Begin typing your search above and press return to search.

జగన్, పవన్.. మీటింగ్ కు ముహూర్తం ఫిక్స్!

By:  Tupaki Desk   |   2 Feb 2017 3:23 PM IST
జగన్, పవన్.. మీటింగ్ కు ముహూర్తం ఫిక్స్!
X
ప్రత్యేక హోదా విషయంలో.. ఏపీ ప్రజల కోసం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తో కలిసి పని చేయడానికి సిద్ధం అని ప్రకటించాడు ‘జనసేన’ అధినేత - సినీ నటుడు పవన్ కల్యాణ్. ఇన్ని రోజులూ.. పూర్తిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కింద ఒదిగిపోయినట్టుగా, ఏ అంశం మీదనైనా బాబు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని.. ఆచితూచి స్పందించిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ తో పని చేయడానికి రెడీ అని ప్రకటించడం అత్యంత ఆసక్తికరంగా ఉంది. ప్రశ్నిస్తాను అని.. పార్టీని పెట్టి, తెలుగుదేశం- బీజేపీలకు మధ్దతు ప్రకటించి, తీరా ఆ పార్టీలు ఎన్నికల హామీల విషయంలో ప్రజలను మోసం చేసినట్టుగా వ్యవహరిస్తుండటంతో ఇన్ని రోజులూ పవన్ వైఖరి పలు విమర్శలకు గురి అయ్యింది.

ప్రత్యేకహోదా - చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ తదితర హామీల విషయంలో ఆది నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాడుతోంది. అయితే పవన్ మాత్రం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి వంత పాడుతున్నట్టుగా వ్యవహరించాడు. అలాగని ప్రతిపక్ష పార్టీ పోరాటాన్ని ఏ రోజూ తక్కువ చేసి మాట్లాడలేదు పవన్ కల్యాణ్. అయితే చంద్రబాబు తప్పిదాల మీద తప్పిదాలు - మోసాల మీద మోసాలు చేస్తూ ఉండటంతో.. ఎక్కువ కాలం ఆయనను కాపాడుతూ కూర్చుంటే ప్రజల్లో తన పట్ల కూడా వ్యతిరేకత వెల్లువెత్తుతుందని పవన్ కల్యాన్ గ్రహించినట్టుగా కనిపిస్తున్నాడు.

ఈ నేఫథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ తో కలిసి పనిచేయడానికి సిద్ధం అని పవన్ బహిరంగంగా ప్రకటించాడు. ఈ నేపథ్యంలో పవన్ ప్రతిపాదన పట్ల కొంతమంది మధ్య వర్తులను ఉత్సాహ పరుస్తోంది. పవన్ ను జగన్ తో కలిపించడానికి వీరు ప్రయత్నాల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. వీరి ప్రయత్నాలు ఫలించి.. జగన్ – పవన్ ల సమావేశానికి ముహూర్తం కూడా కుదిరినట్టు సమాచారం. వచ్చే వారంలో జగన్ తో పవన్ సమావేశం ఉంటుందని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టుగా సాగితే.. ఫిబ్రవరి ఎనిమిదో తేదీన జగన్ తో పవన్ కలిసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

పవన్ ను జగన్ వద్దకు తీసుకెళ్లే చొరవను ఒక డాక్టర్ చూపాడు. జగన్ కు కూడా సుపరిచితుడు అయిన ఈ వైద్యుడు.. వీళ్లిద్దరి సమావేశానికీ మధ్యవర్తిత్వం చేశాడు. పవన్ తో సమావేశం పట్ల జగన్ కూడా ఆసక్తినే చూపడంతో.. ప్రజల కోసం తమతో కలిసి వచ్చే వాళ్లను కలుపుకోవడానికి జగన్ సిద్ధంగానే ఉండటంతో.. సమావేశానికి రంగం సిద్ధం అయ్యింది. ఫిబ్రవరి ఎనిమిదో తేదీన వీరు కలవడం దాదాపు ఖరారు అయినట్టే.

ప్రత్యేకించి పవన్ తో సమావేశంలో ప్రజల స్థితి గతుల గురించినే జగన్ వివరించనున్నాడని తెలుస్తోంది. రాజధాని, రుణమాఫీ, ప్రత్యేకహోదా.. తదితర అంశాల్లో చంద్రబాబు ప్రజలను మోసం చేసిన తీరును వివరించనున్నాడట వైకాపా అధినేత. క్షేత్రస్థాయిలో విపరీతంగా పర్యటించిన అనుభవం ఉంది జగన్ కు. ఈ విషయాలను పవన్ కు పూసగుచ్చినట్టుగా వివరించనున్నాడట. ఇలాంటి నేపథ్యంలో వీరిద్దరి సమావేశం ఎలాంటి రాజకీయ పరిణామాలకు, రాజకీయ సంచలనాలకు దారి తీస్తుందో వేచి చూడాలి!