Begin typing your search above and press return to search.

జగన్ బాబుకు ఎవరూ తెలీదా?

By:  Tupaki Desk   |   20 July 2015 5:35 AM GMT
జగన్ బాబుకు ఎవరూ తెలీదా?
X
‘‘జగన్ నాకు తమ్మడు లాంటి వాడు’’ అని హద్దుల్లేని అధికారాన్ని అనుభవించే రోజుల్లో గాలి జనార్థన రెడ్డి వ్యాఖ్యనిస్తే కిమ్మనని జగన్.. అదే గాలి మైనింగ్ కేసులో ఇరుక్కున్నప్పుడు.. జగన్ దగ్గర ప్రస్తావిస్తే.. ‘‘ఆయన ఎవరు?’’ అంటూ వ్యాఖ్యానించి షాకిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా జగన్ ఇలాంటి వ్యాఖ్యలు సందర్బానుసారంగా చేయటం మామూలే.

ప్రస్తుతం క్విడ్ ప్రో కేసులో పీకల్లోతు మునిగిన జగన్ ఈ మధ్యన దర్యాఫ్తు అధికారులు విచారణ చేసిన సమయంలో చెప్పిన సమాధానాలకు సంబంధించిన అంశాలు ఆసక్తికరంగా మారాయి. తన సంస్థలైన జగతి పబ్లికేషన్స్ తదితర సంస్థల్లో వందల కోట్ల రూపాయిలు పెట్టుబడులు పెట్టిన వారితో తనకు పరిచయం లేదని.. ఒకవేళ పరిచయం ఉన్నా అది కేవలం వ్యాపారం కోసం ఉండే ముఖ పరిచయం తప్పించి మరొకటి కాదన్నట్లుగా చెప్పటం జగన్ బాబుకే చెల్లింది.

అవసరానికి తగినట్లుగా ఎవరినైనా.. ఎంతటి సన్నిహితులైనా తూచ్.. వాళ్లు ఎవరో తనకు తెలీదని వ్యాఖ్యలు చేయటం జగన్ బాబుకు మాత్రమే సాధ్యం. అవసరానికి తగినట్లుగా అపరిచితుడిగా వ్యవహరించే జగన్.. ఈ మధ్యన తనకెంతో సన్నిహితుడైన పొట్లూరు వర ప్రసాద్ అంటే ఎవరో కూడా తెలీదని చెప్పేయటం తెలిసిందే.

ఇలా తనకు తెలీదన్న వ్యక్తులు గాలి.. పొట్లూరి మాత్రమే కాదు.. నిమ్మగడ్డ ప్రసాద్.. పెన్నా ప్రతాపరెడ్డి ఇలాంటి వారందరితోనూ తనకు చాలా చాలా పరిమితమైన పరిచయం తప్పించి మరొకటి లేదంటూ అమాయకంగా విచారణ అధికారులకు చెప్పేయటం జగన్ కు మాత్రమే చెల్లు.

ఇలా తనకు తెలీదని చెప్పిన వారు.. ముఖ పరిచయం మాత్రమే ఉందన్న వారు ఏమైనా.. పది రూపాయిల షేర్లను ఏ పదో.. పాతికో కొన్నవాళ్లు కాదు.. ఒక్కొక్కరి పెట్టుబడులు వందల కోట్లలో ఉండటం గమనార్హం. ఒక పేరున్న కంపెనీలో వందల కోట్లు పెట్టటం సహజమే. కానీ.. అప్పుడే ప్రారంభించిన కంపెనీల్లో.. భారీ ప్రీమియంకు వాటాలు కొనుగోలు చేయటం జగన్ మాస్టర్ మైండ్ కు మాత్రమే సాధ్యం.

తనకు ముఖ పరిచయం మాత్రమే ఉందన్న నిమ్మగడ్డ రూ.847.50కోట్లు పెట్టుబడులు పెట్టటం గమనార్హం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పేర్లు అడిగిన విచారణ అధికారులకు పరిచయం పరిమితం అని చెప్పిన జగన్ బాబు.. వారి పెట్టుబడులు.. వారు ఎందుకు పెట్టుబడి పెట్టారన్న విషయాల్ని మాత్రం గుక్క తిప్పుకోకుండా చెప్పేయటం కాస్తంత విశేషమే. వ్యాపార వ్యవహారాలన్నీ తమ ఆడిటర్ విజయ్ సాయిరెడ్డి చూసుకుంటారని చెప్పే జగన్.. వందల కోట్లు పెట్టుబడులు పెట్టిన వారికి సంబంధించి వ్యాపార లెక్కల గురించి మాత్రం చెప్పేయటం గమనార్హం. ఏది ఏమైనా తనకు సన్నిహితులైన వారి విషయంలో మరో మాట లేకుండా.. సింఫుల్ గా ‘‘వాళ్లు ఎవరో నాకు తెలీదు’’ లాంటి అపరిచితుడి డైలాగులు జగన్ బాబుకు మాత్రమే సాధ్యమేమో.