Begin typing your search above and press return to search.

బలమైన సామాజిక వర్గంపై జగన్ ఫోకస్

By:  Tupaki Desk   |   5 Jan 2023 9:00 PM IST
బలమైన సామాజిక వర్గంపై జగన్ ఫోకస్
X
వచ్చే ఎన్నికల్లో కలసి వచ్చే కుల రాజకీయ సమీకరణల మీద ఇపుడు వైసీపీ దృష్టి ఉంది. ఏపీలో చూస్తే ఎన్నికలు అంటే సంకుల సమరమే అని చెప్పాలి. ప్రతీ అభ్యర్ధి ఎంపిక వెనక కుల ప్రాతిపదికను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో చూసుకుంటే బలమైన సామాజికవర్గంగా గవరలు ఉన్నారు.

వీరు గతంలో కాంగ్రెస్ వైపు ఉన్నా తెలుగుదేశం పార్టీ ఏర్పాటు తో ఆ వైపుగా కదిలారు. 1983 నుంచి చూసుకుంటే టీడీపీకే మెజారిటీ గవరల సపోర్ట్ దక్కుతూ వస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో అరడజం సీట్లతో పాటు ఎంపీ సీటుని సైతం ప్రభావితం చేయగలిగే స్థాయిలో గవరలు ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గవరలకు మంచి ప్రాధాన్యత దక్కింది. క్యాబినెట్ ర్యాంక్ మంత్రి పదవులు వారిని వరించి వచ్చాయి.

అలా దాడి వీరభద్రరావు పలు మార్లు మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ తరఫున కొణతాల రామక్రిష్ణకు అవకాశాలు దక్కాయి. వైసీపీలో మాత్రం సరైన ప్రాధాన్యత లేదని గవరలలో అసంతృప్తి ఉంది. ఇంతటి జగన్ వేవ్ లో కూడా టీడీపీ తరఫున ఆసామాజిక వర్గానికి ఎమ్మెల్యేగా గణబాబు ఉన్నారు. అలాగే ఎమ్మెల్సీ పదవులు కూడా ఇచ్చారు. వైసీపీ అనకాపల్లి ఎంపీ టికెట్ ని భీశెట్టి సత్యవతికి ఇస్తే ఆమె గెలిచారు.

అయితే తమకు పట్టున్న అనకాపల్లి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లతో పాటు, ఎలమంచిలి, మాడుగుల, విశాఖ పశ్చిమ సీట్లను గవరలు కోరుతున్నారని అంటున్నారు. దీని మీద వైసీపీ ఏమాలోచిస్తోందో తెలియడం లేదు అని అంటున్నారు. ఇక అనకాపల్లి ఎమ్మెల్యేగా ప్రస్తుత మంత్రి గుడివాడ అమరనాధ్ ఉన్నారు. ఆయనకు కాకుండా వచ్చే ఎన్నికల్లో లోకల్ అయిన గవరలకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ వస్తోంది.

ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గవర సామాజికవర్గానికి చెందిన బిగ్ షాట్, ఆంధ్రా కురియన్ గా పేరుపొందిన విశాఖ డైరీ చైర్మన్ ఆడారి తులసీరావు మరణం సందర్భంగా సంతాపం వ్యక్తం చేయడమే కాకుండా నేరుగా ఎలమంచిలిలో ఉన్న ఆయన నివాసానికి వచ్చి భౌతిక కాయానికి నివాళి అర్పించారు. ఆడారి డైరీ రంగానికి చేసిన సేవలను కొనియాడారు.

ఆడారి తులసీరావు రాజకీయంగా ఎపుడూ పదవులు అలంకరించలేదు. ఆయన సర్పంచ్ గా మాత్రమే పనిచేశారు. ఇక ఆయన విశాఖ జిల్లాలో మంచి బలం పలుకుబడి కలిగిన నాయకునిగా ఎదిగారు. ఆయన దివంగత నాయకుడు ఎన్టీయార్ కి బహు ఇష్టుడు. ఎన్టీయార్ తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించి ఎంపీ ఎమ్మెల్యే టికెట్లను ఆఫర్ చేసినా ఆడారి వద్దు అని సున్నితంగా తిరస్కరించారని చెబుతారు. ఆయన ఏ పార్టీకి మద్దతుగా ఉంటే ఆ పార్టీ అభ్యర్ధులు గెలుపు ఖాయమని కూడా ప్రచారంలో ఉన్న మాట.

ఆ విధంగా ఆడారి తెలుగుదేశం పార్టీకి దశాబ్దాల కాలం పాటు గట్టి మద్దతుదారుగా తెర వెనక ఉంటూ వచ్చారు. ఆయన కుటుంబం 2019 ఎన్నికల తరువాత వైసీపీలోకి షిఫ్ట్ అయింది. కుమార్తె రమాదేవి ఎలమంచిలి మునిసిపల్ చైర్ పర్సన్ గా ఉన్నారు. కుమారుడు ఆనంద్ విశాఖ పశ్చిమ నియోజకవర్గం పార్టీ ఇంచార్జిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఖాయమని అంటున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే జగన్ స్వయంగా వచ్చి ఆడారి భౌతిక కాయానికి ఘన నివాళి అర్పించడం ద్వారా బలమైన గవర సామాజిక వర్గాన్ని మరింత దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కువ టికెట్లు బీసీలకు కేటాయించాలని చూస్తున్న వైసీపీ గవర్లకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా విశాఖ గ్రామీణ ప్రాంతంలో తెలుగుదేశాన్ని గట్టి దెబ్బ తీయాలని చూస్తోంది. ఆడారికి సీఎం వచ్చి నివాళి అర్పించడం పట్ల మాత్రం ఆ సామాజికవర్గంలో ఆనందం వ్యక్తం అవుతోంది. గవరలు రేపటి ఎన్నికల్లో ఏ వైపు గట్టిగా నిలబడతారు అన్నది చూడాల్సి ఉంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.