Begin typing your search above and press return to search.

నై జ‌గ‌న్ : కాంగ్రెస్ కూడా టీడీపీ బాట‌లోనే..!

By:  Tupaki Desk   |   14 April 2022 7:42 AM GMT
నై జ‌గ‌న్ : కాంగ్రెస్ కూడా టీడీపీ బాట‌లోనే..!
X
చాలా రోజుల నుంచి విద్యుత్ ఛార్జీల పెంపు మొద‌లుకుని చాలా ఛార్జీల పెరుగుద‌ల వ‌ర‌కూ టీడీపీ చేస్తున్న నిర‌స‌న‌ల‌కు మంచి స్పందనే వ‌స్తోంది. అయితే వీటికి సోష‌ల్ మీడియా స‌పోర్ట్ కూడా బాగానే తీసుకోవాల‌ని భావించి, సంబంధిత వ‌ర్గాల‌ను అప్ర‌మ‌త్తం చేశారు చిన‌బాబు లోకేశ్. ఆయ‌న వ‌చ్చాక పార్టీ డిజిట‌ల్ మీడియా వింగ్ డెవ‌ల‌ప్ అయింది. అదేవిధంగా జ‌న‌సేన కూడా శ‌త‌ఘ్ని న్యూస్ పేరుతో ఇ పేప‌ర్ తీసుకువ‌స్తోంది. టీడీపీ చైత‌న్య ర‌థం పేరిట ఇ పేప‌ర్ తెస్తోంది. ఇవ‌న్నీ బాగున్నాయి. వీటినే ఫాలో అయి ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు చెందిన కాంగ్రెస్ విభాగం కూడా కొంతలో కొంత గ్రౌండ్ లెవ‌ల్ రియాల్టీ అందించేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేయ‌డం బాగుంది. తెలంగాణ‌లో పొన్నాల వంటి లీడ‌ర్లు ఇప్ప‌టికే యాక్టివ్ గా ఉన్నారు. ఇక్క‌డ ఆ విధంగా ఏ ఒక్క లీడ‌ర్ లేక‌పోయినా పార్టీ వాయిస్ వినిపించే క్ర‌మంలో ఏపీ కాంగ్రెస్ పేరిట న‌డుస్తున్న పేజ్ బ‌లీయంగా వాస్త‌వాల వెల్ల‌డికి తాము ప్రాధాన్యం ఇస్తున్నామ‌న్న సంకేతాలు ఇస్తోంది.

ఇవాళ కాంగ్రెస్ పార్టీ లేదు. అదేలేండి అధికారంలో లేదు అని అర్థం. లేదు అంటే లేదు అని కాదు ఉనికిలో లేదు అని! ఇవాళ ఆ పార్టీ ఏం చెప్పినా చెల్లుబాటు కావ‌డం లేదు. అయినా కూడా పోరాటం మాత్రం వీడ‌డం లేదు. తెలంగాణ కాంగ్రెస్ తో పోలిస్తే ఆంధ్రా పీసీసీ వెరీ వీక్ గానే ఉంది. కానీ సోష‌ల్ మీడియాలో మాత్రం త‌త్ భిన్నంగా ఉంది.

అదే ఆశ్చ‌ర్యం. ఇది వ‌ర‌క‌టి క‌న్నా కాస్త యాక్టివ్ గా రాస్తోంది. అదేవిధంగా నిర‌స‌న స్వ‌రాలు డిజిట‌ల్ మీడియా ద్వారా కాస్త ఎక్కువ‌గానే వినిపిస్తోంది. తాజాగా ఛార్జీల పెంపున‌కు సంబంధించి టీడీపీ బాట‌లోనే నిర‌స‌న‌లు వినిపిస్తోంది.ఆ రోజు జ‌గ‌న్ చెప్పిన బాదుడే బాదుడు అనే డైలాగ్ ను తీసుకుని గ్రౌండ్ లెవ‌ల్ లో జ‌గ‌న్ పై అస‌మ్మ‌తి స్వ‌రం పెంచుతోంది.

ఇక ఛార్జీల విష‌యానికి వ‌స్తే ప‌రిశ్ర‌మ‌ల‌కు ఇస్తున్న క‌రెంట్ సెస్సు పెంచారు. ఒక‌ప్పటి క‌న్నా ఇప్పుడు ఊహించ‌ని రీతిలో పెంచారు. ఛార్జీలు ఇప్ప‌టితో పోలిస్తే గ‌తంలోనే న‌యం అని అనిపించారు. ట్రూ అప్ తో పాటు రేపో మాపో నిర్వ‌హ‌ణ ఛార్జీలు కూడా వినియోగ‌దారుల నెత్తిన రుద్ద‌నున్నారు.అదేవిధంగా ప‌ల్లె వెలుగు మినిమం ఛార్జ్ ప‌ది రూపాయ‌లు చేశారు. తాజాగా పెంపు నిర్ణ‌యంతో వినియోగ‌దారుల‌పై ఏడు వంద‌ల కోట్ల‌కు పైగా వ‌డ్డ‌న వ‌డ్డించారు.


ఇవి కాకుండా చెత్త ప‌న్ను, ఆస్తి ప‌న్ను, ఇంకా నీటి తీరువా ప‌న్నులు ఉండ‌నే ఉన్నాయి. ఇన్ని ఉన్నా కూడా జ‌గ‌న్ స‌ర్కారు రెండు కిలోమీట‌ర్ల మేర రోడ్డు కూడా వేయ‌లేక‌పోతోంది. ఆస్ప‌త్రి వ‌ర్గాలకు నిర్వ‌హ‌ణ ఛార్జీలు చెల్లించ‌లేకపోతోంది. పారిశుద్ధ్య కార్మికుల‌కు రెండు నెల‌లుగా జీతాలు ఇవ్వ‌లేక‌పోతోంది. ఇవే కాదు క్షేత్ర స్థాయిలో ధర‌లు ఉన్న విధంగా ఎక్క‌డా లేవు. అలా అని అభివృద్ధికి ప్రాధాన్యం అస్స‌లు లేదు.

ఆస్ప‌త్రుల నిర్వ‌హణ లేక ఓ వైపు పేషంట్లు ఇటుగా వ‌చ్చేందుకే భ‌య‌ప‌డిపోతున్నారు. ప్ర‌భుత్వాస్ప‌త్రుల‌లో ఉండే జ‌న‌రేటర్ల‌కు డీజిల్ పోసే నాథుడే లేడు. ఈ త‌రుణంలో టీడీపీతో క‌లిసి కాంగ్రెస్ ప్ర‌త్య‌క్ష కార్యాచ‌ర‌ణ‌కు రాకున్నా టీడీపీ బాట‌లోనే డిజిటల్ మీడియాలో త‌న పోరు ఉద్థృతం చేయాల‌నుకోవ‌డం ఓ విధంగా మంచి ప‌ద్ధ‌తే! ఎందుకంటే ప్ర‌త్య‌క్ష కార్యాచ‌ర‌ణ ఏ విధంగా ఉన్నా ప్ర‌భుత్వాలు క‌నీసం ఆలోచిస్తే చాలు.