Begin typing your search above and press return to search.

సొంత జిల్లాలో బాబు మైండ్ బ్లాంక్ చేసిన జ‌గ‌న్‌

By:  Tupaki Desk   |   11 March 2020 2:09 PM GMT
సొంత జిల్లాలో బాబు మైండ్ బ్లాంక్ చేసిన జ‌గ‌న్‌
X
కీల‌క‌మైన స్థానిక ఎన్నిక‌ల త‌రుణం లో... తెలుగుదేశం పార్టీ అద్య‌క్షుడు, ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు టార్గెట్‌గా ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కీల‌క‌మైన టాస్క్ పూర్తి చేశారు. తాను ప్ర‌తిప‌క్షనేతగా ఉన్న స‌మ‌యంలో ఇర‌కాటంలో పెట్టేలా బాబు వేసిన ఎత్తుగ‌డ‌కు తాజాగా జ‌గ‌న్ ప్ర‌తీకారం తీసుకున్నారు. కీల‌క‌మైన జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గంలోని టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి వైసీపీ కండువా క‌ప్పారు.

టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు అధికారంలో ఉన్న స‌మ‌యంలో వైఎస్ జ‌గ‌న్‌ను ఆయ‌న జిల్లాలోనే టార్గెట్ చేశారు. కడప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగులో వైసీపీ త‌ర‌ఫున గెలిచిన ఆదినారాయణరెడ్డిని పార్టీలోకి తీసుకొని మంత్రిని చేశారు. త‌ద్వారా తేల్చుకోవాల్సింది జ‌గ‌నే అని కెలికి వ‌దిలేశారు. అయితే ఆదినారాయణ రెడ్డికి నియోజ‌క‌వ‌ర్గ సీనియ‌ర్ నేత‌ రామసుబ్బారెడ్డికి మ‌ధ్య తీవ్ర‌మైన విబేధాలు పొడ‌చూపాయి. దీనికి కార‌ణం జమ్మలమడుగు లో ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి వర్గాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి, దశాబ్దాల నుంచి ఆ కుటుంబాల మధ్య ఫ్యాక్షన్‌ గొడవలు ఉండ‌టం. అయితే, చంద్ర‌బాబు అనేక ద‌ఫాలుగా వారికి స‌ర్దిచెప్ప‌డం తో అవి స‌ద్దుమ‌ణిగిన‌ట్లు క‌నిపించాయి.

కాగా, రామసుబ్బారెడ్డి మాత్రం త‌న‌కు అన్యాయం జ‌రిగింద‌నే భావ‌న‌ లో ఉండ‌టమే కాకుండా తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధ‌మ‌య్యారు. అనంత‌రం వైసీపీ నేత‌ల‌ తో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి స‌మావేశమ‌య్యారు. తాజాగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. దీంతో జ‌గ‌న్‌కు సొంత జిల్లాలో షాక్ ఇవ్వాల‌నుకున్న చంద్ర‌బాబుకు ఇప్పుడు జ‌గ‌న్ షాక్ ఇచ్చారు.