఈ సందర్భంగా పోలీసుల తీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం ఎపిసోడ్ కు మించిన పరిణామాలు మంగళవారం చోటు చేసుకోవటం తెలిసిందే.

మంగళవారం మొత్తం హైడ్రామా చోటు చేసుకోవటం ఒక ఎత్తు అయితే.. షఱ్మిలను అరెస్టు చేసి నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లటం.. చివర్లో ఆమెకు బెయిల్ రావటం తెలిసిందే. ఈ మొత్తం పరిణామాలకు సంబంధించి ఈ రోజు ప్రధాన దినపత్రికల్ని చూస్తే.. ఆంధ్రజ్యోతి.. వెలుగు దినపత్రికలు షర్మిల ఎపిసోడ్ కు భారీ ప్రాధాన్యత ఇవ్వటం కనిపిస్తుంది. ఈనాడు మొదటి పేజీ కింది భాగంలో ప్లేస్ మెంట్ ఇస్తే.. జగన్ కుటుంబానికి చెందిన సాక్షి దినపత్రికలో మాత్రం ఆమెకు దక్కిన ప్రాధాన్యత అంతంత మాత్రమే.

ఒకవేళ.. ప్లేస్ విషయంలో ఇబ్బంది జరిగినా.. వార్తను ఇచ్చే విషయంలోనూ కాస్తంత గట్టిగా ఇస్తే బాగుండేది.కానీ.. అదేమీ లేకుండా చాలా సాదాసీదా శీర్షికతో ఇచ్చిన వైనంపై పలువురు అసంత్రప్తి వ్యక్తం చేస్తున్నారు. అంచనాలకు తగ్గట్లే నమస్తే తెలంగాణ పత్రిక మాత్రం తన మొదటి పేజీలో సింగిల్ కాలమ్ లో కూడా షర్మిల ఎపిసోడ్ గురించి పేర్కొనలేదు. మిగిలిన మీడియా సంస్థల సంగతి ఎలా ఉన్నా.. సాక్షి మాత్రంషర్మిల విషయంలో మరీ అంత తక్కువ ప్రాధాన్యత ఇవ్వటమా? అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పొద్దుపొద్దున్నే పేపర్లు చూసినోళ్లు ఏమనుకుంటారో అన్న విషయాన్ని కూడా జగన్ మీడియా సంస్థలు పట్టించుకోలేదన్న మాట వినిపిస్తోంది. తెలంగాణలో పార్టీ పెట్టి పోరాటం చేస్తున్న తన ముద్దుల చెల్లికి జరిగిన దానికి బదులు ఏపీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ మాట్లడకపోవటంలో అర్థం ఉంది. కానీ.. ఆమెకు సంబంధించిన వార్తను మరికాస్త గట్టిగా తమ సొంత మీడియాలో పెట్టి ఉంటే బాగుండేదన్న మాట వినిపిస్తోంది. షర్మిల తాజా ఎపిసోడ్ జగన్ కు ఇబ్బందికరంగానే కాదు.. వేలెత్తి చూపించేలాంటి పరిస్థితి ఎదురైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.