Begin typing your search above and press return to search.

తిరుపతిలో టీసీఎస్ .. జగన్ ఏంచెప్పాడంటే ?

By:  Tupaki Desk   |   21 Nov 2019 7:10 AM GMT
తిరుపతిలో టీసీఎస్ .. జగన్ ఏంచెప్పాడంటే ?
X
సీఎం జగన్ మోహన్ రెడ్డి పలు సంచలన నిర్ణయాలతో పాలన కొనసాగిస్తున్నారు. సీఎం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఒక సంచలనం గా మారుతోంది. రాష్ట్ర అభివృద్దే లక్ష్యంగా అధికారం చేప్పట్టిన సీఎం జగన్ మోహన్ రెడ్డి ..ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర అభివృద్ధి , ప్రజల కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్న జగన్ ..తాజాగా రాష్ట్రంలో ఐటీ రంగం విస్తరణ పై సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఏపీలో ఐటీ, సంబంధిత పరిశ్రమల కోసం మూడు ప్రాంతాల్లో కాన్సెప్ట్‌ సిటీలను తీసుకురావాలని సీఎం అధికారులను ఆదేశించారు.

విశాఖ, తిరుపతి, అనంతపురం ప్రాంతాల్లో ఈ కాన్సెప్ట్‌ సిటీల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ప్రాథమికంగా 10 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ సిటీలను ఏర్పాటు చేసేలా ఆలోచించాలని చెప్పారు. అమెరికాలోని ఇండియానాలో ఉన్న కొలంబియా సిటీని సీఎం ఈ సందర్భంగా ప్రస్తావించారు. విశిష్ట శైలి నిర్మాణాలన్నీ ఆ సిటీలో కనిపిస్తాయని, ఆ తరహాలోనే ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీకి, హై ఎండ్‌ టెక్నాలజీకి చిరునామాగా ఈ సిటీలు తయారు కావాలని తెలిపారు. పరిశ్రమలు పెట్టదలుచుకున్న వారికి వేగంగా అనుమతులు ఇవ్వడంతో పాటు, అవినీతి లేకుండా పారదర్శక విధానంలో వారికి వసతులు సమకూరుస్తామన్నారు. ప్రోత్సాహక ధరల్లో భూములు, నీళ్లు, కరెంటు ఇద్దామని సీఎం చెప్పారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్ల ద్వారా మంచి మానవ వనరులను అందిద్దామన్నారు.

పరిపాలన వ్యవస్థలో విప్లవాత్మక మార్పుగా తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయాలు.. వలంటీర్ల వ్యవస్థను సాంకేతిక వ్యవస్థతో అనుసంధానించి పటిష్టం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. నేరుగా కలెక్టర్‌కు, రాష్ట్ర సచివాలయానికి అనుసంధానం ఉండాలన్నారు. ఈ మేరకు సమాచార సాంకేతిక వ్యవస్థను తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. రేషన్, ఆరోగ్యశ్రీ, పెన్షన్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కార్డులను గ్రామ సచివాలయాల్లోనే ముద్రించి ఇవ్వాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందాలని, పారదర్శకతతో పాటు పథకాల అమల్లో సంతృప్త స్థాయి తీసుకురావాలని చెప్పారు. అవినీతి, పక్షపాతం లేకుండా లబ్ధిదారులందరికీ పథకాలు చేరాలన్నారు.

తిరుపతిలో క్యాంపస్‌ పెట్టడానికి టీసీఎస్‌ సానుకూలంగా ఉందని సీఎం తెలిపారు. ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం తిరుపతిలో ఉన్న ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజిటల్‌ టెక్నాలజీస్‌ పక్కనే హై ఎండ్‌ స్కిల్స్‌ కేంద్రం ఏర్పాటు చేయాలని , స్టార్టప్‌ల కోసం ఇదే ప్రాంగణంలో మరొక నిర్మాణం చేయాలన్నారు. ఏ ప్రభుత్వ శాఖకు ఎలాంటి అప్లికేషన్‌ కావాల్సి వచ్చినా తొలుత ఐటీ విభాగం అనుమతి ఇచ్చాకే ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసి అనేక అప్లికేషన్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకువచ్చినా, ప్రభుత్వ విభాగాలతో సరైన సమన్వయం లేక వాటిని వినియోగించుకోలేక పోతున్నారని , దీనితో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.