Begin typing your search above and press return to search.

అత్యవసరంగా ఏపీ కేబినెట్ భేటీ... మండలి రద్దు కోసమేనా?

By:  Tupaki Desk   |   21 Jan 2020 2:21 PM GMT
అత్యవసరంగా ఏపీ కేబినెట్ భేటీ... మండలి రద్దు కోసమేనా?
X
ఏపీకి మూడు రాజధానుల దిశగా సాగుతున్న వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకునే దిశగా సాగుతున్నారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. మంగళవారం నాటి అసెంబ్లీ వాయిదా పడిన వెంటనే కేబినెట్ భేటీని నిర్వహించేందుకు సిద్ధమైన జగన్... సదరు కేబినెట్ భేటీలో శాసన మండలి రద్దు దిశగా కీలక నిర్ణయం తీసుకుంటారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే... వచ్చే శాసనసభ బడ్జెట్ సమావేశాల్లోగా ఏపీలో శాసనమండలి రద్దు అయిపోయిే అవకాశాలు లేకపోలేదన్న వార్తలు నిజంగానే కలకలం రేపుతున్నాయి. మండలి రద్దు దిశగా జగన్ నిర్ణయం తీసుకుంటే.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మాజీ మంత్రి నారా లోకేశ్ ఇక ఇంటి పట్టునే కూర్చోక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.,

అయినా ఇంత అర్జెంట్ గా శాసన మండలిని రద్దు చేసే దిశగా జగన్ ఎందుకు సాగుతున్నారన్న విషయంపై ఆసక్తికర కథనాలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీలో క్లిస్టర్ క్లియర్ మెజారిటీ ఉన్న నేపథ్యంలో జగన్ సర్కారు తీసుకుంటున్న ఏ నిర్ణయానికి అడ్డే లేదు. అయితే శాసనమండలిలో మాత్రం టీడీపీకి మెజారిటీ ఉన్న నేపథ్యంలో అసెంబ్లీలో ఆమోదం పొంది మండలికి వెళ్లాల్సిన ప్రతి బిల్లుకు అక్కడ ఆమోదం లభించడం గననంగానే మారిపోయింది. ఈ తరహాలో ఇప్పటికే ఓ దఫా అసెంబ్లీలో ఆమోదం పొందిన ఓ బిల్లును టీడీపీ సభ్యులు ఉద్దేశపూర్వకంగానే అడ్డుకున్నారు. తాజాగా అధికార వికేంద్రీకరణ బిల్లును కూడా మంగళవారం నాటి సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్సీలు అడ్డుకున్నారు. రూల్ 71ను అస్త్రంగా మలచుకున్న టీడీపీ... మూడు రాజధానుల బిల్లుకు బ్రేకులేసింది.

అయితే ఈ తరహా ప్రమాదాన్ని ముందే గ్రహించిన జగన్... రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తన ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సాగితే... శాసన మండలిని రద్దు చేసి పారేస్తానని ఇదివరకే చెప్పారు. అయితే పెద్దల సభపై ఉన్న గౌరవంతో ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయం తీసుకోలేనని, తాను గౌరవిస్తున్న పెద్దల సభ అసెంబ్లీలో ఆమోదం పొందిన ప్రతి బిల్లును వ్యతిరేకిస్తూ సాగితే మాత్రం రద్దు చేయక తప్పదన్న సందేశాలను కూడా టీడీపీకి విస్పష్టంగానే పంపారు. ఈ నేేపథ్యంలో శాసనసభా సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే... టీడీపీ ఎమ్మెల్సీలపై అనుమానంతో మండలి రద్దు డ్రాఫ్ట్ బిల్లును జగన్ రెడీ చేసేశారట. సోమవారం నాటి కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చ వచ్చినా... మంగళవారం నాటి మండలి సమావేశాలను చూసిన తర్వాత దానిపై నిర్ణయం తీసుకుందామని జగన్ భావించారట.

అయితే జగన్ హెచ్చరికలను బేఖాతరు చేసిన టీడీపీ మండలిలో వికేంద్రీకరణ బిల్లును అడ్డుకుంది. దీంతో జగన్ శాసనమండలి బిల్లును రద్దు చేసేందుకు రెడీ చేసిన డ్రాఫ్ట్ బిల్లును బయటకు తీశారట. ఈ క్రమంలో మంగళవారం నాటి శాసన సభా సమావేశాలు ముగిసిన వెంటనే కేబినెట్ భేటీ ఉంటుందని, మంత్రులంతా హాజురు కావాలని సమాచారం పంపారట. మంగళవారం రాత్రి 10 గంటలకు జరగనున్న కేబినెట్ బేటీలో మండలి రద్దుపై జగన్ కీలక నిర్ణయం తీసుకుంటారట. రాత్రి పొద్దుపోయిన తర్వాత కేబినెట్ భేటీ సమావేశం అంటేనే... ఏదో అత్యవసర నిర్ణయం తీసుకునేందుకేనన్న వాదనలు కూడా ఈ మాటకు బలం చేకూరుస్తున్నాయి. అంతా అనుకున్నట్లుగా సాగి మండలిని రద్దు చేస్తూ జగన్ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం, ఆ వెంటనే అసెంబ్లీలో సదరు బిల్లుకు ఆమోదం లభించడం జరిగిపోతుంది. ఆ తర్వాత రాష్ట్రపతి ఈ బిల్లును ఆమోదిస్తే... వెంటనే మండలి రద్దు అయిపోతుంది. అంటే... నేటి రాత్రి మండలిని రద్దు చేస్తూ జగన్ కేబినెట్ నిర్ణయం తీసుకుంటే... వచ్చే బడ్జెట్ సమావేశాల్లోగా మండలి రద్దు అయిపోతుందన్న మాట.