Begin typing your search above and press return to search.

జగన్ మంత్రాంగం ఫలించిందా ?

By:  Tupaki Desk   |   25 Feb 2016 9:17 PM IST
జగన్ మంత్రాంగం ఫలించిందా ?
X
ఇప్పుడు ఏపీలో కనుచూపు మేరలో ఎన్నికలనేదే లేవు. అయినా... ఏపీలో రాజకీయం రంజుగా మారింది. ముఖ్యంగా అధికార పార్టీ ఆకర్ష్ పథకంతో కడప రాజకీయాలను వెడెక్కించింది. కడపలో పర్యటిస్తున్న లోకేష్... స్థానిక తెలుగుదేశం నాయకులతోపాటు... ప్రతిపక్ష పార్టీ నేతలు - ఎమ్మెల్యేలతో సైతం మంతనాలు జరుపుతున్నారు. దాంతో కడప జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అవుతున్నారనే ప్రచారం ఊపందుకుంది. దాంతో హుటా హుటిన జగన్ కూడా ఢిల్లీ పర్యటన ముగించుకుని బెంగళూరు నుంచి కడపకు చేరుకుని జంప్ జిలానీలను బుజ్జగించే పనిలో పడ్డాడు.

దాంతో వరుసబెట్టి వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా మీడియా ముందుకొచ్చి మేము టీడీపీలో చేరడం లేదంటూ చెబుతున్నారు. లోకేష్ ఇచ్చిన డీల్ కుదరలేదో... మరి జగన్ మంత్రాంగం ఫలించిందో తెలియదు కానీ... ఇప్పటికే మైదుకూరు ఎమ్మెల్యే రఘురామ్ రెడ్డి - మరో మైనార్టీ ఎమ్మెల్యే తాము పార్టీ మారడం లేదని ప్రకటించారు. తాము పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం మొత్తం.. కేవలం అధికార పార్టీ నేతల మైండ్ గేమ్ అంటున్నారు వీరు.

అయితే లోకేష్ తో సీనియర్ నాయకుడు, వైసీపీ నేత మైసూరారెడ్డి... కడపలోని స్థానిక ఓ హోటల్ లో కార్యకర్తలతో సమావేశం కావడం హాట్ టాపిక్ గా మారింది. మైసూరా తిరగి టీడీపీ గూటికి చేరబోతున్నాడనే ప్రచారం ఊపందుకుంది. ఈనెల 28న మహూర్తం కూడా ఖరారైందని మీడియాలో ప్రచారం జరుగుతోంది. జగన్ శుక్రవారం కడపలో సుడిగాలి పర్యటన చేశారు. ప్రొద్దుటూరులోని తన అనుచరుడు, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డితో కలిసి స్థానిక నాయకులను బుజ్జగించాడు జగన్. ప్రసాద్ రెడ్డి... స్థానిక టీడీపీ నాయకుడు, ఎమ్మెల్సీ లింగారెడ్డికి మంచి మిత్రుడు. మరి ప్రసాద్ రెడ్డి కూడా టీడీపీలో చేరితె ... మొదటికే మోసం వస్తుందని జగన్ భావించాడో ఏమో... ప్రొద్దుటూరులో వాలిపోయాడు.

ఇక్కడికే కూత వేటు దూరంలో మైసూరా సొంత వూరు ఎర్రగుంట్ల గ్రామం వుంది. మైసూరా స్థానికంగా కడపలో వున్నా జగన్ ను మాత్రం కలవలేదు. దాంతో మైసూరా చేరిక లాంఛనమే అంటున్నాయి రాజకీయ వర్గాలు. మరోవైపు బద్వేల్ ఎమ్మెల్యే జయరాం టీడీపీలోకి వెళ్లడం జగన్ జీర్ణించుకోలేకపోతున్నాడు. గతంలో పులివెందుల మున్సిపల్ కమీషనర్ గా పనిచేసిన ఆయన వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. దాంతో ఇప్పుడు మిగతా ఎమ్మెల్యేలు చేజారకుండా జగన్ మంతనాలు చేస్తున్నాడు. మరి జగన్ బుజ్జగింపులు ఏమాత్రం ఫలితం ఇస్తాయో వేచి చూడాలి.