Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఇచ్చిన మాట‌ను చెప్పిన జ‌గ‌న్‌

By:  Tupaki Desk   |   4 April 2019 10:40 AM IST
కేసీఆర్ ఇచ్చిన మాట‌ను చెప్పిన జ‌గ‌న్‌
X
ఏపీ విప‌క్ష నేత‌.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తాజాగా కీల‌క ప్ర‌క‌ట‌న ఒక‌టి చేశారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌కు మాట ఇచ్చిన వైనాన్ని ఆయ‌న వెల్ల‌డించారు. ఇటీవ‌ల జ‌రిగిన ఒక బ‌హిరంగ స‌భ‌లో హోదా కోసం కేసీఆర్ మ‌ద్ద‌తు తీసుకుంటే త‌ప్పేంటి? అని ప్ర‌శ్నించిన ఆయ‌న‌.. కేసీఆర్ త‌న‌కు హోదా మీద ఇచ్చిన మాట‌ను చెప్పారు.

ఒక ప్ర‌ముఖ జాతీయ చాన‌ల్ కు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం మ‌ద్ద‌తు ఇస్తున్న నాయ‌కుడు కేసీఆర్ అని.. హోదా కోసం తెలంగాణ‌కు చెందిన 17 మంది ఎంపీలు మ‌ద్ద‌తుగా ఉంటార‌ని కేసీఆర్ మాట ఇచ్చిన‌ట్లుగా జ‌గ‌న్ వెల్ల‌డించారు.

ఏపీకి చెంద‌క‌పోయినా కేసీఆర్ త‌మ ఎంపీలు 17 మంది ప్ర‌త్యేక హోదాకు అండ‌గా నిలుస్తామ‌ని చెప్పార‌ని.. కేసీఆర్ జీకి నా కృతజ్ఞతలు అంటూ జ‌గ‌న్ పేర్కొన్నారు. ఏపీకి చెందిన 25 మంది ఎంపీలు.. తెలంగాణ నుంచి 17 మంది ఎంపీలు.. మొత్తంగా 42 మంది ఎంపీలు క‌లిసి పార్ల‌మెంటులో ప్ర‌త్యేక హోదాపై ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకోవాల‌ని బ‌లంగా అడిగితే.. కేంద్రంలో ఏ ప్ర‌భుత్వం ఉన్నా తీవ్రంగా ఆలోచించి.. ఒప్పుకోకుండా ఉండ‌ద‌న్న అభిప్రాయాన్ని జ‌గ‌న్ వెల్ల‌డించారు.

ఎన్నిక‌ల త‌ర్వాత ఏపీకి ఎవ‌రు హోదా ఇస్తారో.. వారితోనే తాము న‌డుస్తామ‌ని చెప్పిన జ‌గ‌న్‌.. జాతీయ స్థాయిలో మోడీ ప‌ని తీరును ప్ర‌శంసించారు. అదే స‌మ‌యంలో ఏపీకి ఇస్తామ‌ని చెప్పిన హోదా విష‌యంలో మాత్రం ఆయ‌న త‌న మాట నిల‌బెట్టుకోలేద‌ని విమ‌ర్శించ‌టం గ‌మ‌నార్హం.

ఏపీకి సంబంధించి మోడీ స‌రిగా వ్య‌వ‌హ‌రించ‌లేద‌న్న జ‌గ‌న్‌.. ఐదేళ్లు మోడీ అధికారంలో ఉన్నా.. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చే అవ‌కాశం ఉన్నా ఇవ్వ‌లేద‌న్నారు. ఆయ‌న స్వ‌యంగా తిరుప‌తి స‌భ‌లో ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకోలేద‌న్న విష‌యాన్ని జ‌గ‌న్ గుర్తు చేశారు. విష‌యం ఏమైనా.. వారు చేసిన త‌ప్పొప్పుల విష‌యంలో క్లారిటీగా మాట్లాడ‌టం జ‌గ‌న్ లో కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తుంద‌ని చెప్ప‌క‌తప్ప‌దు.