Begin typing your search above and press return to search.

జగన్ తో కలిసి కేసీఆర్... కొత్త అధ్యాయం లిఖిస్తారట

By:  Tupaki Desk   |   13 Aug 2019 10:21 AM IST
జగన్ తో కలిసి కేసీఆర్... కొత్త అధ్యాయం లిఖిస్తారట
X
తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించి - ప్రత్యేకించి నవ్యాంధ్ర - మరీ ప్రత్యేకించి రాయలసీమ అభివృద్ధి విషయంలో నూతన అధ్యాయం రూపొందనుందని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సంచలన ప్రకటన చేశారు. నవ్యాంధ్ర నూతన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి - తాను కలిసి ఈ నూతన శకానికి నాందీ పలకనున్నామని కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము లిఖించబోయే ఈ నూతన అధ్యాయం... గడచిన 60 - 70 ఏళ్లలో తెలుగు ప్రజలు ఏనాడూ చూసి ఉండరని కూడా ఆయన తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు.

తమిళనాడులోని అత్తివరదర్ దర్శనార్థం ఏపీ మీదుగా వెళ్లిన కేసీఆర్... చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో ల్యాండయ్యారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం మీదుగా కాంచీపురం చేరుకుని అత్తివరదర్ ను దర్శించుకున్నారు. ఈ మార్గంలో వైసీపీ కీలక నేత ఆర్కే రోజా సొంత నియోజకవర్గం నగరి కూడా ఉంది. ఎలాగూ నగరి మీదుగా వెళుతున్నారు కదా... మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించాలని రోజా కోరితే... అందుకు సరేనన్న కేసీఆర్... తిరుగు ప్రయాణంలో రోజా ఇంటికి వెళ్లారు. భార్య - కూతురుతో కలిసి వెళ్లిన కేసీఆర్... రోజాి ఫ్యామిలీ ఇచ్చిన విందును స్వీకరించారు.

ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరుతున్న సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేసీఆర్... తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ఎలా ఉండబోతోందన్న విషయాన్ని తనదైన స్టైల్లో చెప్పారు. జగన్ - తాను కలిసి తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఓ కొత్త అధ్యాయాన్ని లిఖించబోతున్నామని చెప్పిన కేసీఆర్... కొత్త అధ్యాయన్ని ఇప్పటిదాకా తెలుగు ప్రజలు చూసి ఉండరని వ్యాఖ్యానించారు. తాము లిఖించబోతున్న కొత్త అధ్యాయం కొందరికి రుచించదని - అయినా కూడా తాము తెలుగు ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతామని చెప్పారు. గోదావరి నీటిని ఏపీకి ప్రత్యేకించి కరువు సీమగా మారిన రాయలసీమకు తరలిస్తామని - ఈ దిశగా ఇప్పటికే కొంతమేర చర్చలు జరిగాయని కేసీఆర్ చెప్పుకొచ్చారు. గోదావరి - కృష్ణా నదుల నుంచి సముద్రంలో వృథాగా కలిసిపోతున్న వెయ్యి టీఎంసీలను సద్వినియోగం చేసుకునే దిశగా కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

ఆ తర్వాత జగన్ గురించి మాట్లాడిన కేసీఆర్... జగన్ ను తన సోదరుడిగా అభివర్ణించారు. ఏపీకి పట్టుదల కలిగిన పనిచేసే సత్తా ఉన్న జగన్ సీఎంగా ఉన్నారని - రాయలసీమ ప్రజల కష్ఠాలు బాగా తెలిసినవాడని పేర్కొన్నారు. రాయలసీమకు గోదావరి జలాలను తరలించే సత్తా కలిగిన జగన్ కు ఓ పెద్దన్న మాదిరిగా వంద శాతం సహకారం అందిస్తానని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత రోజా అందించిన విందును గుర్తు చేసుకున్న కేసీఆర్... తన కూతురు లాంటి రోజా మంచి ఆతిథ్యం ఇచ్చిందని - అన్నదాతా సుఖీభవ అంటూ దీవించారు. మొత్తంగా అత్తివరదర్ దర్శనార్థం వెళ్లిన కేసీఆర్... తెలుగు రాష్ట్రాల చరిత్రనే తిరగరాసేందుకు జగన్ తో కలిసి తాను సిద్ధమవుతున్నట్లుగా ప్రకటించి ఆసక్తి రేకెత్తించారనే చెప్పాలి.