Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ స్పెష‌ల్ ట్రీట్‌!...విధేయుల‌కు కీల‌క పోస్టులు!

By:  Tupaki Desk   |   6 Jun 2019 9:56 AM IST
జ‌గ‌న్ స్పెష‌ల్ ట్రీట్‌!...విధేయుల‌కు కీల‌క పోస్టులు!
X
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ కు నూత‌న ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న వెంట న‌డిచిన విధేయులు - అనుంగు అనుచ‌రుల‌కు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించారు. పార్టీ క‌ష్టాల్లో ఉన్నా... త‌న వెన్నంటి న‌డిచిన ప‌లువురు కీల‌క నేత‌ల‌కు జ‌గ‌న్ కీల‌క పోస్టుల్లో నియ‌మించారు. ఈ క్ర‌మంలో పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఇప్ప‌టిదాకా చ‌క్రం తిప్పుతూ వ‌చ్చిన వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డిని పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌గా నియ‌మించిన జ‌గ‌న్‌... ఢిల్లీలో పార్టీ ప‌నుల‌న్నీ చ‌క్క‌బెట్టే బాధ్య‌త‌ల‌ను మ‌రింత కాలం పాటు మోసే కీల‌క బాధ్య‌త‌లను అప్ప‌గించారు. పార్టీ ఆవిర్భావం నుంచి జ‌గ‌న్ వెన్నంటి న‌డుస్తున్న విజ‌య‌సాయిరెడ్డి... పార్టీ త‌ర‌ఫున ద‌క్కిన తొలి రాజ్య‌స‌భ సీటు అందిన త‌ర్వాత ఢిల్లీలో పార్టీ వ్య‌వ‌హారాల‌న్నీ కూడా చ‌క్క‌బెట్టారు. పార్టీ వాయిస్ ను బ‌లంగా వినిపించ‌డంతో పాటు పార్టీ సిద్ధాంతాల‌ను ప్ర‌జ‌ల‌కు చేర‌వేయ‌డంలో విజ‌య‌సాయిరెడ్డి స‌ఫ‌లీకృతుల‌య్యార‌నే చెప్పాలి. అంతేకాకుండా వైరివ‌ర్గాల‌పై త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డిన విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌త్యేకించి టీడీపీ నేత‌ల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించార‌నే చెప్ప‌క త‌ప్ప‌దు. ఇలాంటి కీల‌క బాధ్య‌త‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నెర‌వేర్చిన నేప‌థ్యంలోనే ఆయ‌న‌కు పార్టీ పార్ల‌మెంట‌రీ నేత ప‌ద‌వి ద‌క్కింద‌ని చెప్పాలి.

ఇక‌ ఆది నుంచి త‌న వెన్నంటి న‌డిచి క్షేత్ర స్థాయిలో పార్టీని బ‌లోపేతం చేయ‌డంతో పాటుగా పార్టీలో నెల‌కొన్న చిన్న చిన్న విభేదాల‌ను అక్క‌డిక్క‌డే తేల్చేసిన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని లోక్ స‌భ‌లో పార్టీ నేత‌గా నియ‌మించారు. జ‌గ‌న్ పార్టీ పెట్టే దాకా పెద్ద‌గా రాజ‌కీయాల్లో క‌నిపించ‌ని మిథున్ రెడ్డి... జ‌గ‌న్ పార్టీ పెట్ట‌గానే ఆయ‌న వెన్నంటి న‌డిచారు. జిల్లాల్లో ప్ర‌త్యేకించి రాయ‌ల‌సీమ జిల్లాల్లో త‌న‌దైన శైలిలో దూసుకుపోయిన మిథున్ రెడ్డి... పార్టీ ప‌టిష్ఠ‌త కోసం త‌న‌దైన శైలిలో శ్ర‌మించారు. పార్ల‌మెంటులో కూడా పార్టీ వాయిస్ ను వినిపించ‌డంలో ఆయ‌న స‌ఫ‌లీకృతుల‌య్యార‌నే చెప్పాలి. ఇక త‌న తండ్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిని పార్టీలోకి తీసుకుని రావ‌డం ద్వారా రాయ‌ల‌సీమ‌లో వైసీపీకి తిరుగులేని స్థాయిని కూడా తీసుకొచ్చిన‌ట్టుగా పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఈ క్ర‌మంలోనే మిధున్ రెడ్డికి లోక్ స‌భ‌లో పార్టీ నేత‌గా అవ‌కాశం ద‌క్కింది. ఇక తాను చెప్పంగానే సినీ కెరీర్ ను కూడా వ‌దిలేసుకుని వ‌చ్చి తూర్పు గోదావ‌రి జిల్లాలో పార్టీ ప‌టిష్ఠ‌త కోసం శ్ర‌మించ‌డంతో పాటుగా రాజ‌మహేంద్ర‌వ‌రం ఎంపీగా నిలిచి గెలిచిన మార్గాని భ‌ర‌త్ రామ్ ను లోక్ స‌భ‌లో పార్టీ చీఫ్ విప్ గా నియ‌మించారు. ఈ నియామ‌కాల‌న్నీ ప‌రిశీలిస్తే... త‌న‌ను న‌మ్ముకున్న నేత‌ల‌కు ఎంత‌ మాత్రం కొద‌వ చేసే ప్ర‌స‌క్తే లేద‌ని జ‌గ‌న్ చెప్పిన‌ట్గుగా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

ఇక త‌న మాటే వేదంగా సాగిన త‌న బాబాయి వైవీ సుబ్బారెడ్డికి కూడా జ‌గ‌న్ మంచి ప‌ద‌వినే అంద‌జేసేందుకు రంగం సిద్ధం చేసిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో ఒంగోలు లోక్ స‌భ నుంచి పార్టీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగి గ‌ట్టి ప్ర‌త్య‌ర్థి అయిన మాగుంట శ్రీ‌నివాసులు రెడ్డిని ఓడించిన సుబ్బారెడ్డికి ఈ ఎన్నికల్లో అస‌లు ఎక్క‌డ కూడా సీటు ద‌క్క‌లేదు. అంతేకాకుండా త‌న చేతిలో ఓడిపోయిన శ్రీ‌నివాసులు రెడ్డి కోసం త‌న‌ను సీటు త్యాగం చేయ‌మ‌ని జ‌గ‌న్ చెప్ప‌గానే... మాట‌మాత్రంగా కూడా ఆలోచించ‌కుండా పార్టీ అధిష్ఠానం నిర్ణ‌యం మేర‌కు సీటును వ‌దిలేసిన సుబ్బారెడ్డికి ఇప్పుడు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) పాల‌క మండ‌లి చైర్మ‌న్ ప‌ద‌వి ద‌క్క‌నుందట‌. అంతేకాకుండా పార్టీ త‌ర‌ఫున రాజ్య‌స‌భలో ద‌క్కే ఓ సీటును కూడా సుబ్బారెడ్డికి కేటాయించేందుకు జ‌గ‌న్ సిద్ధంగా ఉన్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. అంటే త‌న సీటును వ‌దులుకున్నందుకు సుబ్బారెడ్డికి రెండు బంప‌ర్ ప‌ద‌వులు ద‌క్క‌నున్నాయ‌న్న మాట‌.