Begin typing your search above and press return to search.

పవన్... లోకేష్ కంటే ముందే జగన్...?

By:  Tupaki Desk   |   30 Dec 2022 1:30 PM GMT
పవన్... లోకేష్ కంటే ముందే జగన్...?
X
కొత్త ఏడాది వచ్చేసినట్లే. దాంతో పాటే రాజకీయ వేడి కూడా పెరిగినట్లే. 2023 జనవరి 27 నుంచి తెలుగుదేశం భావి వారసుడు నారా లోకేష్ పాదయాత్ర స్టార్ట్ అవుతోంది. నాలుగు వేల కిలోమీటర్లు నాలుగు వందల రోజుల పాటు ఈ పాదయాత్రను డిజైన్ చేశారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ వారాహి వాహనం ఎక్కి ఏపీ అంతటా టూర్ చేయనున్నారు. ఈ రెండు యాత్రలు ఏపీలో 2023లో హాట్ టాపిక్ గా మారనున్నాయి. అదే విధంగా ఏపీ రాజకీయాన్ని కూడా హీటెక్కించనున్నాయి.

ఏపీలో ఇపుడు రాజకీయంగా చూస్తే తటస్థ వాతావరణం ఉంది. అపుడపుడు చంద్రబాబు అలాగే జగన్ జిల్లాల టూర్లు చేస్తున్నారు. ఆ టైం కి అది పాలిటిక్స్ అన్నట్లుగా సాగుతోంది తప్ప కంటిన్యూస్ గా అయితే లేదు. కానీ ఒకసారి లోకేష్ పాదయాత్ర స్టార్ట్ అయితే జనాల మూడ్ నెమ్మదిగా ఆ వైపుగా డైవర్ట్ అయ్యే చాన్స్ ఉంది.

అలాగే వీకెండ్ పాలిటిక్స్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అంటూ విమర్శలు చేస్తూ వస్తున్న వైసీపీకి ఆయన ఈ మధ్యనే ఒక సవాల్ చేశారు. నేను వారానికి ఒకసారే వస్తే తట్టుకోలేని మీరు రోజూ వస్తే ఎలా ఉంటారో అని. ఇపుడు పవన్ అదే చేయబోతున్నారు. ఆయన వారాహీ వాహనం మీద ప్రతీ రోజూ ఏపీలో తిరుగుతూంటే ఆయన రాజకీయ రధాన్ని ఆపేందుకు ఆపసోపాలు పడాల్సిందే.

మరో వైపు చూస్తే విపక్ష నేతలు జనంలోకి వచ్చి నిరంతరంగా యాత్రలు చేస్తూ పోతే కచ్చితంగా జనాలు అటు వైపు మళ్లీ అవకాశం ఉంటుంది. ఒక్కసారి కనుక జనాల్లో ఆ మార్పు వస్తే గేర్ ఎంత మార్చినా స్పీడ్ ఎంత పెంచినా తిరిగి తమ వైపు తిప్పుకోవడం కష్టం. అలా జనం మూడ్ మారి పొలిటికల్ పోలరైజేషన్ స్టార్ట్ కావడానికి 2023 వేదికగా మారబోతోంది అన్నదైతే విశ్లేషణగా ఉంది.

దాంతో ఇపుడు వైసీపీలోనూ దీని మీదనే చర్చ సాగుతోంది. విపక్షానికి ఎట్టి పరిస్థితుల్లో అలాంటి చాన్స్ ఇవ్వరాదని, ఏదైనా అడ్వాన్స్ పొజిషన్ ఉంటే దాన్ని తామే తీసుకోవాలని వైసీపీ గట్టిగా భావిస్తోంది. దాంతో వైసీపీకి ఉన్న ఏకైక స్టార్ కాంపెయినర్ జగన్ జనంలోకి వస్తారు అని అంటున్నారు.

ఇప్పటిదాకా పధకాలు ప్రారంభొత్సవాలతో మాత్రమే జిల్లాల టూర్లు పెట్టుకుంటున్న జగన్ ఇక మీదట రాజకీయ సమావేశాలు సభలు పెట్టేందుకు రెడీ అవుతున్నారని అంటున్నారు. సంక్రాంత్రి పండుగ తరువాత జగన్ పొలిటికల్ టూర్ స్టార్ట్ అవుతుందని అంటున్నారు. జగన్ ఏ విధంగా జనాలకు చేరువ అవుతారు ఆయన టూర్ రూపు రేఖలు ఎలా ఉంటాయన్నది ఇంకా తెలియరావడంలేదు.

అయితే రచ్చబండ టైప్ ప్రోగ్రామ్స్ తో పల్లె బాట పడుతూ జనాలకు చేరువ అయ్యే ఆలోచనలు ఉన్నాయని అంటున్నారు. అదే విధంగా ప్రతీ నియోజకవర్గంలోనూ ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయాలని కూడా ప్లాన్స్ ఉన్నాయని చెబుతున్నారు. మొత్తానికి లోకేష్ పాదయాత్రకు తొలి అడుగు వేసేకంటే ముందే జగన్ అడుగులు జనం వైపుగా వడివడిగా పడతాయని అంటున్నరు. చూడాలి మరి ఏం జరుగుతుందో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.