Begin typing your search above and press return to search.

వాటే ఐడియా జగన్? చెత్త పన్నుకు దిమ్మ తిరిగే ప్లానింగ్

By:  Tupaki Desk   |   11 Aug 2022 4:06 AM GMT
వాటే ఐడియా జగన్? చెత్త పన్నుకు దిమ్మ తిరిగే ప్లానింగ్
X
తమ ప్రభుత్వంలో అమలు అవుతున్నన్ని సంక్షేమ పథకాలు మరే ప్రభుత్వంలో అమలు కాలేదంటూ వైసీపీ నేతలు మహా గొప్పగా చెప్పుకోవటం తెలిసిందే. ఆ మాటకు వస్తే.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తమ ప్రభుత్వం గురించి చెప్పుకునే ఘనతల్లో కీలకమైనది సంక్షేమ పథకాల అమలే. మరి.. ఇన్ని పథకాలు అమలు చేసి.. ఉచితాల మీద ఉచితాలు ఇచ్చేస్తూ.. జనాలు పడేసే చెత్త మీద వసూలు చేసే పన్ను విషయంలో ఎందుకంటే గట్టిగా ఉంటారన్నది అర్థం కాని ప్రశ్న.

జనాలకు ఇచ్చే వేలాది రూపాయిల్లో కాసిన్ని డబ్బులు తగ్గించుకున్నా ఎవరూ ఏమీ అనుకోరు. కానీ.. చెత్త మీద విధించిన పన్నుతో జరిగే డ్యామేజ్ భారీగా ఉంటుందన్న విషయాన్ని జగన్ సర్కారు ఎందుకు అర్థం చేసుకోరు. జగన్ ప్రభుత్వం మీద మీకున్న ఫిర్యాదులు ఏమిటని సామాన్యుల్ని అడిగితే వారి నోటి నుంచి వచ్చే సమాధానాల్లో ముఖ్యమైనది చెత్త పన్ను. ఇలాంటి చెత్త పన్నును మరింత పక్కాగా రాబట్టేందుకే వేసే కొత్త ప్లాన్లతో మొదటికే మోసం తప్పించి.. ప్రభుత్వానికి మంచిపేరు ఎట్టి పరిస్థితుల్లో రాదన్న విషయాన్ని జగన్ అండ్ కో ఎందుకు గుర్తించరు? అన్నది ప్రశ్న.

ఇంట్లో వాడి పడేసే చెత్తను కలెక్టు చేయటానికి వీలుగా పలు పురపాలక సంఘాల్లో.. నగర పాలక సంస్థల్లో గరిష్ఠంగా రూ.30 నుంచి గరిష్ఠంగా రూ.120 చొప్పున వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిజానికి జగన్ సర్కారు అమలు చేసే వేలాది కోట్ల రూపాయిల సంక్షేమ పథకాలతో పోలిస్తే.. ఈ చెత్త పన్నుతో ప్రభుత్వానికి వచ్చేది పెద్ద మొత్తం కాదు. కానీ.. ఈ చెత్త పన్ను విధింపుపై జగన్ సర్కారు ప్రదర్శించే పట్టుదల మాత్రం విస్మయానికి గురి చేస్తుంది.

తాజాగా ఈ చెత్త పన్నును మరింత బాగా వసూలు చేయటానికి వీలుగా.. సరికొత్త ప్లానింగ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రజల మీద విధిస్తున్న చెత్త పన్ను భారంగా మారకుండా ఉండటానికి వీలుగా.. కొత్త విధానాన్ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం.. ఆస్తి పన్నును శ్లాబులుగా విభజించి వీటిపై చెత్త పన్ను విధించాలని డిసైడ్ చేసినట్లుగా చెబుతున్నారు. ఈ విధంగా అయితే ప్రజల మీద భారం పడినట్లు ఉండదని.. తాము అనుకున్న రీతిలో చెత్త పన్నును వసూలు చేయొచ్చని చెబుతున్నారు.విశాఖలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసే ఈ కొత్త విధానంలో ఆస్తి పన్ను శ్లాబులకు తగ్గట్లు చెత్త పన్నును డిసైడ్ చేస్తారు.

ఉదాహరణకు ఆరు నెలలకు కనిష్ఠంగా రూ.200 లోపు ఆస్తి పన్ను చెల్లించే కుటుంబాలు నెలకు రూ.20చొప్పున చెత్త పన్నుచెల్లించాలి. అదే సమయంలో ఆరునెలలకు గరిష్ఠంగా రూ.4వేలు అంతకంటే ఎక్కువ ఆస్తి పన్ను చెల్లించే కుటుంబాలు తమ చెత్త పన్ను కింద రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. నిజానికి ఈ చెత్త పన్ను కారణంగా ప్రభుత్వానికి మంచి పేరు కంటే.. చెడ్డపేరే ఎక్కువన్న విషయాన్ని మర్చిపోకూడదు. అంతేకాదు.. ఈ పన్ను మొత్తం వసూలు విషయంలో ప్రభుత్వ సిబ్బంది ఇబ్బందికి గురి అవుతున్నారు.

విశాఖపట్నం లాంటి నగరంలో గడిచిన ఆరు నెలల్లో రూ.35 కోట్ల చెత్త పన్ను లక్ష్యంలో కేవలం రూ12 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగారు. ఈ ఒక్క లెక్క చూస్తే.. చెత్త పన్నువసూలు ఎంత ఇబ్బందికరంగా మారింతో అర్థమవుతుంది. అందుకే.. ఈ చెత్త పన్ను మీద ఫోకస్ తగ్గించి.. దాని నుంచి ఎంత త్వరగా బయటపడితే.. అంత మంచిదన్న విషయం సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎప్పటికి అర్థమవుతుందో?