Begin typing your search above and press return to search.

సస్పెండ్ అయిన జగన్ వాదన ఏమిటి..?

By:  Tupaki Desk   |   18 Dec 2015 8:14 AM GMT
సస్పెండ్ అయిన జగన్ వాదన ఏమిటి..?
X
ప్రతిఒక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది. తాము చేసిన పనులకు సంబంధించి ఒక వాదన ఉంటుంది. ఏపీ శీతాకాల సమావేశాల్నే తీసుకుంటే.. ఏపీ అధికారపక్షం అంబేడ్కర్ మీద చర్చ మొదట జరగాలని.. అదే విషయాన్ని బీఏసీ మీటింగ్ లో అనుకున్నామని చెబుతుంటే.. అదేం కుదరదు మొదట కాల్ మనీ మీదనే చర్చ జరగాలన్న పట్టుదలతో ఏపీ విపక్షం ఆందోళన చేస్తుంది. మొత్తంగా తన వాదన మీదే నిలబడిన ఏపీ విపక్షం సస్పెన్షన్ వేటు పడి సభ్యులంతా సభను వీడాల్సి వచ్చింది.

ఇక్కడ అందరూ జగన్ మొండితనం గురించి.. ఆయన అనవసర పట్టుదలకు పోతున్నారని.. ఆయనలో మెచ్యూరిటీ లేదని.. హుందాతనం అంతంతమాత్రమేనంటూ పలువురు విమర్శలు చేస్తున్నారు. విమర్శల్లో నిజమెంత? అబద్ధమెంత? అన్న విషయాల్ని పక్కన పెట్టి.. అంబేడ్కర్ గురించి ఏపీ అసెంబ్లీలో చర్చ మీద ఏపీ విపక్షం ఎందుకు ఆసక్తి ప్రదర్శించలేదు.. కాల్ మనీ మీదే చర్చ జరగాలని జగన్ ఎందుకు పట్టుబడుతున్నారన్న విషయాన్ని సానుకూలంగా పరిశీలిస్తే.. జగన్ మాటల్ని వినే వీలుంటుంది. అదే జరిగితే ఈ ఎపిసోడ్ మీద ఆయన వాదన ఏమిటో అర్థమవుతుంది. మరి.. ఈ వ్యవహారం మీద జగన్ వాదన చూస్తే..

= నిన్నటి బిజినెస్ ఎజెండా చూస్తే.. ఈ జాబితాలో అంబేద్కర్ గురించి ఎక్కడా లేదు. ఆ అంశం మీద చర్చ జరుగుతుందని ఎక్కడైనా ఒక్క చోటైనా ఉందా? తొలిసారి వాయిదా పడినప్పుడు అంబేద్కర్ అంశం లేదు. రెండోసారి సభ వాయిదా పడిన తర్వాత వచ్చింది. అంటే దాని అర్థం ఏమిటి? కాల్ మనీ వ్యవహారం మీద చర్చ జరగకూడదని చంద్రబాబు భావిస్తున్నారు.

= కాల్ మనీ వ్యాపారంతో సంబంధం ఉన్నోళ్లు టీడీపీ నేతలే. ముఖ్యమంత్రి అండదండలతోనే నిందితులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి వారి మీద కేసులు ఎందుకు పెట్టరు?

= కాల్ మనీ దందాలకు పాల్పడుతున్న వారికి చంద్రబాబు.. ఆయన కొడుకు అండదండలున్నాయి. వారి మీద చర్యలు తీసుకోకుండా.. దాన్ని పక్కదారి పట్టించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వడ్డీ వ్యాపారులందరి మీదా దాడులు చేస్తున్నారు.

= కాల్ మనీ రాకెట్ లో చంద్రబాబు నుంచి ఆయన మంత్రులు.. ఎమ్మెల్సీలు.. ఎమ్మెల్యేలు అంతా ఉన్నారు.

= కాల్ మనీ లాంటి ముఖ్యమైన అంశాన్ని అసెంబ్లీలో చర్చకు రాకుండా చేసేందుకు అంబేడ్కర్ ని వాడుకున్నారు. అంబేడ్కర్ ను అడ్డు పెట్టుకుంటున్నారు.

= పార్లమెంటులో నవంబరు 26న చర్చ జరిపిందంటే.. అది రాజ్యాంగ రచన పూర్తి చేసిన రోజు. అదే రోజున పార్లముంటును హాజరు పరిచి చర్చించారంటే దానికో అర్థం ఉంది. రాజ్యాంగాన్ని పార్లమెంటుకు సమర్పించిన రోజు.. అంబేడ్కర్ జయంతి.. వర్థంతి రోజుల్లో ఆయన గురించి చర్చించాలన్న విషయం గుర్తుకు రేదు. కానీ.. ఇప్పుడు గుర్తుకు రావటం ఏమిటి?

= అసెంబ్లీ దగ్గరున్న అంబేడ్కర్ విగ్రహాన్ని ఒక్కసారి చూడండి. దీన్ని శుభ్రం చేయించాలన్న ఆలోచన కూడా లేదు. ఆయనకు వేసిన దండ ఎండిపోయింది. దుమ్ముతో.. ధూళితో నిండి ఉంది. అసెంబ్లీ లోపల మాత్రం అంబేడ్కర్ ను రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నారు. ఇలాంటి రాక్షస పాలన ఎక్కాడా లేదు.