Begin typing your search above and press return to search.

కేసీయార్ తో ..దూరమా...దగ్గరా... జగన్ కి అతి పెద్ద పరీక్ష

By:  Tupaki Desk   |   13 Dec 2022 2:00 PM IST
కేసీయార్ తో ..దూరమా...దగ్గరా... జగన్ కి అతి పెద్ద పరీక్ష
X
ఏపీలో భారతీయ రాష్ట్ర సమితి పేరిట బీయరెస్ ఎంట్రీ ఇవ్వడం ఖాయం అయిపోయింది. జాతీయ పార్టీగా ఆరు శాతం ఓట్లను తెలంగాణాతో సహా నాలుగు రాష్ట్రాలలో తెచ్చుకోవాలీ అంటే ఏపీ కంటే సేఫ్ జోన్ కేసీయార్ కి మరోటి లేదు. ఎందుకంటే ఎనిమిదేళ్ళకు ముందు రెండు రాష్ట్రాలు ఒక్కటే. అలాగే అక్కడా ఇక్కడా జనాలు ఒక్కటే సెంటిమెంట్ తో ఉంటారు. తెలుగు మాట్లాడేవారే కాబట్టి బీయారెస్ కి ఏపీ చాలా వ్యూహాత్మమైన రాష్ట్రంగా చెప్పాలి.

దాంతో కేసీయార్ మామూలుగా ఏపీ మీద ఫోకస్ పెట్టరని అంటున్నారు. ఏపీలో ఆరు శాతం ఓట్ల కోసం కేసీయార్ తన రాజకీయ చాణక్యాన్ని పూర్తిగా ఉపయోగిస్తారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే బీయారెస్ ఏపీలో ఎంట్రీ ఇవ్వడం వల్ల వైసీపీకి ఎంతవరకు లాభం ఎంతమేర నష్టం అన్నది కూడా ఇపుడు చర్చ సాగుతోంది. బీయారెస్ కనుక ఒకసారి ఏపీలో ప్రవేశించిందంటే ఏపీ రాజకీయాలు పూర్తిగా మారిపోతాయి. కేసీయార్ తనదైన వ్యూహాలతో ఏపీ పాలిటిక్స్ ని పరుగులు పెట్టిస్తారు.

ఆయన ఇచ్చే హామీలు కూడా ఏపీ జనాలను ఆకట్టుకునేలా ఉంటాయి అని అంటున్నారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా మీద పోరు చేస్తాను అని మోడీని ఢీ కొంటాను అని కేసీయార్ అతి పెద్ద హామీ ఇవ్వవచ్చు. అదే విధంగా ఏపీకి విభజన హామీలు ఇన్నేళ్ళు అయినా అమలు కావడంలేదని, ఆ విషయంలో కేంద్రంతో సరైన పోరాటం చేస్తామని కూడా కేసీయార్ చెప్పవచ్చు. ఇంకో వైపు చూస్తే ఏపీలో పోలవరం తో పాటు అమరావతి రాజధానికి తమ మద్దతు అని కేసీయార్ చెప్పారే అనుకోండి అపుడు ఏపీలో రాజకీయ కధ వేరే లెవెల్ లో ఉంటుంది.

ఏపీలో బీయారెస్ హడావుడి బాగానే కనిపిస్తోంది. ఇప్పటికే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ని పిలిపించుకుని మాట్లాడిన కేసీయార్ ఇపుడు సీబీఐ మాజీ అధికారి జేడీ లక్ష్మీనారాయణతో కూడా చర్చలు జరుపుతున్నారు అని అంటున్నారు. అలాగే కీలకమైన నాయకులతో బీయారెస్ చర్చలలో ఉందని అంటున్నారు. ఇక విజయవాడ కేంద్రంగా బీయారెస్ కి వెల్ కం చేస్తూ ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. ఒక విధంగా కొత్త పార్టీగా బీయారెస్ రావడంతో చాలా మంది ఆ వైపున చూస్తున్నారు.

కేసీయార్ ఏపీ వారి సెంటిమెంట్ ని పట్టుకుని హైదరాబాద్ మోడల్ డెవలప్మెంట్ అని బిగ్ స్లోగన్ ఇస్తారు అని అంటున్నారు. అదే కనుక ఇస్తే ఏపీలో రాజకీయంగా అధికార వైసీపీకి పెద్ద దెబ్బ పడుతుంది అని విశ్లేషిస్తున్నారు. అదే విధంగా ఏపీ విషయంలో కూడా తెలంగాణాలో చేపట్టిన సంక్షేమ పధకాలను అమలు చేస్తామని కేసీయార్ చెబుతారు అని తెలుస్తోంది. దళిత బంధు, రైతు సంక్షేమ పధకాలు కనుక ఏపీలో అట్రాక్షన్ గా ఉంటే బీయారెస్ దూకుడు చేస్తుంది అని అంటున్నారు.

ఈ నేపధ్యంలో బీయారెస్ ఎంట్రీతో తమ రాజకీయం ఏ తీరున మారుతుంది అన్న చర్చ అయితే అధికార వైసీపీలో ఉంది అంటున్నారు. నిజానికి బీయారెస్ విషయంలో ఈ రోజుకు వైసీపీ ఏమీ మాట్లాడడం లేదు, ఆ పార్టీ నేత సజ్జల రామక్రిష్ణారెడ్డి అయితే వేచి చూసే ధోరణి లో వైసీపీ ఉంది అని అంటున్నారు. ఎవరైనా పార్టీ పెట్టవచ్చు అని కూడా ఆయన చెబుతున్నారు. సో వైసీపీకి బీయారెస్ విషయంలో ఈ రోజుకు ఒక కచ్చితమైన అభిప్రాయం అయితే లేదు.

కానీ రేపటి రోజున బీయారెస్ తో పొత్తు పెట్టుకుంటే పరిస్థితి ఏంటి అన్నది కూడా చర్చకు వస్తోంది. కేసీయార్ వంటి వ్యూహకర్త. బలమున్న నేత జగన్ కి తోడుగా నిలిస్తే జాతీయ స్థాయిలో ఆ పార్టీతో కూడితే ఏపీలో వైసీపీ మరింత బలపడుతుంది అన్న అంచనాలు ఉన్నాయి. అటు జగన్ ఇటు కేసీయార్ కలసి వస్తే ఈ ఇద్దరిని ఢీ కొట్టడం విపక్షానికి కష్టం కావచ్చు అని అంటున్నారు. అలాగే హైదరాబాద్ డెవలప్మెంట్ కూడా అతి పెద్ద ప్లస్ అవుతుంది అని అంటున్నారు.

అయితే జగన్ సమైక్యవాదాన్ని వినిపిస్తున్నారు. కేసీయార్ విభజనవాదిగా ఉన్నారు. దాంతో ఈ ఇద్దరు కలయిక మీద విపక్షాలు విమర్శలు చేస్తే అది బూమరాంగ్ అవుతుంది అన్న చర్చ కూడా ఉంది. అలా కాకుండా బీయారెస్ కి దూరం పాటిస్తే కేసీయార్ ఏపీలో వైసీపీని ఒక దుమ్ము దులిపి వదిలిపెడతారు. పైగా అమరావతి మన రాజధాని అంటూ మద్దతు ఇచ్చి బిగ్ ట్రబుల్స్ ముందు పెడతారు. అలాగే జగన్ పాలన మీద కూడా విమర్శలు గుప్పించి మోడీని జగన్ని కలిపి హాట్ కామెంట్స్ చేస్తే అది రివర్స్ లో వైసీపీకి అటాక్ గా మారుతుంది.

దాంతో బీయారెస్ తో దూరమా దగ్గరా ఏది అన్నది తేల్చుకోలేకపోతోంది వైసీపీ అని అంటున్నారు. అదే విధంగా బీయారెస్ విషయంలో వ్యూహాత్మకంగానే వైసీపీ విధానాలు ఉంటాయని అంటున్నారు. ఏది ఎలాగున్నా కేసీయార్ ఏపీలో ఎంట్రీ వైసీపీకి అసలైన పరీక్షంగానే అంతా చూస్తున్నారు. మరి ఇందులో వైసీపీ ఏ మేరకు సక్సెస్ అవుతుంది అన్నది చూడాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.