Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌ లో కొత్త ఉత్సాహం గ‌మ‌నించారా?

By:  Tupaki Desk   |   15 Nov 2016 10:44 AM IST
జ‌గ‌న్‌ లో కొత్త ఉత్సాహం గ‌మ‌నించారా?
X
ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నార‌ని అంటున్నారు. తాజాగా ఎదురయిన రెండు పరిణామాలు ఉత్సాహం కలిగించాయి. ప్రత్యేక హోదా డిమాండ్‌తో వైసీపీ విశాఖపట్నంలో నిర్వహించిన బహిరంగ సభ విజయవంతం కావడం, మరుసటి రోజునే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలందరికీ హైకోర్టు నోటీసులివ్వడంతో శ్రేణుల్లో సమరోత్సాహం కనిపిస్తోంది. క‌లిసి వ‌చ్చిన ప‌రిణామాల‌తో ఆ పార్టీ నేత‌లు ముందుకు సాగుతున్నారు.

విశాఖ వేదికగా విపక్ష నేత జగన్ నిర్వహించిన హోదా సాధన సభ అంచనాలకు మించి విజయవంతం కావడం ఆ పార్టీ నేతల్లో భరోసా పెంచింది. పేరుకు ఉత్తరాంధ్ర మొత్తానికి సభ నిర్వహించినప్పటికీ జనసమీకరణ - హాజరైన వారంతా విశాఖ నగరవాసులే ఎక్కువ కావడంతో కార్పొరేషన్‌ పై పార్టీ పట్టు బిగించాలన్న నాయకత్వం ఆశలు చిగురించాయి. ఉత్తరాంధ్రలో బలమైన నాయకులున్న నేపథ్యంలో జగన్ సభకు దాదాపు లక్ష మంది వరకూ హాజరవడం ఆ పార్టీ పట్టుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఫిబ్రవరిలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో విశాఖపై జెండా ఎగురవేసేందుకు చాలాకాలం నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తోన్న ఆ పార్టీ నాయకత్వానికి తాజా సభ మరింత భరోసా కలిగించింది. అటు జగన్ శైలిలో కూడా మార్పు కనిపించిందని, ఆయన ప్రసంగ ధోరణి ప్రజలకు నచ్చిందని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. ఇది హోదాపై బీజేపీ-టీడీపీ వైఫల్యాన్ని మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దోహదపడుతుందని చెబుతున్నారు.

‘మా నేత జగన్ విశాఖ వేదికపై నుంచి టీడీపీ-బీజేపీలకు వేసిన ప్రశ్నలకు వారి నుంచి సరైన సమాధానం లేకపోవడాన్నిబట్టి హోదాపై ఆ పార్టీల వైఫల్యం - ఇబ్బంది స్పష్టంగానే కనిపిస్తోంది. అందుకే వాళ్లు కప్పదాటు వైఖరి ప్రదర్శిస్తూ హోదాపై జవాబు చెప్పే దమ్ములేక జగన్‌ ను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు. ఇది ఆ పార్టీల చేతకానితనానికి నిదర్శనం’అని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. కాగా పార్టీ మారిన 20 మంది ఎమ్మెల్యేలకు తాజాగా హైకోర్టు నోటీసులివ్వటం పార్టీ నాయకత్వానికి సంబరం కలిగించింది. దీనిపై ఎమ్మెల్యేలు సమాధానం ఇచ్చేందుకు హైకోర్టు 4 వారాల గడువిచ్చింది. ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి వేసిన పిటిషన్ స్వీకరించిన హైకోర్టు తెలుగుదేశంలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలందరికీ నోటీసులు జారీ చేయడం వైసీపీకి నైతిక విజయంగా భావిస్తున్నారు. దీనివల్ల తమ వాదనను కోర్టు కూడా విశ్వసించిందనే భావన ప్రజల్లోకి వెళుతుందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు.

ఇదిలావుంటే ఫిబ్రవరిలో ఏడు కార్పొరేషన్లు, మరికొన్ని మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో హోదా సభలు నిర్వహించాలని జగన్ యోచిస్తున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వానికి రెఫరెండంగానే ఉంటాయని భావిస్తున్నారు. అందువల్ల కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే హోదా అంశాన్ని ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో విస్తృత ప్రచారాంశంగా మార్చాలని జగన్ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ‘హోదా కోసం పోరాడే వారికే ఓట్లు వేయాల’న్న నినాదం ద్వారా తెదేపా-బాజాపాను దెబ్బతీయాలనే వ్యూహంతో వైసీపీ నాయకత్వం తన ప్రణాళికకు పదునుపెడుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/