Begin typing your search above and press return to search.

జగన్ మాస్టర్ స్ట్రోక్..ఎస్సీలకు మూడు ప్రత్యేక కార్పొరేషన్లు!

By:  Tupaki Desk   |   25 Aug 2019 9:06 PM IST
జగన్ మాస్టర్ స్ట్రోక్..ఎస్సీలకు మూడు ప్రత్యేక కార్పొరేషన్లు!
X
ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... పాలనలో తనదైన మార్కు చూపిస్తున్నారు. సీఎంగా పదవీ ప్రమాణం చేసిన రోజుననే... రాష్ట్రంలో అప్పటిదాకా జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ చేస్తామంటూ సంచలన ప్రకటన చేసిన జగన్... ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మాదిగలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నా... ఏమాత్రం పట్టించుకోనట్టే కనిపించారు. అయితే ఇప్పుడు జగన్ సర్కారు తీసుకున్న తాజా నిర్ణయంతో అసలు ఎస్సీల్లో ఏ ఒక్క వర్గం కూడా ఆయనను విమర్శించే అవకాశం లేకుండా పోయిందన్న వాదన వినిపిస్తోంది. ఎస్సీల్లోని ప్రధాన వర్గాలుగా ఉన్న మాల, మాదిగలతో పాటు రెల్లీ కులస్థులకు కూడా ప్రత్యేకంగా వేర్వేరు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీలను విభజించాలంటూ మాదిగలు పెద్ద ఎత్తున ఉద్యమం లేవనెత్తారు. మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో కొన్నేళ్ల పాటు సాగిన ఉద్యమంలో భాగంగా ఎస్సీలకు అందుతున్న ప్రభుత్వ పథకాల్లో మెజారిటీ వాటాను మాలలే అనుభవిస్తున్నారని - ఆర్థికంగా బాగా వెనుకబడిన మాదిగలు - రెల్లీలు ఈ అవకాశాలను అందుకోలేకపోతున్నారని పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంపై ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న సమయంలో నారా చంద్రబాబునాయుడు ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే సుప్రీంకోర్టు ఈ నిర్ణయాన్ని తప్పుబట్టడంతో పాటుగా విభజనను కొట్టేసింది. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగానే వ్యవహరించారు. అయితే జగన్ మాత్రం మాలలకు అనుకూలంగా ఉన్నారంటూ మాదిగలు చాలా కాలం నుంచి ఆరోపణలు చేస్తున్నారు. వర్గీకరణపై మీ స్టాండేమిటో చెప్పాలని కూడా మాదిగలు జగన్ ను డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే మళ్లీ ఉద్యమం ప్రారంభమవుతున్నట్లుగా సంకేతాలు వెలువడుతున్నాయి.

ఈ మొత్తం తతంగంపై ఏమాత్రం నోరు విప్పని జగన్... ఎస్సీల్లో ఏ ఒక్క వర్గం కూడా తనపై విమర్శలు సంధించలేని రీతిలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాల - మాదిగ - రెల్లీ కులాలకు వేర్వేరుగా ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ ఆదివారం సాయంత్రం జగన్ సర్కారు సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఇప్పటిదాకా ఎస్సీలకు గంపగుత్తగా రుణాలు అందిస్తున్న ఎస్సీ కార్పొరేషన్ ఉనికి కోల్పోనుండగా... ఇకపై ఎస్సీల్లోని ఆయా వర్గాలకు మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు కానున్నాయి. ఈ నిర్ణయంతో ఎస్సీల్లోని ఆయా వర్గాలకు కేటాయించే నిధులు ఇతర వర్గాలకు డైవర్ట్ కాకుండా ఉంటాయన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఎస్సీల్లోని ఏ ఒక్క వర్గం నుంచి కూడా జగన్ కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమయ్యే అవకాశాలు లేవన్న వాదన వినిపిస్తోంది.