Begin typing your search above and press return to search.

ఆ నలుగురికి జగన్ దేవుడు.. మళ్లీ మంత్రులుగా ఛాన్సు

By:  Tupaki Desk   |   7 April 2022 4:26 AM GMT
ఆ నలుగురికి జగన్ దేవుడు.. మళ్లీ మంత్రులుగా ఛాన్సు
X
ఒకసారి చెప్పిన తర్వాత.. దాన్ని ఫాలో కావటమే తప్పించి మరో మాటే లేదన్నట్లుగా ఉంటుంది ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరు చూస్తే. ఏదైనా అంశంపై ఒకసారి డిసైడ్ అయితే మాత్రం.. ఎంతకూ తగ్గని వైనమే కాదు.. అందుకోసం ఎంత రిస్కుకైనా భరించే సత్తా ఆయన సొంతం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వేళలోనే.. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేవారిని మూడేళ్లకు పక్కన పెట్టి.. వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తానని.. సీనియర్లకు పార్టీ పదవుల్ని అప్పజెప్పి.. రెండోసారి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు వినియోగిస్తామని చెప్పటం తెలిసిందే.

ఇంతకాలం జగన్ చెప్పిన మాటలకు.. చేతలకు మధ్య తేడా ఉంటుందని ఆశించిన వారికి షాకిస్తూ.. మంత్రివర్గం మొత్తాన్ని రాజీనామా చేయించేందుకు టైం డిసైడ్ చేసిన ఆయన.. కొత్త టీం చేత ప్రమాణ స్వీకారం చేయించేందుకు సైతం ముహుర్తం పెట్టేశారు. ఈ నెల 11న ఉదయం వేళలో కొత్త టీం చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారని చెబుతున్నారు.

ఈ వాదనకు బలం చేకూరేలా ఢిల్లీ నుంచి వచ్చిన జగన్.. కొన్ని గంటల వ్యవధిలోనే రాజ్ భవన్ కు వెళ్లి మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు సంబంధించిన రోడ్ మ్యాప్ ను వివరించి.. ఆ వివరాల్ని ఆయనకు చెప్పి ఓకే చేయించినట్లుగాచెబుతున్నారు. ముందుగా అనుకున్నట్లే ఈ నెల11న ప్రమాణస్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేసేలా గవర్నర్ ను ఒప్పించిన ఆయన.. బయటకు వచ్చినంతనే ఆయన నోటి నుంచి వచ్చే మాటల కోసం అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మొత్తం మంత్రుల్లో నలుగురు తప్పించి మిగిలిన వారిని కొత్తగా జట్టులోకి తీసుకోనున్న విషయాన్ని తేల్చేశారు. ఇంతకీ ఆ నలుగురు ఎవరు? అన్నప్రశ్నకు సమాధానం అదిరేలా ఉందని చెప్పాలి.

తనకు అత్యంత సన్నిహితంగా వ్యవహరించే అదిమూలపు సురేశ్ ను.. సీదిరి అప్పలరాజు.. చెల్లుబోయిన వేణుగోపాల్ క్రిష్ణ.. గుమ్మనూరు జయరాంలను మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లుగా స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు.

ఈ నిర్ణయం మిగిలిన సీనియర్ మంత్రులకు ఒళ్లు మండేలా చేసిందంటున్నారు. ఏమైనా.. జగన్ కొత్త టీం కొత్త కలతలకు కారణమవుతుందన్న వాదన వినిపిస్తోంది. ఆ నలుగురు అంటూ అందరిని దూరంగా పెట్టిన జగన్.. ఈ నలుగురి విషయంలోనే ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు? మిగిలిన వారిని ఏ లెక్కన పక్కన పెట్టేసినట్లు? అన్నదిప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పక తప్పదు.