Begin typing your search above and press return to search.

రేపిస్టు మంత్రులంటూ జగన్ ఫైర్

By:  Tupaki Desk   |   8 Nov 2016 12:41 PM IST
రేపిస్టు మంత్రులంటూ జగన్ ఫైర్
X
విశాఖలో నిర్వహించిన జై ఆంధ్రప్రదేశ్ సభ వేదికగా విపక్ష నేత జగన్ చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్రత్యేక హోదా అనే విష‌యంలో కాకుండా అనేక అంశాలను ప్రస్తావించి చంద్రబాబు ప్రభుత్వాన్ని దునుమాడేసిన జగన్... రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్వాలపై ఆందోళన వ్యక్తం చేశారు. దేశం మొత్తం మీద ఆడవాళ్లపై అత్యాచారం చేసి కూడా మంత్రులుగా కొనసాగుతున్న వారు నలుగురు ఉండగా అందులో... ఇద్దరు ఏపీలోనే ఉన్నారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీకి చెందిన అసోసియేషన్‌ ఆఫ్ డెమెక్రటిక్ రిఫార్మ్స్‌ అనే సంస్థ ఈ విషయం బయటపెట్టిందని జ‌గ‌న్ ప్ర‌స్తావించారు.

అయితే... జగన్ వ్యాఖ్యలతో ఆ ఇద్దరు రేపిస్టు మంత్రులెవరన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోంది. కాగా ఆ నివేదికలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన మంత్రులుగా త‌ర‌చుగా మీడియాలో నిలిచే ఇద్ద‌రు నేత‌ల పేర్లు ఉండ‌టం క‌ల‌క‌లం రేకెత్తించింది. అప్పట్లో ఈ నివేదిక వచ్చినప్పుడే వైసీపీ నేతలు స‌ద‌రు మంత్రుల‌పై మండిప‌డ్డారు. వారిని వెంట‌నే బ‌ర్త‌ర‌ఫ్ చేయాలంటూ సీఎం చంద్ర‌బాబు వ‌ద్ద డిమాండ్లు పెట్టారు. తాజాగా ప్ర‌తిప‌క్ష నేత‌ జగన్ కూడా అదే అంశాన్ని ఎత్తుకోవడంతో జనంలోకి మరింత బలంగా వెళ్లిన‌ట్ల‌యింద‌ని అంటున్నారు. అయితే.. ఆ నివేదికలో స‌ద‌రు మంత్రుల‌ను రేపిస్టుల‌ని ఎక్క‌డా పేర్కొనలేదు. మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించిన కేసుల్లో ఉన్నట్లు వెల్లడించింది.