Begin typing your search above and press return to search.

24గంటలు గడవక ముందే టీడీపీకి షాకిచ్చిన వైసీపీ!

By:  Tupaki Desk   |   28 Jan 2019 3:19 PM GMT
24గంటలు గడవక ముందే టీడీపీకి షాకిచ్చిన వైసీపీ!
X
తెలుగుదేశం పార్టీ జయహో బీసీ సభ నిర్వహించి 24గంటలు కూడా గడవక ముందే ఆ పార్టీకి ప్రతిపక్ష వైసీపీ గట్టి షాకిచ్చింది. సభ విజయవంతమైందని సంబరాలు చేసుకుంటున్న టీడీపీకి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. వైసీపీ కూడా బీసీల సంక్షేమానికి సంబంధించి ఎలాంటి పథకాలను ప్రవేశపెట్టాలనే అంశంపై కసరత్తు మొదలుపెట్టింది. అంతేకాదు - ఎన్నికలకు అతి దగ్గర సమయమైన ఫిబ్రవరి రెండో వారంలో బీసీ గర్జన సభను పెద్ద ఎత్తున నిర్వహించాలని వైసీపీ నిర్ణయించింది. ఆ సభలో పార్టీ అధినేత జగన్ బీసీలకు లబ్ది చేకూర్చే ప్రకటన చేయనున్నట్లు తెలిసింది. రాజకీయాల్లో సమయస్ఫూర్తి అవసరం. ఎన్నికల వేళ అది అత్యంత కీలకం. ప్రత్యర్థి పార్టీ ప్రకటించే హామీల కంటే మరింతగా ప్రకటించేందుకు పార్టీలు వ్యూహరచన చేస్తుంటాయి. ఇప్పుడు వైసీపీ కూడా అదే చేస్తోంది.

చంద్రబాబు బీసీ సభలో ఇచ్చిన వరాల జల్లుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆ హామీలన్నింటినీ పరిశీలించే పనిని పార్టీ పెద్దలకు అధినేత అప్పగించినట్లు తెలిసింది. వాటి కంటే గొప్పగా.. బీసీలకు మేలు చేకూర్చే విధంగా.. బీసీ ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందనే అంశంపై నివేదిక తయారుచేయాలని జగన్ ఆదేశించినట్లు సమాచారం. పైగా.. బీసీలకు ద్రోహం చేసిన టీఆర్‌ ఎస్‌ తో కలిసొస్తున్నారన్న అపవాదును ధీటుగా తిప్పికొట్టేందుకు ఏం చేస్తే బాగుంటుందన్న అంశంపై కూడా వైసీపీ అధినేత దృష్టి పెట్టారట. అంతేకాకుండా ఈ నాలుగున్నరేళ్ల పాలనలో టీడీపీ బీసీలకు చేసిందేమీ లేదని, ఎన్నికలు సమీపిస్తుండటంతో కపట ప్రేమ చూపుతుందనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైసీపీ నిర్ణయించింది. బీసీల ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునేందుకు తలసానిని రంగంలోకి దించాలని కూడా వైసీపీ భావిస్తోంది. ఫిబ్రవరిలో జరిగే వైసీపీ బీసీ సభలో తలసాని ప్రసంగించే అవకాశాలు లేకపోలేదు. మైనారిటీలు ఇప్పటికీ తమ పార్టీతోనే ఉన్నారని, బీసీలను తమ వైపు తిప్పుకోగలిగితే వైసీపీ గెలుపు నల్లేరుపై నడకేనని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

ఏపీలో బీసీల ఓటు బ్యాంకుపై ప్రధాన పార్టీలన్నీ దృష్టి పెట్టడానికి కారణం లేకపోలేదు. ఏపీ ఓటు బ్యాంకులో బీసీలదే అగ్ర స్థానం. ఒక్కమాటలో చెప్పాలంటే ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా బీసీల అండ తప్పనిసరి. టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీలు ఆ పార్టీకి అండగా ఉన్నారు. ఎన్టీఆర్ బీసీలను అక్కున చేర్చుకోవడంతో బీసీల్లో ఎక్కువ మంది టీడీపీని తమ పార్టీగా భావించారు. కాంగ్రెస్ వైపు దళితులు, ముస్లింలు.. టీడీపీ వైపు బీసీలు అన్నట్టుగా రాజకీయం నడిచేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కాపులను బీసీల్లో చేర్చేందుకు చంద్రబాబు సర్కార్ తీసుకున్న నిర్ణయం బీసీల్లో టీడీపీపై కొంత వ్యతిరేకత పెంచింది.

కాపులకు న్యాయం చేసి తమకు అన్యాయం చేస్తారన్న భావన బీసీల్లోని ఓ వర్గంలో ఉంది. ఇదే సమయంలో బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యం కల్పిస్తామని, అత్యధిక సీట్లు ఇస్తామని వైఎస్ జగన్ చేసిన ప్రకటన బీసీల్లో వైసీపీ పట్ల కొంత సానుకూలతకు కారణమయింది. కాపుల విషయంలో జగన్ వెనకడుగు వేయడం కూడా బీసీల చూపు వైసీపీ వైపు మళ్లేందుకు దోహదపడింది. ఇదే అదనుగా ఎన్నికల్లో బీసీలను తమ వైపు తిప్పుకోవాలని వైసీపీ భావిస్తోంది. ఇలా ఏపీలోని ప్రధాన పార్టీలన్నీ ప్రస్తుతం బీసీ మంత్రం జపిస్తున్నాయి. మరి ఎన్నికల నాటికి బీసీలు ఎవరి వైపు మొగ్గుచూపుతారనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌ గా మారింది.