Begin typing your search above and press return to search.
నాకేం మైలేజీ వద్దు..హోదా కోసమే పోరాటం:జగన్
By: Tupaki Desk | 4 April 2018 4:38 PM ISTఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయడంలో తనకే మైలేజీ దక్కాలనే కాంక్ష లేదని...స్పెషల్ స్టేటస్ దక్కడమే తమ పార్టీ అభిమతమని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా సాధనకు పోరాటం చేసే వారందరికీ వైఎస్ ఆర్ సీపీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. గుంటూరు టౌన్ లో బుధవారం హోదా సాధన కమిటీ సభ్యులు వైఎస్ జగన్ ను కలిశారు. హోదా సాధన నేతలు చలసాని శ్రీనివాస్ - తాడి నరేష్ - కొండా నర్సింగరావు - శర్మ - సదాశివరెడ్డి - అప్పలనాయుడు - మల్లికార్జున్ తదితరులు భేటీ అయిన వైఎస్ జగన్ పోరాటాన్ని ప్రశంసించారు. మొదటి నుంచి మీరు ఒకే మాటపై నిలబడి ప్రత్యేక హోదాను సజీవంగా ఉంచారని హోదా సాధన సమితి నేతలు తెలిపారు. అన్ని రాజకీయ పక్షాలు - సంఘాలను కలుపుకొని హోదా పోరాటానికి నాయకత్వం వహించాలని నేతలు కోరారు. ఢిల్లీ వెళ్లి ఆమరణ దీక్షలో పాల్గొనే ఎంపీలకు..సంఘీభావం తెలుపుతామని వైఎస్ జగన్ కు హోదా సాధన సమితి నేతలు తెలిపారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ..హోదా సాధనకు ఇప్పటికే కార్యాచరణ ప్రకటించామని - త్వరలోనే సమావేశమై మరోసారి తదుపరి కార్యాచరణపై చర్చిద్దామని కమిటీ సభ్యులకు చెప్పారు. హోదా ఉద్యమకారులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లింది ప్రత్యేక హోదా కోసం కాదని, మరోసారి మభ్యపెట్టేందుకే చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ప్రత్యేక హోదా అడగలేదని, ప్లానింగ్ కమిషన్ ను అడిగి ఉంటే హోదా వచ్చేదని జగన్ తెలిపారు.
