Begin typing your search above and press return to search.

బాబును ఫాలో అయి.. జగన్ బుక్..?

By:  Tupaki Desk   |   18 Oct 2015 10:40 AM IST
బాబును ఫాలో అయి.. జగన్ బుక్..?
X
ఎవరిని గుడ్డిగా ఫాలో కాకూడదు. సమయం.. సందర్భం రెండూ చూసుకోవాలి. సొంతంగా కాస్త బుర్ర పెట్టాలి. ఒకప్పుడు విపక్ష నేతగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయం అప్పట్లో అయనకు సానుకూలంగా మారితే.. ఇప్పుడు అలాంటి నిర్ణయమే ఏపీ విపక్ష నేత జగన్ ను విమర్శలు వెల్లువెత్తేలా చేసింది.

ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన సాక్షి మీడియాను ప్రారంభించారు. ఈ వేడుకకు నాటి విపక్ష నేత చంద్రబాబును ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు వెళతారా? అన్న ప్రశ్న చాలామందిలో వచ్చింది. అయితే.. చంద్రబాబు మాత్రం తాను వెళ్లనంటే వెళ్లనని తేల్చి చెప్పేశారు. ఎందుకంటే.. లక్ష కోట్ల అవినీతితో సాక్షి మీడియాను ఏర్పాటు చేస్తున్నారని.. ప్రజల్ని వంచించి.. వారిని మోసం చేసి సంపాదించిన డబ్బుతో ఏర్పాటు చేసిన మీడియా సంస్థ కార్యక్రమానికి తాను హాజరు కాలేనని తెగేసి చెప్పారు.

కట్ చేస్తే.. తాజాగా ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి విపక్ష నేతగా వ్యవహరిస్తున్న జగన్.. ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలే చేయటం గమనార్హం. లక్ష కోట్ల అవినీతితో నిర్మిస్తున్న అమరావతి శంకుస్థాపనకు.. రైతులు వ్యతిరేకమని.. వారి దగ్గర నుంచి బలవంతంగా భూములు తీసుకున్నారని.. అందుకే తాను శంకుస్థాపన కార్యక్రమానికి రానంటూ వ్యాఖ్యానించారు.

సాక్షి విషయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయానికి ప్రజలతో నేరుగా ఎలాంటి సంబంధం లేదు. ఇంకా చెప్పాలంటే అదో ప్రైవేట్ కార్యక్రమం. దీనికి హాజరైనా హాజరు కాకున్నా ప్రజలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ.. అమరావతి శంకుస్థాపన కార్యక్రమం అలా కాదు. అది ఏపీ ప్రజలకు సంబంధించిన కార్యక్రమం. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమం. దీనికి రాజకీయ విద్వేషాలు అంటించి.. కార్యక్రమానికి హాజరు కానంటే.. అది సీమాంధ్రుల్ని అవమానపర్చినట్లేనన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది.

గైర్హాజరీ విషయంలో ఒకప్పటి చంద్రబాబు తీసుకున్న నిర్ణయం లాంటిదే జగన్ తీసుకున్నట్లు కనిపిస్తుంది. అయితే.. చంద్రబాబు నాడు తీసుకున్న నిర్ణయానికి పలువురు ఆమోదం పలికితే.. తాజాగా జగన్ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ రాష్ట్ర ప్రోటోకాల్ ను చూస్తే.. గవర్నర్.. ముఖ్యమంత్రి తర్వాత ప్రాధాన్యత ఇచ్చేది విపక్ష నేతకే. అయినప్పటికీ జగన్ మాత్రం అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని పర్సనల్ గా తీసుకొని హాజరు కానని చెప్పటం పలు విమర్శలకు దారి తీస్తోంది.