Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ ఎంట్రీతో క‌డ‌ప లెక్క‌లు మారిపోయాయి!

By:  Tupaki Desk   |   4 Feb 2017 11:45 AM IST
జ‌గ‌న్ ఎంట్రీతో క‌డ‌ప లెక్క‌లు మారిపోయాయి!
X
తెలుగు రాష్ట్రాల్లో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న శాస‌న‌మండ‌లి ఎన్నిక‌ల‌కు సంబంధించి స‌మీక‌ర‌ణాలు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప‌లు జిల్లాల‌కు చెందిన స్థానిక సంస్థ‌ల కోటా ఎమ్మెల్సీ సీట్ల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌గా... ఏపీ ప్ర‌తిపక్ష నేత‌ - వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సొంత జిల్లా క‌డ‌ప జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ఎన్నిక‌పైనే అంతా చ‌ర్చించుకుంటున్నారు. పైడిపాళెం రిజ‌ర్వాయ‌ర్‌ ను పూర్తి చేసి జ‌గ‌న్ సొంత నియోజ‌వ‌క‌ర్గం పులివెందుల‌కు సాగు - తాగు నీరిచ్చామ‌ని గొప్ప‌లు చెప్పుకున్న టీడీపీ... ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ అభ్య‌ర్థినే విజ‌యం వ‌రిస్తుంద‌ని గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉంది. అదే స‌మ‌యంలో ఆ జిల్లాలోని రాయ‌చోటి నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లువురు స్థానిక సంస్థ‌ల ప్ర‌తినిధులు ఇటీవ‌ల వైసీపీ నుంచి టీడీపీలోకి జంప‌య్యారు. ఈ ప‌రిణామంతో వైసీపీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగుతున్న జ‌గ‌న్ బాబాయి - మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డికి ప‌రాజ‌యం త‌ప్ప‌దా? అన్న భావ‌న కూడా వినిపించింది.

అయితే వైఎస్ ఫ్యామిలీకి కంకుచోట‌లా ఉన్న క‌డ‌ప జిల్లాలో వైసీపీకి వ్య‌తిరేక ఫ‌లితాలు సాధ్య‌మేనా? అన్న అనుమానాలు లేక‌పోలేదు. ఇదే స‌మ‌యంలో మూడు రోజుల క్రితం వైఎస్ జ‌గ‌న్ క‌డ‌ప జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. త‌న సొంత నియోజ‌కవ‌ర్గం పులివెందుల‌తో పాటు క‌డ‌ప‌ - ఇడుపులపాయ‌ - ఇత‌ర ప్రాంతాల్లోని పార్టీ నేత‌ల‌తో స‌మీక్ష‌లు నిర్వ‌హించారు. జ‌గ‌న్ రానంత‌వ‌ర‌కు ప‌రిస్థితి ఎలా ఉన్నా... జ‌గ‌న్ అడుగుపెట్ట‌డంతోనే అక్క‌డ ప‌రిస్థితి అంతా మారిపోయింద‌ట‌. ప‌లు ప్రాంతాల‌కు చెందిన స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధులు వ‌రుస‌పెట్టి టీడీపీకి గుడ్‌ బై చెప్పేసి వైసీపీలో చేరిపోయారు. దీంతో వైసీపీ అభ్య‌ర్థి వైఎస్ వివేకా గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కేన‌న్న వాద‌న వినిపించింది.

ఇదేదో... వైసీపీ చెప్పుకుంటున్న మాట ఎంత‌మాత్రం కాదు. సాక్షాత్తు టీడీపీ శ్రేణుల నోట నుంచి వ‌స్తున్న మాట‌. వైఎస్ జ‌గ‌న్ క‌డ‌ప‌కు రానంత‌వ‌ర‌కు గెలుపు త‌మ పార్టీ అభ్య‌ర్థిదేన‌ని చెప్పిన టీడీపీ నేత‌లు... జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌తో ఒక్క‌సారిగా మాట మార్చేయ‌క త‌ప్పలేదు. వైసీపీ నుంచి టీడీపీలోకి వ‌చ్చిన కొంద‌రు స్థానిక సంస్థ‌ల ప్ర‌జా ప్ర‌తినిధుల‌తో పాటు మ‌రికొంద‌రు టీడీపీ ప్ర‌తినిధులు కూడా వైసీపీలోకి చేరిపోతుండ‌టంతో... మారిన స‌మీక‌ర‌ణాల‌తో టీడీపీ నేత‌లు కొత్త లెక్క‌లు వేసుకుంటుండం అక్క‌డ క‌నిపిస్తోంది. అంతేకాకుండా... జ‌గ‌న్ ఎంట్రీతో ప‌రిస్థితి ఒక్క‌సారిగా మారిపోయింద‌ని కూడా టీడీపీ నేత‌లు చ‌ర్చించుకోవ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. వెర‌సి జ‌గ‌న్ బాబాయి వైఎస్ వివేకానంద‌రెడ్డి మరోమారు శాస‌న‌మండ‌లిలో కాలుమోప‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/