Begin typing your search above and press return to search.

చెల్లెమ్మకు మాట ఇచ్చి మరచావా జగన‌న్నా... ?

By:  Tupaki Desk   |   31 Dec 2021 8:00 AM IST
చెల్లెమ్మకు మాట ఇచ్చి మరచావా జగన‌న్నా... ?
X
మాట తప్పను మడమ తిప్పను అని జగన్ అంటారు. అలాంటి జగన్ తాను స్వయంగా ఇచ్చిన మాట తప్పారా అన్న చర్చ వస్తోంది. అది కూడా చెల్లెమ్మలకు అండగా ఉంటానని చెప్పిన అన్న ఇలాచేయడమేంటి అని చెల్లెమ్మలు బాధ పడుతున్నారు. ఇంతకీ జగన్ ఇచ్చిన హామీ ఏంటి, ఆయన చేసినది ఏంటి అంటే చాలానే ఉంది మరి.

ఏపీలో చంద్రబాబు సీఎం గా ఉండగా చంద్రన్న పెళ్లి కానుక అన్న పధకాన్ని ప్రవేశపెట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్, కాపులకు చెందిన నిరుపేద ఆడపడుచులకు ఈ పధకాన్ని ఆయన వర్తింపచేశారు.

ఈ పధకం కింద పేదింటి అమ్మాయి పెళ్ళి చేసుకున్నపుడు ప్రభుత్వం పెళ్లి కానుక పేరిట ఆర్ధిక భరోసాగా నిలుస్తుంది. అలాగే బాల్య వివాహాలను అరికట్టేందుకు కూడా ఆయా వివాహాలను రిజిస్ట్రేషన్ చేయించడం కూడా ఈ పధకంలో భాగంగా సింగిల్ డెస్క్ ద్వారా నాడు ఈ పెళ్ళి కానుక క్లియరెన్స్ లు అన్నీ జరిపేవారు.

ఇక జగన్ అధికారంలోకి వచ్చాక ఈ పధకాన్ని వైఎస్సార్ పెళ్ళి కానుకగా మార్చారు. తాను ఇంకా ఎక్కువ ఆర్ధిక సాయం చేస్తామనికూడా ఆయన చెప్పుకున్నారు. నిజానికి 2020 ఏప్రిల్ 2 నుంచి ఈ పధకాన్ని పూర్తిగా అమలు చేయాలని జగన్ సరకర్ ప్రకటించింది.

జగన్ అయితే 2020 నవంబర్ 11న విజయవాడలో జరిగిన మౌలానా అబుల్ కలాం అజాద్ జయంతి సందర్భంగా పెండింగులో ఉన్నవీ, వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక మంజూర్ చేసిన పెళ్ళి కానుకను లబ్దిదారులకు 2021 నుంచి పంపిణీ చేస్తామని చెప్పారు.

అయితే ఈ ఏడాది పూర్తి అయిపోయింది కానీ ఆ ఊసు అయితే లేదు. ఇక చంద్రబాబు ఏలుబడిలో చివరి సంవత్సరంలో ఈ పధకం కింద 27 కోట్ల రూపాయలు పెళ్ళి కానుకగా లబ్దిదార్లూకు ఇవ్వాలి. జగన్ సీఎం అయ్యాక ఏడాదికి 75 వేలకు తక్కువ లేకుండా లబ్దిదార్లు ప్రతీ ఏటా ఈ పధకం కోసం దరకాస్తు చేసుకుని ఆశగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఈ మూడేళ్లలో వీరి సంఖ్య రెండు లక్షలకు పై దాటి ఉంటుంది అంటున్నారు.

మరి చెల్లెమ్మలకు జగన్ ఒక అన్నగా పెళ్ళి కానుకను ఇస్తామని చెప్పి స్వయంగా హామీ ఇచ్చి ఇవ్వకపోవడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ఒక వైపు చూస్తే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఏ మాత్రం బాగులేదు, దాంతో ఈ పధకం ఏమైనా ఎత్తేశారా అన్న డౌట్లు అయితే లబ్దిదారుల్లో ఉన్నాయి. ఏది ఏమైనా పేదింటి చెల్లెమ్మలను ఆదుకో జగనన్నా అని వారు కోరుకుంటున్నారు. మరి జగన్ సర్కార్ ఏం చేస్తుందో చూడాలి.