Begin typing your search above and press return to search.

ఏడేళ్ల బాలుడి అభిమానానికి జ‌గ‌న్ భావోద్వేగం

By:  Tupaki Desk   |   22 April 2018 9:01 AM GMT
ఏడేళ్ల బాలుడి అభిమానానికి జ‌గ‌న్ భావోద్వేగం
X
సుదీర్ఘ పాద‌యాత్ర‌కు తెర తీసిన ఏపీ విప‌క్ష నేత‌.. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తాజాగా ఒక ఆస‌క్తిక‌ర అంశాన్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. మండే ఎండ‌ను ప‌ట్టించుకోకుండా.. చిరాకు పుట్టించే చురుకు సూరీడిని లెక్క చేయ‌కుండా.. చెమ‌ట‌లు క‌క్కుతున్నా.. పెదాల మీద న‌వ్వు చెద‌ర‌కుండా తను చూసేందుకు వ‌స్తున్న వేలాది మందిని ప‌లుక‌రిస్తూ ముందుకు సాగుతున్న ప‌య‌నంలో ఆస‌క్తిక‌ర ఉదంతం ఒక‌టి చోటు చేసుకుంది.

ఈ విష‌యాన్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు జ‌గ‌న్‌. ఆయ‌న ప్ర‌స్తావించిన అంశాన్ని చూసిన‌ప్పుడు భావోద్వేగంతో ఎవ‌రైనా క‌దిలిపోవాల్సిందే. ఇంత‌కూ ఏం జ‌రిగిందంటే.. చేతిలో ప‌ల‌క ప‌ట్టుకొని ఏడేళ్ల బాలుడ్ని తీసుకొని ఒక తండ్రి క‌లిశాడు. ప‌ల‌క మీద వైఎస్సార్ అనే అక్ష‌రాలు క‌నిపించాయి.

ఆస‌క్తితో ఏమిట‌ని ఆ పిల్లాడి తండ్రిని ఆరా తీశా. ఆశ్చ‌ర్య‌పోవ‌టం నా వంతైంది. ఐదేళ్ల క్రితం చిన్నారి న‌షీర్ తో అక్ష‌రాభ్యాసం చేస్తూ నేను అక్ష‌రాలు దిద్దించ‌పోతే.. వ‌ద్దంటూ ఆ తండ్రి వైఎస్సార్ అని దిద్దించాల‌ని కోరారు. ప‌లుక మీద నేను రాసిన వైఎస్సార్ అక్ష‌రాల్ని ఐదేళ్లుగా చెరిగిపోకుండా అలానే ఉంచేశారు. ఐదేళ్ల త‌ర్వాత ఇప్పుడు క‌లిసి.. అదే ప‌ల‌క‌ను చూపించారు. ఇంత‌కాలం భ‌ద్రంగా దాచిన ప‌ల‌క‌ను వారు చూపించి మురిసిపోతుంటే చాలా ఆనంద‌మేసింద‌న్నారు.

ఆ బాబును బాగా చ‌దివించి ఉన్న‌త స్థాయికి ఎదగాల‌ని దీవించాన‌ని పేర్కొన్నారు. పిల్లాడి ప‌ల‌క మీద వైఎస్సార్ అక్ష‌రాలను.. హృద‌య ఫ‌ల‌కంపై నాన్న‌గారి మీద ఉన్న ప్రేమ‌ను ప‌దిలంగా దాచుకున్న విస్స‌న్న‌పేట తండ్రీ కొడుకుల‌కు శుభాకాంక్ష‌లు చెప్పి ముందుకు న‌డిచాన‌ని పేర్కొన్నారు. వైఎస్సార్ మీద ఇదే త‌ర‌హాలో నిస్వార్థ‌మైన అభిమానం కోట్లాది మంది తెలుగువారి గుండెల్లో ఉంద‌న్న విష‌యం తాజా ఉదంతం మ‌రోసారి స్ప‌ష్టం చేసింద‌ని చెప్పాలి.