Begin typing your search above and press return to search.

360 డిగ్రీస్ లో బాబును ఏసుకున్న జ‌గ‌న్

By:  Tupaki Desk   |   8 May 2018 5:55 AM GMT
360 డిగ్రీస్ లో బాబును ఏసుకున్న జ‌గ‌న్
X
బాబు చేసే త‌ప్పుల్పి గ‌డ‌గ‌డా చెప్పేయ‌టంలో ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి సాటి వ‌చ్చే వారెవ‌రూ క‌నిపించ‌రు. బాబు చేసే త‌ప్పుల్ని పొల్లు పోకుండా చెప్పే జ‌గ‌న్‌.. ఏపీకి జ‌రుగుతున్న న‌ష్టం ఆయ‌న్ను తీవ్ర ఆగ్ర‌హానికి గుర‌య్యేలా చేస్తుంది. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా చేస్తున్న పాద‌యాత్ర ప్ర‌స్తుతం కృష్ణా జిల్లాలో సాగుతోంది. గుడివాడ‌లో ఏర్పాటు చేసిన భారీ బ‌హిరంగ స‌భ‌కు హాజ‌రైన అశేష ప్ర‌జానీకాన్ని ఉద్దేశించి జ‌గ‌న్ చేసిన ప్ర‌సంగం ఈ మ‌ధ్య‌న ఆయ‌న చేసిన వాటిల్లో గుర్తుంచుకోవాల్సిందిగా చెబుతున్నారు.

నిప్పులు చెరుగుతున్న సూరీడితో పోటీ ప‌డేలా బాబుపై నిప్పులు చెరిగిన జ‌గ‌న్‌.. ఏపీ ముఖ్య‌మంత్రి హోదాలో చేసిన త‌ప్పుల్ని ఒక్కొక్క‌టిగా చెప్పుకొచ్చారు. అంతేకాదు.. బాబు త‌ప్పుల్ని తాము అధికారంలోకి వ‌చ్చాక ఎలా స‌రి చేస్తామో వివ‌రించ‌టం క‌నిపిస్తుంది. సూటిగా.. స్ప‌ష్టంగా బాబు కార‌ణంగా ఏపీకి జ‌రుగుతున్న న‌ష్టాన్ని జ‌గ‌న్ త‌న‌దైన శైలిలో చెప్పుకొచ్చారు. కృష్ణా జిల్లా ప్ర‌జానీకం బాబు గురించి ఏం అనుకుంటుందో చెప్పిన వైనం జ‌గ‌న్ స్పీచ్ లో హైలెట్‌ గా నిలుస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

మా జిల్లాకు ఇల్ల‌రికంగా వ‌చ్చిన అల్లుడుగారు మామ ఎన్టీఆర్ కుర్చీనే కాదు.. ఆయ‌న పార్టీని.. ఆయ‌న ఇంటిని.. చివ‌ర‌కు రాష్ట్రాన్ని కూడా దోచేశాడ‌ని కృష్ణా జిల్లా ప్ర‌జ‌లు అనుకుంటున్నారంటూ విరుచుకుప‌డిన జ‌గ‌న్‌.. బాబు పాల‌న‌లో జ‌రిగిన త‌ప్పుల్ని ఏక‌రువు పెట్టారు.

జ‌గ‌న్ ప్ర‌సంగంలోని కీల‌క వ్యాఖ్య‌ల్ని చూస్తే..

+ వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు గుడివాడలో 1500 మందికి ఇళ్లు కట్టించారు. 600 మంది తాపీ పని వారికి కూడా ఇళ్లు కట్టించారని ఇక్కడి ప్రజలు చెప్పారు. ఆ తర్వాత ఈ పరిసరాల్లోనే మరో 100 ఎకరాలు కొనుగోలు చేసి వాటిని ప్లాట్లు చేసి పంపిణీ కూడా చేశారని, మా ఖర్మ కొద్దీ చంద్రబాబు సీఎం అయ్యాక ఆ ప్లాట్లను వెనక్కు తీసేసుకుంటున్నారని అందరూ వాపోతున్నారు.

+ ప్ర‌జ‌ల‌ వద్ద నుంచి తీసుకున్న వంద ఎకరాల భూమిలో చంద్ర‌బాబు పెద్ద కుంభకోణానికి పాల్పడుతున్నాడు. పేదవాడికి ఇచ్చే ఇళ్లలో కూడా అవినీతి చేసి దోచుకోవాలనే స్థాయికి చంద్రబాబు దిగజారిపోయాడు. ఈ వంద ఎకరాల స్థలంలో పేదవారికి ఫ్లాట్లు కట్టిస్తాడట. 300 అడుగుల ఈ ఫ్లాటు ధర రూ.6 లక్షలట.

+ వాస్తవానికి లిప్టు - గ్రానైట్‌ ఫ్లోరింగ్ - చెక్క సామానులేని ఈ తరహా ఇంటికి అడుగు రూ.1000 కంటే ఎక్కువ కాదు. కానీ ఇక్కడ చంద్రబాబు.. అడుగు రూ.2 వేలు చొప్పున పేదవాడికి మొత్తం రూ.6 లక్షలకు ఇస్తున్నాడు. ఈ మొత్తంలో రూ. 1.50 లక్షలు కేంద్రం ఇస్తే మరో రూ.1.50 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మిగతా రూ.3 లక్షల మొత్తాన్ని 20 ఏళ్ల పాటు ఆ పేదవాడు కడుతూనే ఉండాలట. చంద్రబాబు తీసుకునే లంచాల కోసం పేదవాడిపై భారమా? ఇంతకంటే దారుణం, అన్యాయం ఏమైనా ఉంటుందా?

+ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి రేపో మాపో చంద్రబాబు ఈ ఫ్లాట్లను ఇస్తాడు. తీసుకోండి.. మీ పేరు మీద ఉన్న ఆ రూ.3 లక్షల అప్పు నేను తీసుకుంటాను. మనందరి ప్రభుత్వం రాగానే మీరు ఆ అప్పు కట్టాల్సిన అవసరం లేకుండా చేస్తాను. పేదవాడిని కూడా వదలకుండా కుంభకోణాలకు పాల్పడిన చంద్రబాబు, ఆ కాంట్రాక్టర్‌ ఇద్దరినీ ఎక్కడ బొక్కలో పెట్టాలో అక్కడ పెడతాం.

+ చంద్రబాబు ఎన్టీఆర్‌ కు వెన్నుపోటు పొడిచినట్లు ప్రత్యేక హోదా విషయంలో కూడా ఐదు కోట్ల మంది ఆంధ్రులకు వెన్నుపోటు పొడిచారు. హోదా వస్తే ఇన్‌ కంటాక్స్ - జీఎస్టీ కట్టాల్సిన అవసరం ఉండదు. అప్పుడు పరిశ్రమలు, ఆసుపత్రులు - హోటళ్లు కట్టేందుకు ముందుకు వస్తారు. మన విద్యార్థులకు, యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువగా వస్తాయి. ప్రత్యేక హోదా వల్ల ఈ మేళ్లు జరుగుతాయని తెలిసి కూడా నాలుగేళ్లుగా చంద్రబాబు రోజుకో డ్రామా ఆడుతున్నారు

+ చంద్రబాబు చేస్తున్న యాక్టింగ్‌ చూస్తుంటే ఆస్కార్, నంది అవార్డులుకాని పద్మభూషణ్‌లు కాని ఇచ్చేవారు ఉత్తమ విలన్‌ అవార్డును చంద్రబాబుకే ఇచ్చేవారు. ప్రత్యేక హోదా కోసం ఒక పూట నిరాహార దీక్షకు పూనుకున్నాడు. అది కూడా ఆయన పుట్టిన రోజు ఏప్రిల్‌ 20వ తేదీన. ఏప్రిల్‌ అంటే 4వ నెల.. పుట్టింది 20 తేదీ. ఈ రెండు కలిపితే 420 అవుతుంది.

+ నాలుగేళ్లుగా రాష్ట్రంలో మహిళలపై దౌర్జన్యాలు, అత్యాచారాలు జరుగుతుంటే ఈ పెద్ద మనిషి ఏం చేస్తున్నారు? ఏడాదిలో ఎన్నికలు వస్తున్నాయని ఇప్పుడు నిద్రలేచి కొవ్వొత్తి పట్టుకొని తిరుగుతానంటున్నాడు. మొన్న ఏడీఆర్‌ అనే సంస్థ విడుదల చేసిన నివేదికలో దేశ వ్యాప్తంగా మహిళలపై నేరాలు చేసిన మంత్రులు ఐదుగురు ఉంటే చంద్రబాబు మంత్రి వర్గంలో ఇద్దరు ఉన్నారు. వారిని తన కేబినెట్‌లో కొనసాగిస్తూ ఈ పెద్ద మనిషి ఇప్పుడు కొవ్వొత్తి పట్టుకొని నడుస్తాడట.

+ గుడివాడ నియోజకవర్గంలో రైతులు వడ్లు, మినుములను రోడ్డుపైనే తగులబెట్టారు. దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో రెండు పంటలకు నీళ్లిచ్చారని ఆ రైతులు నాతో చెప్పారు. చంద్రబాబు సీఎం అయ్యాక రెండో పంటకు నీళ్లు రాని పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు.

+ నిజంగా పట్టిసీమ వల్ల చంద్రబాబు చెప్పినట్లుగా మేలు జరిగి ఉంటే ఇక్కడ రెండో పంటకు నీళ్లు వచ్చి ఉండేవి కాదా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు రాయలసీమకు వెళ్లి.. కృష్ణా ప్రాంతంలో పట్టిసీమ నీళ్లతో రైతులు బంగారం పండిస్తున్నారని చెబుతారు. ఇక్కడకు వచ్చి రాయలసీమను పట్టిసీమ నీళ్లతో సస్యశ్యామలం చేశానని చెబుతాడు.

+ ఇవాళ వరికి మద్ధతు ధర రూ.1550 అయితే మార్కెట్లో రూ.1130 మాత్రమే లభిస్తోంది. మినుము మద్ధతు ధర రూ.5400 అయితే మార్కెట్లో రూ.4200 కూడా రావడం లేదు. రైతులు ధాన్యంతో మార్కెట్‌కు వెళితే చంద్రబాబుకు చెందిన దళారీలు రంగంలోకి దిగి తక్కువ ధరకు కొంటారట.

+ గుడివాడ నియోజకవర్గంలో 30 వేల ఎకరాల్లో రైతులు చేపలు - రొయ్యలు సాగు చేస్తున్నారు. నీళ్లు లేక దిగుబడి తక్కువై అమ్ముకోవడానికి పోతే వ్యాపారులంతా సిండికేట్‌ గా మారడం వల్ల కేజీ రూ.110 ఉండాల్సిన చేపల ధర రూ.80 కూడా పలకడం లేదట. 40 కౌంట్‌ రొయ్యల ధర రూ.460 నుంచి రూ.240కి పడిపోయింది. ఎలా బతకాలన్నా అని రైతులు ప్రశ్నిస్తున్నారు

+ రాష్ట్రంలో అగ్రిగోల్డ్‌ బాధితులను చూసినప్పుడు నా కడుపు తరుక్కుపోతోంది. రూపాయి రూపాయి కూడబెట్టుకున్న డబ్బును మంచి రాబడి వస్తుందని అగ్రిగోల్డ్‌లో దాచుకున్నారు. అలా పెట్టినందుకు ఇవాళ వారంతా అవస్థలు పడుతున్నారు. ఇవాళ రూ.1100 కోట్లు ఇస్తే వాళ్లలో 80 శాతం మందికి మేలు జరుగుతుంది. అయినా బాబు పట్టించుకోడు. వారికి తోడుగా నిలబడకుండా ఆ ఆస్తులను ఎలా కాజేయాలని ఆలోచిస్తున్నాడు.

+ చంద్రబాబు ప్రత్యేక హోదా కోసమని చెప్పి ఢిల్లీ వెళ్లినట్లు బిల్డప్‌ ఇచ్చారు. దేశ రాజకీయాలను తిప్పేస్తాడని చెప్పి ఆయనకు చెందిన పేపరు - టీవీలు ఊదరగొట్టాయి. కానీ ఈ పెద్ద మనిషి ఢిల్లీ వెళ్లి చేసిందేమిటంటే.. అర్థరాత్రి పూట అమర్‌సింగ్‌ను కలిశాడు. అర్థరాత్రిపూట ఎస్‌ఎల్‌ గ్రూపు యాజమాన్యాన్ని కలిశాడు. వాళ్లతో కలిసి బ్రోకర్‌ మాదిరిగా బేరాలు ఆడారు.

+ అగ్రిగోల్డ్‌ ఆస్తుల మార్కెట్‌ విలువ ఇంతకుముందు రూ.35 వేల కోట్లు అన్నారు. చంద్రబాబు ఆధీనంలోని సీఐడీ దర్యాప్తు చేసి దాని విలువ రూ.10 వేల కోట్లు అని తగ్గించేసింది. సీఐడీ చంద్రబాబు చేతుల్లోనిదే కదా? ఇదయ్యాక చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బ్రోకర్‌ పని చేశాడు. అమర్‌సింగ్, ఎస్‌ఎల్‌ గ్రూపు వాళ్లు కోర్టుకు వచ్చి అగ్రిగోల్డ్‌ ఆస్తులకు తాము రూ.4200 కోట్ల కంటే ఎక్కువ ఇవ్వలేమని చెప్పారు. ఎంత దిక్కుమాలిన వ్యవహారమో చూడండి.

+ ప్రతి చిన్న దానికి పబ్లిసిటీ ఇచ్చుకునే చంద్రబాబు ఈ విషయాన్ని మాత్రం బయటకు రానీయకుండా జగ్రత్తపడ్డాడు. చంద్రబాబు ఖర్మ కొద్దీ ఆ విషయం మనకు తెలిసింది. దాన్ని మనం అదరగొట్టేశాం. విషయం బయటకు వచ్చిందని తెలిసిన తర్వాత తేలు కుట్టిన దొంగలా గింజుకుంటున్నాడు. చీకట్లో అమర్‌సింగ్‌ను, ఎస్‌ఎల్‌ గ్రూపును కలిసి అగ్రిగోల్డ్‌ ఆస్తులను కాజేయాలని చూసిన ఈ వ్యక్తి అసలు మనిషేనా?

+ పిల్లలను ఉన్నత చదువులు చదివించినప్పుడో, కుటుంబీకులకు పెద్ద జబ్బు వచ్చినప్పుడో పేదలు అప్పులపాలవుతారని దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి చెప్పేవారు. వాళ్ల జీవితాలు చెదిరిపోకూడదనే ఉద్దేశంతోనే ఆయన ‘ఆరోగ్య శ్రీ’ ప్రారంభించారు. ఆ పథకం ద్వారా ఎంతో మంది ప్రజలు ఉచితంగా ఆపరేషన్లు చేయించుకున్నారు. కానీ నాలుగేళ్లుగా పరిస్థితి దారుణంగా తయారైంది. ఆరోగ్య శ్రీ కార్డు పట్టుకుని హైదరాబాద్‌ కు పోతే.. ఏపీ కార్డులు అక్కడ చెల్లవని అంటున్నారు. 108కు ఫోన్‌ చేస్తే 20 నిమిషాల్లో అంబులెన్స్‌ వస్తోందా? సిబ్బందికి జీతాల్లేవు.. డీజిల్‌ లేదని సమాధానం వస్తోంది. ఈ దుర్మార్గపు పాలన ముగిసి, మంచి రోజులు వచ్చి, మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ‘ఆరోగ్య శ్రీ’లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి సమున్నతంగా అమలు చేస్తాం.