Begin typing your search above and press return to search.

బాలినేనికి కీలక బాధ్యతలివ్వనున్న జగన్

By:  Tupaki Desk   |   4 Sept 2017 12:25 PM IST
బాలినేనికి కీలక బాధ్యతలివ్వనున్న జగన్
X
తెలుగుదేశం అధినేత చంద్రబాబును గట్టిగా ఎదుర్కొనాలంటే మరింత ప్రణాళికలు అవసరం అని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి స్పష్టం అయ్యింది. ఇప్పటి వరకూ చేసిన పనులు, తీసుకున్న చర్యలు, వేసిన ప్రణాళికలు సరిపోవు.. అనే భావనతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మరిన్ని మార్పుచేర్పులు చేపడుతున్నారని స్పష్టం అవుతోంది. అందులో భాగంగా జగన్ మోహన్ రెడ్డి పార్టీలో సీనియర్లకు మరింత ప్రాధాన్యతను పెంచుతున్నాడని తెలుస్తోంది. ప్రధానంగా కొంతమంది సీనియర్లు మరింత క్రియాశీలం అయ్యేలా జగన్ చర్యలు చేపట్టినట్టు సమాచారం.

ఇప్పుడు అందుతున్న సమాచారం ఏమిటంటే.. పార్టీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాస రెడ్డికి జగన్ కొత్త బాధ్యతలు అప్పగిస్తున్నాడనేది. ప్రకాశం జిల్లా అన్ని నియోజకవర్గాల బాధ్యతలనూ బాలినేనికి అప్పగించినున్నట్టుగా తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టు ఉన్న జిల్లా ప్రకాశం. పార్టీ గెలవలేకపోయినా 2014 సార్వత్రిక ఎన్నికల్లో కూడా ప్రకాశం జిల్లాలో సీట్లు బాగానే వచ్చాయి. అయితే.. ఇక్కడ కొన్ని ఫిరాయింపులు జరిగాయి.

ఈ నేపథ్యంలో ఈ జిల్లాలో పార్టీ కి ఉన్న అవకాశాలను పరిగణనలోకి తీసుకుని పార్టీని బలోపేతం చేయడాన్ని ప్రత్యామ్నాయాలను సిద్ధం చేయడానికి జగన్ ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలినేనికి జిల్లా బాధ్యతలు అప్పగిస్తున్నట్టు సమాచారం. నంద్యాల - కాకినాడ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బల నేపథ్యంలో..అందరినీ కలుపుకుపోగల సీనియర్ల నేతలకు బాధ్యతలు అప్పగించాలని జగన్ భావిస్తున్నాడు. అందులో భాగంగా ప్రకాశం బాధ్యతలను.. ఇక్కడి స్థానిక వ్యూహాలు, అభ్యర్థులను సమాయత్తం చేసే బాధ్యతలను జగన్ బాలినేనికి ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

బాలినేని రాజకీయాలకు ఎంత సీనియరో చెప్పనక్కర్లేదు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారాయన. వైఎస్ హయాంలో మంత్రిగా ఉండినారు. జగన్ పార్టీ పెట్టిన తర్వాత మంత్రి పదవికి రాజీనామా చేసి.. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన అనుభవం ఉంది బాలినేనికి. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించారు. వోటర్ల పల్స్ బాగా తెలిసిన నాయకుడు. ఈ నేపథ్యంలో ఆయనకు ఆ జిల్లా వరకూ పూర్తి బాధ్యతలు అప్పగించి.. పార్టీని మరింత బలోపేతం చేయాలని జగన్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.