Begin typing your search above and press return to search.

తన గ్రాఫ్ లెక్క చెప్పి.. మంత్రులకు షాకిచ్చిన జగన్

By:  Tupaki Desk   |   29 April 2022 2:30 AM GMT
తన గ్రాఫ్ లెక్క చెప్పి.. మంత్రులకు షాకిచ్చిన జగన్
X
ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇందుకు బుధవారం నిర్వహించిన కీలక భేటీ వేదికైంది. రాష్ట్ర మంత్రులు.. పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు.. జిల్లా అధ్యక్షులతో కలిసి భేటీ అయిన సందర్భంలో ఆయన నోటి నుంచి వచ్చినట్లుగా చెబుతున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కొత్తగా మంత్రి పదవులు వచ్చాయన్న ఆనందంలో ఉన్న వారి గాలి తీసేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయంటున్నారు. గతంలో మరే అధినేత నోటి నుంచి రాని మాటల్ని జగన్ నోటి నుంచి విన్నట్లుగా పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారంతో పాటు.. కొన్ని మీడియా సంస్థల్లో రిపోర్టు అయిన దాని ప్రకారం చూసినప్పుడు తాజాగా నిర్వహించిన సభలో మాట్లాడే క్రమంలో జగన్ నోటి నుంచి వచ్చిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో కలకలాన్ని రేపుతున్నాయి. 'పార్టీ అధ్యక్షుడిగా నా గ్రాఫ్ 65 శాతం. మీ గ్రాఫ్ 40 - 45 శాతమే. దీన్ని సరిదిద్దుకోండి. ఆర్నెల్లు సమయం ఇస్తున్నా. సర్వే ఆధారంగానే ఎమ్మెల్యే టికెట్ల దక్కుతాయి. ఓడేవారికి టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదు' అంటూ ఆయన నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు పార్టీలో కొత్త ప్రకంపనలకు కారణమైంది.

పార్టీ మరోసారి గెలిచేందుకు వీలుగా లక్ష్యాన్ని చెప్పి.. దిశా నిర్దేశం చేయటం వరకు బాగానే ఉన్నా.. తప్పుల్ని ఎత్తి చూపే క్రమంలో.. ఫలానా అన్నది లేకుండా హోల్ సేల్ గా చేసిన వ్యాఖ్యలు నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నాయి. పార్టీ అధ్యక్షుడిగా తన గ్రాఫ్ తో పాటు ప్రభుత్వ గ్రాఫ్ కూడా బాగున్నాయని.. కొందరు ఎమ్మెల్యేల గ్రాఫ్ కూడా బాగానే ఉందన్న మాట జగన్ నోటి నుంచి వచ్చినట్లు చెబుతున్నారు.

మరికొందరు ఎమ్మెల్యేల గ్రాఫ్ మాత్రం బాగోలేదని.. వారికి ఆర్నెల్ల నుంచి తొమ్మిది నెలల సమయం ఇస్తున్నానని.. ఆలోపు వారు ప్రజల్లో తమ గ్రాఫ్ పెంచుకోవాలన్నారు. పని తీరు మారని ఎమ్మెల్యేలు.. ఎన్నికల్లో ఓడిపోయే వారు పార్టీకి బరువుగా అభివర్ణించిన ఆయన.. ఓడే ఎమ్మెల్యేల బరువును మోయలేను. వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేది లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి వారికి ఎమ్మెల్సీ లేదంటే నామినేటెడ్ పదవుల్ని ఇస్తా' అంటూ చెప్పిన మాటలు ఇప్పుడు షాకింగ్ గా మారాయి.

ఈ సమావేశంలో మంత్రులకు దిశానిర్దేశం చేస్తూ.. మంత్రులుగా వారంలో రెండు రోజులు మాత్రమే తమ శాఖలకు సంబంధించిన బాధ్యతల్ని చూసుకోవాలని.. మిగిలిన ఐదు రోజులు నియోజకవర్గాల్లో పర్యటించాలని ఆదేశించారు. మంత్రులు.. ఎమ్మెల్యేలు.. రోజుకు రెండు.. మూడు గ్రామ.. వార్డు సచివాలయాల్ని సందర్శించాలన్నారు. తాను కూడా త్వరలోనే సచివాలయాల్ని సందర్శిస్తానని.. జిల్లాల్లోపర్యటిస్తానని చెప్పిన జగన్.. మే రెండో తేదీ నుంచి ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించాలన్నారు.

జగన్ మాటకు కొందరు మంత్రులు.. ఎమ్మెల్యేలు చిన్న విన్నపమంటూ.. మే 2 కాకుండా మే పదో తేదీ నుంచి ఇంటింటి ప్రచారాన్ని చేసేలా మార్పు చేస్తే బాగుంటుందని కోరగా.. సానుకూలంగా స్పందించిన సీఎం జగన్.. సరేనన్నారు. మొత్తంగా తన గ్రాఫ్ కు ఢోకా లేదన్న జగన్.. మంత్రులు.. ఇతర నేతల గ్రాఫ్ బాగోలేదన్న మాటతో పాటు.. గ్రాఫ్ సరిగా లేని వారికి టికెట్లు ఇవ్వమని కుండబద్ధలు కొట్టేసిన వైనం ఇప్పుడు కొత్త కలకలాన్ని రేపుతోంది.