Begin typing your search above and press return to search.

యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అనుకుంటే...?

By:  Tupaki Desk   |   1 Dec 2021 3:05 PM IST
యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అనుకుంటే...?
X
ఏపీకి ఎందరో ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వారిలో దాదాపుగా ఎక్కువ మంది ష‌ష్టి పూర్తి దాటిన తరువాత కుర్చీ ఎక్కిన వారే. ఇక పిన్న వయసు ముఖ్యమంత్రులలో దామోదరం సంజీవయ్య, చంద్రబాబు, జగన్ లను చెప్పుకోవాలి. ఇక చంద్రబాబు ఎన్టీయార్ ని గద్దె దించి సీఎం అయ్యారు. సంజీవయ్య కాంగ్రెస్ అధినాయకత్వం ద్వారా సీఎం అయ్యారు. జగన్ పార్టీ పెట్టి జనాల వద్దకు వచ్చి నేరుగా వారి ఆశీస్సులతో సీఎం అయ్యారు. ఏపీలో చూసుకుంటే ఫిఫ్టీ మైనస్ నాయకత్వం కోసం అంతా ఎదురుచూసారు. యంగ్అండ్ డైనమిక్ లీడర్ షిప్ రావాలనుకున్నారు.

జగన్ కి బాబుకు మధ్య తేడాను చూసే ఆయనకు రెండవ సీఎం గా చాన్స్ ఇచ్చారు. బాబు ప్రతీ విషయంలోనూ నాన్చుడు ధోరణిని అనుసరించడం కూడా జగన్ కి కలసివచ్చింది. ఇక కేంద్రంతో దోస్తీగా ఉంటూ నాలుగేళ్ల పాటు విభజన హామీల ఊసెత్తలేదని, ప్రత్యేక హోదాని పడుక్కోపెట్టేశారని వైసీపీ అధినేతగా జగన్ విమర్శలు చేశారు. బాబుకు జగన్ కి మధ్య వయసులో చాలా తేడా ఉంది. జగన్ అగ్ర్రెస్సివ్ గా ఉంటారన్నది ఆయన పాలిటిక్స్ తెలియచేసింది. తలచుకుంటే ఢిల్లీని సైతం ఎదిరిస్తారని సోనియాగాంధీ ఎపిసోడ్ తో అవగతమైంది.

ఇక ఏపీ విభజనతో నష్టపోయిన ప్రజానీకానికి చంద్రబాబు నాన్చివేత ధోరణి మరింత ఇబ్బంది పెట్టింది. జగన్ అయితే సరైన మొనగాడిగా కేంద్రంతో ఢీ కొట్టి మరీ ఏపీకి కావాల్సినవన్నీ తీసుకువస్తారని అత్యధిక శాతం జనం నమ్మారు, అందుకే జగన్ కి బంపర్ మెజారిటీ దక్కింది. ఇక మరో విషయం చూస్తే జగన్ యంగ్ లీడర్ గా ట్రెడిషనల్ పాలిటిక్స్ కి దూరంగా పాలన చేస్తారని కూడా ఆశించారు. ఆయన పాలనలో కొత్తదనం కనిపిస్తుందని ఆశించారు.

అయితే సరిగ్గా రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకున్న జగన్ కంప్లీట్ రొటీన్ గానే వెళ్ళారన్న భావన జనంలో ఉండిపోయింది. ఆయన కూడా సంక్షేమ పధకాల ద్వారానే తన రాజకీయానికి పునాది వేసుకోవడం, మేధావుల్లో, యువతలో మాత్రం విమర్శల పాలు అవుతోంది. ఇక జగన్ విపక్షాల విషయంలో ముఖ్యంగా టీడీపీ చంద్రబాబు విషయంలో అనుసరిస్తున్న ఘర్షణాత్మకమైన వైఖరి కూడా రొటీన్ పాలిటిక్స్ గానే సాగుతోందని జనం భావిస్తున్నారు.

విభజన ఏపీకి కొత్త డైరెక్షన్ జగన్ తనదైన డైనమిక్ లీడర్ షిప్ తో ఇస్తారని అంతా అనుకున్నారు. అయితే జగన్ మాత్రం వయసులో యువకుడే అయినా పాత కాలం పాలిటిక్స్ నే చేస్తూ వస్తున్నారని కామెంట్స్ అయితే ఉన్నాయి. ఇక అభివృద్ధి విషయంలో న్యూ ట్రెండ్ క్రియేట్ చేసి ఉపాధికి పెద్ద పీట వేస్తారని, స్వతహాగా బిజినెస్ మాన్ అయిన జగన్ ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు తేగలరని కూడా యువత ఆశించింది. కానీ రెండున్నరేళ్ళలో మాత్రం అది మ‌చ్చుకైనా కనిపించలేదు. ఇక జగన్ కేంద్రం విషయంలో చంద్రబాబు కంటే కూడా ఎక్కువగా మెతకగా వ్యవహరిస్తున్నారు అన్నది మెజారిటీ జనాల భావనగా ఉంది. ఎందుకంటే ప్రత్యేక హోదా విషయంలో ఆయన సీఎం గా బాధ్యతలు స్వీకరించకుండానే కాడె వదిలేశారు.

కేంద్రానికి పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి మన‌మేం చేసినా చెల్లదు అన్నట్లుగా నీరు కార్చేలా మాట్లాడారు, విభజన హామీల విషయంలోనూ గట్టిగా నిలదీయడంలేదు, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవుతుందని భావిస్తే అది కూడా అలాగే ఉంది. పై పెచ్చు స్పీడ్ గా రాజధాని పనులు పూర్తి అవుతాయి అనుకుంటే మూడు రాజధానుల కుంపటి రగిలించి ఇంకా జటిలం చేశారు అన్న ఆవేదన కూడా ఏపీ జనాల్లో ఉంది. మొత్తానికి యంగ్ డైనమిక్ లీడర్ షిప్ అని కోటి ఆశలు పెట్టుకుని జగన్ని అందలం ఎక్కించిన వారికి అర్ధమవుతున్నది ఏంటీ అంటే అనుకున్నదేదీ జరగడంలేదని, మరి రేపటి ఎన్నికల్లో బాబుతో జగన్ పోటీ పడితే జగన్ యంగ్ లీడర్ షిప్ చార్డ్ మళ్లీ పనిచేస్తుందా. వెయిట్ అండ్ సీ.