Begin typing your search above and press return to search.

కేసీఆర్ నిర్ణ‌యం చూసైనా..మారు బాబు-జ‌గ‌న్‌

By:  Tupaki Desk   |   24 April 2018 10:54 AM GMT
కేసీఆర్ నిర్ణ‌యం చూసైనా..మారు బాబు-జ‌గ‌న్‌
X
ఆడ‌బిడ్డ‌ల విష‌యంలో ఆంధ్ర‌ప్రదేశ్ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌ - ఏపీ విప‌క్ష నేత‌ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మండిప‌డ్డారు. అంగన్‌వాడీ వర్కర్లపై లాఠీచార్జ్‌ ని వైఎస్‌ జగన్‌ ఖండించారు. మహిళలపై దాడి చేయడం అమానుషమని ఆయ‌న పేర్కొన్నారు. ప్ర‌జా సంక‌ల్పయాత్ర‌లో ఉన్న వైఎస్ జ‌గ‌న్ ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అన్ని విధానాల్లో డ‌బుల్ స్టాండర్డ్స్ పాటిస్తోంద‌ని మండిప‌డ్డారు. ఓ వైపు మహిళా సాధికారత అని మాట్లాడుతూ..మహిళలపై దాడి చేయడం అమానుషమని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

విజయనగరం కలెక్టరేట్‌ వద్ద త‌మ‌ హక్కుల సాధనకు అంగన్‌వాడీ వర్కర్లు శాంతియుతంగా ఆందోళన చేస్తుండగా వారిపై పోలీసులు లాఠీచార్జీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న పట్ల వైఎస్‌ జగన్ మండిప‌డ్డారు. ప్ర‌భుత్వం తీరును ఆయ‌న తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో అంగన్‌వాడీ వర్కర్లకు జీతాలు పెంచారని, ఏపీలో పెంచకపోవడం మీకు సిగ్గుగా అనిపించడం లేదా అని చంద్రబాబును వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా నిలదీశారు. ఇప్ప‌టికే పార్టీ త‌ర‌ఫున ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాల్లో అంగ‌న్‌వాడీల సంక్షేమం కోసం కూడా వైసీపీ ప‌లు నిర్ణ‌యాలు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

మ‌రోవైపు అంగ‌న్‌వాడీల సంక్షేమం విష‌యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ విప్ల‌వాత్మ‌క రీతిలో వ్య‌వ‌హ‌రించారనే అభిప్రాయం ఉంది. చ‌రిత్ర‌లో ఏ ముఖ్య‌మంత్రి చేయ‌ని విధంగా...అంగ‌న్‌ వాడీ కార్య‌క‌ర్త‌ల‌ను ముఖ్య‌మంత్రి నివాసానికి ఆహ్వానించిన కేసీఆర్ వారితో దాదాపు మూడు గంట‌ల పాటు స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా వారికి భోజ‌న ఏర్పాట్లు కూడా చేసి అనంత‌రం వారితో మాట్లాడుతూ అంగ‌న్‌ వాడీల సంక్షేమానికి ప‌లు నిర్ణ‌యాలు ప్ర‌క‌టించారు. అందులో ప్ర‌ధాన‌మైన‌ది వేత‌న పెంపు.