Begin typing your search above and press return to search.
జగన్ లేకుంటే ఈ హామీ వచ్చేదా?
By: Tupaki Desk | 24 Nov 2018 4:41 PM ISTజరుగుతున్నవి తెలంగాణ ఎన్నికలు. తాడో పేడో తేల్చుకుందామని కాంగ్రస్ ఈసారి డిసైడ్ అయ్యింది. అందుకే ఆరోగ్యం సహకరించక ఇతర రాష్ట్రాల ప్రచారాలకు వెళ్లని సోనియాగాంధీ వాటన్నింటికి కొడుకును మాత్రమే పంపి తెలంగాణకు మాత్రం తనుకూడా వచ్చింది. పైగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చాక ఆమె మొదటి రాక ఇదే.
అయితే, నిన్నటి ఆమె పర్యటనలో హాట్ టాపిక్ తెలంగాణ మాత్రమే కాదు - *ప్రత్యేక హోదా* అనే ఆంధ్రుల కోరిక. ఆంధ్రుల డిమాండ్. ఆంధ్రుల వినతి. అవును... ఆ ఒక్కటీ ఇవ్వండి అని ఆంధ్రుల మనసులోని మాటకు ప్రతినిధి అయ్యి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ ను - బీజేపీని అడుగుతున్నాడు. డిమాండ్ చేస్తున్నాడు. ప్రభుత్వం ఆయన డిమాండ్ ను పట్టించుకోలేదు. కొంతకాలానికి బీజేపీ ప్రకటనలు - వాటికి చంద్రబాబు భజన కలిసి ప్రత్యేక హోదా రాదేమోలే అని ఏపీ ప్రజలు ఆల్మోస్ట్ మరిచిపోయే స్టేజికి వచ్చారు. కాదు కాదు... అలా చేశాయి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. కానీ పట్టు వదలని ప్రతిపక్ష నేత ఆ నినాదాన్ని వదల్లేదు. నిరంతరం జపించాడు. చివరకు జగన్ అంతగా పట్టుబడుతుంటే తెలంగాణ లాగ పోరాడితే మనకు ప్రత్యేక హోదా వచ్చే అవకాశం ఉందని ప్రజలకు అర్థమైంది. దీంతో చంద్రబాబు తలవంచక తప్పలేదు. తాను యుటర్న్ తీసుకుని ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తన్నట్లు - దానికోసమే తాను బతుకుతున్నట్లు చంద్రబాబు హడావుడి చేశారు. అయితే - ఏపీ ప్రజల్లో మాత్రం ఆ డిమాండ్ కు ఊపిరిపోసిందెవరో స్పష్టంగా తెలుసు. ఈరోజు అది ఏ స్థాయికి వెళ్లిందే... పార్టీల తలరాతలు మార్చగలిగిన స్థాయిలో ఉంది. ఆనాడు తెలంగాణ హీట్ ను ఎలా అయితే కాంగ్రెస్ ఫీలయ్యిందో... అంతే స్థాయిలో ఆ పార్టీ ప్రత్యేక హోదా విషయంలో ఏపీ వాసుల కోరిక ఎంతో గ్రహించింది. రాజకీయమో - అధికారదాహమో కారణం ఏదైనా ప్రత్యేక హోదా ఇస్తామంటూ తెలంగాణ గడ్డ మీద ఆమె ప్రామిస్ చేసింది. ఇక్కడ వాళ్లు అధికారంలోకి వస్తారా? రారా? అన్న సంగతి పక్కన పెడితే... సంకల్పంతో ఒక ప్రజా కోరిక మీద పట్టబడితే దాని ప్రభావం ఎలా ఉంటుంది అన్నది ఇక్కడ పాయింట్. సరే జనానికి గుర్తులేదు - పాలకులకు బాధ్యత లేదు అని ప్రతిపక్ష నాయకుడు కనుక ఆ డిమాండ్ ను వదిలేసి ఉంటే... కచ్చితంగా ఏపీ వాసులకు ప్యాకేజీతో బీజేపీ కాంగ్రెస్ లు ఎవరు వచ్చినా పంగనామాలు పెట్టేవి. కానీ... ఆ పరిస్థితి లేదు ఇపుడు.
కాంగ్రెస్ ప్రత్యేక హోదాపై నిలబడటంతో వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ కూడా తలవంచక తప్పదు. ప్రతిపక్షం బలంగా ఉన్నపుడు ప్రజలకు కలిగే ప్రయోజనాలు ఇలాగే ఉంటాయి. అందుకే అధికారంలో ఎవరున్నా బలమైన ప్రతిపక్షం లేకుంటే రాష్ట్రమైనా దేశమైనా అన్యాయం అవక తప్పదు. ఆంధ్రలో ప్రతిపక్షం బలంగా లేకుంటే... సోనియాగాంధీ నోటి నుంచి ఆ హామీ వచ్చేది కాదు.
