రెండు కత్తులు ఒక ఒరలో ఇమడవు..కానీ ఒకే వేదిక మీదకు రానున్నాయి

Mon Aug 15 2022 19:18:33 GMT+0530 (IST)

jagan and chandrababu independence day celebration

వజ్రోత్సవ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏపీలో కాస్తంత రేర్ సీన్ ఆవిష్కారం కానుంది. పంద్రాగస్టు సందర్భంగా రాష్ట్రాల గవర్నర్లు ఎట్ హౌం కార్యక్రమాన్ని నిర్వహించటం.. దానికి అధికార.. విపక్ష నేతలతో పాటు.. ప్రజాప్రతినిధులు.. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ ప్రోగ్రాంకు హాజరు కావటం తెలిసిందే. మిగిలిన సందర్భాలు ఎలా ఉన్నా.. స్వాతంత్ర్య వజ్రోత్సవాలు కావటంతో గవర్నర్ నిర్వహించే కార్యక్రమానికి హాజరు కావటం తప్పనిసరిగా మారింది.దీంతో.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. విపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఒకే వేదిక మీదకు రానున్నారు. ఈ కార్యక్రమానికి ఇదో హైలెట్ గా మారనుంది. ఈ రోజు సాయంత్రం ఐదున్నర గంటలకు రాజ్ భవన్ లో నిర్వహించే తేనీటి విందుకు ఈ ఇద్దరు అగ్రనేతలు హాజరు కానున్నారు.

ఇద్దరు ముఖ్యనేతలు.. ఒకరంటే ఒకరికి ఏ మాత్రం పడని వారు ఒకే వేదిక మీదకు రావటం ఆసక్తికర పరిణామంగా మారింది. ఇటీవల కాలంలో ఈ ఇద్దరు అగ్రనేతలు ఒకరికి ఒకరు ఎదురుపడిన సందర్భాలు లేవు. అలాంటిది ఈ ఇద్దరూ ఒకే వేదిక మీదకు రావటంతో.. మరి ఇద్దరు మాట్లాడుకోవటం సరి కదా.. ఒకరి ముఖం మరొకరు చూసుకుంటారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

మొన్నటి మొన్న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలోనూ ఇద్దరు నేతలు హాజరు కావాల్సి ఉన్నా.. ఒక రోజు ఒకరు.. మరో రోజు ఇంకొకరు హాజరు కావటం వల్ల ఆ ప్రోగ్రాంలో చంద్రబాబు.. జగన్ లు ఎదురుపడింది లేదు. కానీ.. ఈ రోజు (సోమవారం) సాయంత్రం మాత్రం వీరిద్దరూ ఒకరికొకరు ఎదురుపడతారని చెబుతున్నారు.

గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా న్నప్పుడు చంద్రబాబు విపక్ష నేతగా ఉన్నప్పుడు.. ఇలాంటి వేదికల వద్దకు వచ్చినప్పుడు రాజకీయాల్ని పక్కన పెట్టేసుకొని మాట్లాడుకునే వారు. కానీ.. ఇప్పుడు ఈ ఇద్దరి అధినేతల మధ్య సానుకూల వాతావరణం లేని నేపథ్యంలో ఈ భేటీ ఆసక్తికరంగా మారుతుందని చెప్పక తప్పదు.