Begin typing your search above and press return to search.

జగన్.. అర్జెంట్ గా చుట్టు ఉన్న బ్యాచ్ ను మార్చేయ్

By:  Tupaki Desk   |   25 Jan 2021 2:30 PM GMT
జగన్.. అర్జెంట్ గా చుట్టు ఉన్న బ్యాచ్ ను మార్చేయ్
X
ఊహించిన పరిణామమే చోటు చేసుకుంది. వ్యవస్థల మధ్య స్పర్థ మామూలే అయినా.. దానికో స్థాయి ఉంటుంది. దాన్ని దాటినంతనే.. బ్రేకులు వేయటానికి మన ప్రజాస్వామ్యంలో అవసరమైన వ్యవస్థలు ఉన్నాయి. ఈ విషయాన్ని పాలకుల చుట్టూ ఉండే విధేయులు మర్చిపోవటమే ఏపీ ప్రభుత్వానికి ఈ రోజున ఇబ్బందికర పరిస్థితి ఎదురైందని చెప్పాలి. ఏపీలో పంచాయితీ ఎన్నికల్ని నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్న వేళ.. ప్రాక్టికల్ గా ఎదురయ్యే సమస్యల్ని చూపించి.. ప్రస్తుతానికి ఎన్నికల్ని వాయిదా వేయాలని ప్రభుత్వం కోరింది.

అయితే.. ఏపీ ఎన్నికల సంఘం మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఏపీ సర్కారును ఇరుకున పడేలా పావులు కదిపింది. ఈ విషయాల్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉంటూ.. క్షేత్ర స్థాయిలో జరిగే పరిణామాలకు సంబంధించిన ఫీడ్ బ్యాక్ సరిగా ఇచ్చే వారు లేకపోవటంతో సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలిందని చెప్పాలి. పంచాయితీ ఎన్నికల్ని నిర్వహించేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం పచ్చజెండా ఊపింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్.. జస్టిస్ హృషికేశ్ రాయ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది.

పంచాయితీ ఎన్నికల్ని వెంటనే నిర్వహించాలని.. వ్యాక్సినేషన్ అసలు అడ్డంకే కాదని పేర్కొంది. దేశంలో మరెక్కడా ఎన్నికలు జరగట్లేదా? అన్న ధర్మాసనం.. ఎన్నికలు రాజ్యాంగ ప్రక్రియలో భాగమని చెప్పటం గమనార్హం. వాస్తవానికి అధినేతలు ఒకలాంటి మైండ్ సెట్ లో ఉంటారు. వారి చుట్టూ ఉన్న వాతావరణం కూడా వేరుగా ఉంటుంది. పవర్ సెంటర్ లో ఉన్న వారికి తమకున్న పవర్ మాత్రమే తెలుస్తుంది. ఎదుటివాడి పవర్ గురించి తెలియజేయాల్సిన అవసరం విధేయుల మీదనే ఉంటుంది.

బ్యాడ్ లక్ ఏమంటే..సీఎం జగన్ ను కీర్తించటం.. ఆయన తీసుకునే నిర్ణయాలకు ఆహా.. ఓహో అనే బ్యాచే తప్పించి.. అన్నా.. మీరు తప్పు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి మనకు ఎదురయ్యే పరిస్థితి ఉంది. ఇప్పటికి ఇలా చేస్తే.. తర్వాతేం జరుగుతుందన్న విషయాల్ని ముందే ఊహించి వివరించి చెప్పటం.. అధినేతకు ఇష్టం లేకున్నా.. కష్టంతోనైనా నచ్చజెప్పాల్సిన అవసరం ఉంది. కానీ.. జగన్ చుట్టూ ఉన్న విధేయులు ఎవరూ ఆ పని చేయని పరిస్థితి. దీంతో.. తాను తీసుకుంటున్న నిర్ణయాలు సరిగానే ఉన్నాయన్న భావన జగన్ లో ఉంటుంది. అందులో వాస్తవం పాళ్లు ఎంతన్నది చెప్పి.. నిష్ఠూరంగా ఉండే నిజాన్ని ఆయనకు చెప్పాల్సిందే.

అలాంటిదేమీ లేకపోవటం జగన్ తాజా ఎదురుదెబ్బకు కారణమని చెప్పాలి. వాస్తవానికి ఏపీలో జగన్ సర్కారుకు ఉన్న ఇమేజ్ తో చూసినప్పుడు పంచాయితీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్ని అధికారపక్షమే సొంతం చేసుకోవటం ఖాయం. ఆ విషయాన్ని జగన్ కు అర్థమయ్యేలా చెప్పి ఉంటే.. ఈ రోజు పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. అత్యున్నత స్థానాల్లో ఉన్న వారి చుట్టూ ఉన్న వారు.. ఎంత నిజాయితీగా ఉంటే వారిని నమ్ముకున్న వారికి అంతే మేలు జరుగుతుందన్నది మర్చిపోకూడదు.

నాలుగు గోడల మధ్య సలహాలు ఇచ్చేటప్పుడు.. కొన్ని అప్రియమైన అంశాలు చెప్పినప్పుడు విసుక్కోవటం.. ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం మామూలే. కానీ.. అందరి ముందు చిన్నబోవటం కన్నా.. నాలుగు గోడల మధ్య అధినేత ఆగ్రహాన్ని భరించటం చాలా మంచిది. కానీ.. అలాంటివారెవరూ ఈ రోజున సీఎం జగన్ పక్కన లేకపోవటం ఒక పెద్ద లోపంగా చెప్పాలి. అలాంటివారే ఉండి ఉంటే.. ఇప్పటి పరిస్థితి ఆయనకు ఎదురయ్యేదే కాదు. అందుకే.. చుట్టూ ఉన్న విధేయుల్ని అర్జెంట్ గా మార్చేయాల్సిన అవసరం ఉంది జగన్ . ఏమంటారు?