Begin typing your search above and press return to search.

ఎపీలో ఇసుక డాన్ పేరు చెప్పిన జ‌గ‌న్‌

By:  Tupaki Desk   |   12 April 2018 11:47 AM IST
ఎపీలో ఇసుక డాన్ పేరు చెప్పిన జ‌గ‌న్‌
X
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ఈ మ‌ధ్య‌న పార్టీ ఆవిర్భావ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడుతూ ఏపీలో ఇసుక దందా గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించ‌టం తెలిసిందే. ఇసుక దోపిడీపై ప‌వ‌న్ ప్ర‌శ్నించి వ‌దిలేయ‌గా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.

ఏపీలో ఇసుక డాన్ ఎవ‌రైనా ఉన్నారంటే అది ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబేన‌న్నారు. ముఖ్య‌మంత్రి అంటే ప్ర‌జ‌ల ఆస్తులు కాపాడేవాడా? దోచుకునేవాడా? అంటూ రైతుల్ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఏటా నాలుగు పంట‌లు పండే సార‌వంత‌మైన భూముల్ని బ‌ల‌వంతంగాలాక్కుని.. ముష్టి వేసిన‌ట్లు వారికి వెయ్యి గ‌జాలు ఇస్తారా? అంటూ నిల‌దీశారు. అసైన్డ్ భూములు కోల్పోయిన ద‌ళితులు త‌న వ‌ద్ద‌కు వ‌చ్చి వారి గోడును వెళ్ల‌బోసుకున్నార‌న్న జ‌గ‌న్‌.. అసైన్డ్ భూముల‌పై ప్ర‌భుత్వ పెత్త‌నాన్ని ప్ర‌శ్నించారు.

రాజ‌ధాని భూసేక‌ర‌ణ‌లో అసైన్డ్‌భూముల‌కు ప్యాకేజీ రాద‌ని నోటిఫై చేయించి మ‌రీ తీసుకున్నారంటూ బాబు ప్ర‌భుత్వ దుర్మార్గాన్ని బ‌య‌ట‌పెట్టారు. త‌మ భూముల్ని ప్ర‌భుత్వం అన్యాయంగా లాక్కుంద‌ని.. బెదిరించి కారుచౌక‌గా బూములు కొనుగోలు చేసి.. ఆపై ప్యాకేజీలు తీసుకున్నార‌ని చెప్పిన మాట‌ల్ని విన్న‌ప్పుడు బాధ క‌లిగించింద‌న్నారు. పెనుమాక‌.. వెంట‌క‌పాలెం.. ఉద్దండ‌రాయునిపాలెం.. లింగాయ‌పాలెం.. రాయ‌పూడి.. అబ్బ‌రాజుపాలెం గ్రామాల్లో ఇసుక అక్ర‌మ ర‌వాణా సాగుతుంద‌న్నారు.

వేల లారీల్లో ల‌క్ష‌ల ట‌న్నుల ఇసుక‌ను త‌ర‌లిస్తున్నార‌ని.. ఈ ఇసుక దందాకు డాన్ ఎవ‌రైనా ఉన్నారంటే.. అది ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబేన‌ని ఆరోపించారు. ముఖ్య‌మంత్రి అంటే ప్ర‌జ‌ల ఆస్తుల్ని కాపాడేవాడా? దోచుకునేవాడా? అంటూ ప్ర‌శ్నించిన జ‌గ‌న్‌.. బాబుపై మ‌రింత తీవ్రంగా విరుచుకుప‌డ్డారు. పాల‌నా ప‌రంగా బాబు చేస్తున్న త‌ప్పుల జాబితాను విప్పారు.

ఓవైపు కేంద్రం నిధులు ఇవ్వ‌టం లేదంటూనే.. రాష్ట్రం వ‌ద్ద డ‌బ్బు లేద‌ని చెబుతూ హ్యాపీ సిటీస్ ఈవెంట్ కోసం రూ.50 కోట్లు ఖ‌ర్చు పెట్ట‌టం ఏమిట‌ని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్న‌ట్లుగా జ‌గ‌న్ వెల్ల‌డించారు. ఏపీకి హోదా ఎండ‌మావిగా త‌యారు కావ‌టానికి కార‌ణం చంద్ర‌బాబు వైఖ‌రేన‌ని తూర్పార ప‌ట్టారు. హోదా విష‌యంలో బాబుకు క‌మిట్ మెంట్ ఉంటే త‌న ఎంపీల చేత రాజీనామా చేయించి దీక్ష చేయించేవార‌న్నారు.