Begin typing your search above and press return to search.

హోదా పేరుతో బాబుపై చెలరేగిపోయిన జగన్

By:  Tupaki Desk   |   11 May 2016 10:16 AM IST
హోదా పేరుతో బాబుపై చెలరేగిపోయిన జగన్
X
తనను దెబ్బ మీద దెబ్బ తీస్తున్న చంద్రబాబుపై నిప్పులు చెరిగారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తన పార్టీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేల్ని సైకిల్ ఎక్కించిన తీరుపై చెలరేగిపోయిన జగన్.. ప్రత్యేక హోదా సాధనలో చంద్రబాబు ఎంత విఫలమయ్యారన్న విషయాన్ని స్పష్టం చేయటంతో పాటు.. ప్రత్యేకహోదా మీద కేంద్రాన్ని చంద్రబాబు ఎందుకు నిలదీయటం లేదన్న పాయింట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేస్తూ ఆడియో.. వీడియో టేపుల్లో బాబు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన వైనం తెలిసిందేనని.. ఈ వ్యహారంలో తనకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకే ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని బలంగా నిలదీయలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. కేంద్రంలోని మోడీ సర్కారుకు అల్టిమేటం జారీ చేసి.. గడువు లోపు ప్రత్యేక హోదా ఇవ్వని పక్షంలో ప్రభుత్వం నుంచి వైదొలుగుతానని చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోతున్నారని జగన్ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఏపీలో సాగుతున్న ధర్నాల్లో భాగంగా కాకినాడలో జరిగిన ధర్నాలో జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

తమ పార్టీ ఎమ్మెల్యేల్ని రూ.20.. రూ.30 కోట్ల చొప్పున ఇస్తూ తనవైపు తిప్పుకుంటున్నారని.. ఇందుకోసం దాదాపు రూ500 కోట్ల బ్లాక్ మనీని బాబు వినియోగిస్తున్నారని.. ఇదంతా ఎక్కడి నుంచి.. ఎలా వచ్చిందని జగన్ నిలదీశారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రజల్ని చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని.. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా పదిహేనేళ్లు కావాలన్న ఆయన.. ఇప్పుడు హోదా సంజీవిని కాదంటూ మాట మారుస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. కోడలు మగ పిల్లాడ్ని కనాలనుకుంటే అత్త వద్దంటుందా? అంటూ చురకలేసిన జగన్.. ప్రత్యేక హోదా మీద బాబు మారిన స్వరాన్ని ప్రజలకు స్పష్టం చేసేపని చేశారు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి చాలా అవసరమని.. హోదా ఏపీకి సంజీవనేనని జగన్ స్పష్టం చేశారు. మొత్తంగా హోదా మీద బాబు ఇప్పుడు అనుసరిస్తున్న వైఖరిని దుమ్మెత్తి పోయటంలో జగన్ విజయవంతం అయ్యారని చెప్పొచ్చు. జగన్ ఎదురుదాడి నేపథ్యంలో గతంలో మాదిరి హోదా విషయంలో బాబు ఆచితూచి వ్యవహరించే అవకాశం లేనట్లేనని చెప్పొచ్చు.