Begin typing your search above and press return to search.

100కిమీ పూర్తి చేస్తున్న వేళ జ‌గ‌న్ ఏం చెప్పారంటే..

By:  Tupaki Desk   |   14 Nov 2017 9:48 AM GMT
100కిమీ పూర్తి చేస్తున్న వేళ జ‌గ‌న్ ఏం చెప్పారంటే..
X
క‌ష్టాన్ని ఓపిగ్గా విన‌టం.. సానుకూలంగా స్పందించ‌టం.. భ‌విష్య‌త్ మీద కోటి ఆశ‌లు పెరిగేలా హామీ ఇవ్వ‌టం.. ఇంత‌కు మించి ఏ రాజ‌కీయ అధినేత నుంచి సామాన్యులు కోరుకోరు. తాము ప‌డుతున్న క‌ష్టం నిమిషాల్లో తీరిపోవాల‌నుకోరు. కాకుంటే.. ఇవాళ కాకున్నా.. రేప‌టికైనా క‌చ్ఛితంగా తీరుతుంద‌న్న న‌మ్మ‌కం క‌లిగితే చాలు.. ప్ర‌జాసంక‌ల్పం పేరుతో ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేస్తున్న పాద‌యాత్ర‌లో ఇప్పుడు క‌నిపిస్తున్న దృశ్యం ఇదే.

క‌డ‌ప జిల్లాలోని ఇడుపులపాయ‌లో మొద‌లైన పాద‌యాత్ర నేడు క‌ర్నూలు జిల్లాలోకి ఎంట‌రైంది. ఈ రోజు వంద కిలోమీట‌ర్ల మార్క్‌ ను జ‌గ‌న్ ట‌చ్ చేయ‌నున్నారు. ఏడెనిమిది నెల‌ల పాటు సుదీర్ఘంగా సాగ‌నున్న ఆయ‌న పాద‌యాత్ర‌లో మొద‌టి వంద కిలోమీట‌ర్లు ఈ రోజు న‌మోదు కానుంది.

ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గం చాగ‌ల‌మ‌ర్రిలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో జ‌గ‌న్ మాట్లాడారు. వీధుల నిండుగా పోటెత్తిన జ‌నసందోహాన్ని ఉద్దేశించి జ‌గ‌న్ ప్ర‌సంగించారు. అభివృద్ధి అంటే ఇవాళ కంటే రేపు బాగుండ‌టమ‌ని.. కానీ బాబు పాల‌న చూసిన త‌ర్వాత నాన్న‌గారి పాల‌న‌ను ఒక్క‌సారి గుర్తు తెచ్చుకోవాల‌న్న అభిలాష‌ను వ్య‌క్తం చేశారు. రాష్ట్రం ఎంత ముందుకు పోయిందో లేదంటే వెన‌క్కి పోయిందో తెలుస్తుంద‌న్నారు.

రాష్ట్రంలో ఎవ‌రిని అడిగినా బాబు పాల‌న‌లో న‌స్ట‌పోయామ‌న్న మాటే వినిపిస్తోంద‌న్నారు. రైత‌న్న వ్య‌వ‌సాయ రుణాలు మాఫీ కాలేద‌ని.. అప్పులు క‌ట్టొద్ద‌ని చెప్పి ఇప్పుడు ప్లేట్ ఫిరాయించార‌ని.. రైతుల‌ను పీక‌ల్లోతు అప్పుల్లో కూరుకుపోయేలా చేశార‌న్నారు. నాలుగేళ్ల త‌ర్వాత తాను ప్ర‌శ్నిస్తున్నాన‌ని.. ఆయ‌న చేసిన రుణ‌మాఫీవ‌డ్డీల‌కైనా స‌రిపోయిందా? అంటూ ప్ర‌శ్నించారు.

రోడ్లు దారుణంగా ఉన్నాయ‌ని.. దుమ్ము దుమ్ముగా ఉన్నాయ‌ని బాబు పాల‌న‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన జ‌గ‌న్‌.. రెండు పంట‌ల‌కు నీరు అందిందా? అని ప్ర‌శ్నించారు. రాజోలిబండ ప్రాజెక్టు మీద మీరు ఆధార‌ప‌డ‌లేదా? ఇవాళ ఆ ప్రాజెక్టు అతీగ‌తీ లేద‌ని.. గుండ్రేవుల ప్రాజెక్టు ఏమైంద‌ని తాను ప్ర‌శ్నిస్తున్నాన‌న్నారు. త‌న తండ్రి బ‌తికి ఉంటే ఈ పాటికి ఆ ప్రాజెక్టు పూర్తి అయ్యేద‌ని.. రైత‌న్న ముఖంపై చిరున‌వ్వు ఉండేద‌న్నారు. శ్రీ‌శైలంలో నీళ్లు ఉన్నా రాయ‌ల‌సీమ‌కునీళ్లు రావ‌టం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పొదుపు సంఘాల‌కు ఇచ్చిన రుణాల్ని మాఫీ చేస్తాన‌న్నార‌ని.. ఒక్క‌రూపాయి అయినా మాఫీ అయ్యిందా? అని ప్ర‌శ్నించారు. జాబు రావాలంటే బాబు రావాల‌న్నార‌ని.. లేదంటే నిరుద్యోగ భృతికి రూ.2వేలు ఇస్తామ‌న్నార‌ని.. నాలుగేళ్ల‌లో రాష్ట్రంలోని ప్ర‌తి ఇంటికి చంద్ర‌బాబు రూ.90వేలు చొప్పున బాకీ ప‌డ్డార‌న్నారు.

వైఎస్ హ‌యాంలో రేష‌న్ షాపులో చ‌క్కెర‌.. చింత‌పండు.. పామాయిల్‌.. కందిపప్పు.. కిరోసిన్ లాంటివి దొరికేవ‌ని.. ఈ రోజు అదే రేష‌న్ షాపులో బియ్యం కూడా దొర‌క‌టం లేద‌ని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అన్ని ర‌కాల మోసాలు జ‌రుగుతున్నాయ‌ని.. వాటిని త‌ట్టుకోలేక ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌న్నారు.

పాద‌యాత్ర ముగిసిన ఏడాదిలో త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తుంద‌ని.. స‌ల‌హాలు సూచ‌న‌లు.. ఆలోచ‌న‌లు ఇవ్వాల‌ని జ‌గ‌న్ కోరారు. పాద‌యాత్ర ఉద్దేశం పార్టీ మేనిఫేస్టో త‌యారు చేయ‌ట‌మ‌ని.. అది మూడు పేజీల్లో ఉంటుంద‌న్నారు. టీడీపీ మేనిఫేస్టో కోసం ఇంట‌ర్నెట్ లో వెతికితే క‌నిపించ‌ద‌ని.. ఒక‌వేళ క‌నిపిస్తే.. దాన్ని చ‌దివితే జ‌నాలు కొడ‌తార‌న్నారు. ప్ర‌జ‌లు త‌యారు చేసిన మేనిఫేస్టోను రానున్న ఎన్నిక‌ల్లో పెడ‌తామ‌ని.. అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే వాటిని అమ‌లు చేస్తామ‌న్నారు. 2024 నాటికి తాము ఇచ్చిన అన్ని హ‌మీల్ని అమ‌లు చేసి.. మ‌ళ్లీ ఆశీర్వ‌దించాలంటూ ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర‌కు వ‌స్తాన‌ని జ‌గ‌న్ చెప్పారు. రాజ‌కీయాల్లో విశ్వ‌స‌నీయ‌త కొర‌వ‌డింద‌ని.. రేపొద్దున ఇదే బాబు ప్ర‌తి ఇంటికి కేజీ బంగారం.. మారుతి కారు కొనిస్తానని చెబుతాడంటూ ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే అభివృద్ధి అనే ప‌దానికి అర్థం తెస్తామ‌న్నారు.