Begin typing your search above and press return to search.

వైసీపీ ఎమ్మెల్యేల్లో మల్లగుల్లాలు - అతిభయాలు!

By:  Tupaki Desk   |   25 Oct 2017 5:21 PM GMT
వైసీపీ ఎమ్మెల్యేల్లో మల్లగుల్లాలు - అతిభయాలు!
X
ధర్మరాజు రాజసూయయాగం తలపెట్టినప్పుడు.. అందరితో పాటూ తమ్ముడైన సుయోధనుడికి కూడా ఆహ్వానం పంపించాడు. అయితే సుయోధనుడికి మాత్రం చాలా చిన్నతనంగా అనిపించింది. ఆ రాజసూయ యాగం తమను అవమానించడానికే తలపెట్టారనే అనుమానాలు కూడా కలిగాయి.. అయితే అలాంటి అనుమానాలు అవసరం లేదని, వెళ్లకపోతే నలుగురూ నాలుగు రకాలుగా అనుకుంటారని, అలాంటి మాటలకు ఆస్కారం ఇవ్వకుండా వెళ్లడమే మంచిదనే పెద్దల సలహా మేరకు అదే కారణం అయిన సంగతి వేరే కథ.

ఇప్పుడు మహాభారతంలో సుయోధనుడికి ఎదురైన ధర్మసంకటం లాంటిదే.. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కలుగుతోంది. శాసనసభకు వెళ్లాలా వద్దా? అనే డోలాయమానంలో పలువురు సతమతం అవుతున్నారు. నిజానికి జగన్ ఇటీవల పెట్టిన సమావేశంలో కొందరు.. మీరు ఎటూ పాదయాత్రలో ఉంటారు గనుక.. మేం కూడా అసెంబ్లీకి వెళ్లబోం అంటూ ఆయనకు సూచించారు. అయితే దీనిపై ఫైనల్ నిర్ణయం జరగలేదు. కానీ కొందరు ఎమ్మెల్యేలకు మాత్రం.. అసెంబ్లీకి వెళ్లడమే మంచిదనే భావన ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విషయంలో ఇంకా తాము నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ.. తెలుగుదేశం నాయకులు ఇప్పటికే రకరకాల విమర్శలు గుప్పిస్తున్నారని.. తమ తమ నియోజకవర్గాల్లో కూడా ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడానికి వెళ్లకుండా కూర్చుంటున్నారనే.. దుష్ప్రచారాన్ని తెదేపా నాయకులు ప్రారంభించేశారని.. ఇది ప్రజల్లో చెడ్డపేరు తెచ్చిపెడుతుందని కొందరు భయపడుతున్నారు.

జగన్ యాత్ర ప్రారంభం రోజు వెంట ఉండి - అసెంబ్లీ ప్రారంభం అయ్యాక హాజరైతేనే మంచిదని వారు అనుకుంటున్నారు. అయితే పార్టీలో కొందరు వద్దని అంటున్న నేపథ్యంలో.. తాము గనుక.. అసెంబ్లీకి వెళ్లాలనే అభిప్రాయం చెబితే.. ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతున్నారనే ముద్ర వేస్తారేమో అనే భయం కూడా పలువురిలో ఉంది. అసలే.. వైకాపా నుంచి ఇంకా అనేక మంది తెదేపాలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు.. అని చంద్రబాబునాయుడు పలు సందర్భాల్లో మైండ్ గేమ్ ఆడుతుంటారు. ఇలాంటప్పుడు.. ఇలాంటి సూచనలు చేస్తే భిన్నమైన సంకేతాలు వెళ్తాయేమోననేది వారి భయంగా ఉంది. జగన్ గురువారం నాడు లోటస్ పాండ్ లో వైసీఎల్పీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సన్నాహక సమావేశం ఇది. అయితే.. తాము అడగాల్సిన అవసరం లేకుండానే.. సభకు వెళ్లాలని అధినేత చెబితే బాగుంటుందని ఈ వర్గం ఎమ్మెల్యేలు ఎదురుచూస్తున్నారు.