Begin typing your search above and press return to search.

హోదా మీద జగన్ పోరాటం ఎలానంటే..

By:  Tupaki Desk   |   10 Sept 2016 10:24 AM IST
హోదా మీద జగన్ పోరాటం ఎలానంటే..
X
హోదా అంశం ఏపీని ఇప్పుడు ఊపేస్తుంది. విభజన నష్టాన్ని హోదాతో తీరుస్తామంటూ నాడు రాజ్యసభలో ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీని అమలు చేసే విషయంలో నో అంటే నో అనేస్తూ కేంద్రం తేల్చేసి వేళ.. ఈ వ్యవహారంపై ఏపీ ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే.. హోదా మీద పోరాడుతూనే కేంద్రం ఇచ్చింది తీసుకుంటామని.. ప్యాకేజీని స్వాగతిస్తున్నట్లుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెబితే.. జనసేన అధిపతి పవన్ కల్యాణ్ హోదాపై మూడు అంచెల్లో పోరాటం చేస్తానని చెబుతున్నారు. ఇక.. కాంగ్రెస్.. కమ్యూనిస్ట్ లు సైతం హోదా మీద పోరు చేస్తామంటున్నారు. ఇదిలా ఉంటే.. ఏపీ ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటోంది? ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టాండ్ ఏమిటి? హోదా మీద ఆయన పోరాటం ఎలా ఉండనుంది? లాంటి అంశాలపై ఆయన స్పష్టత ఇచ్చారు. హోదాకు నో చెబుతూ.. ప్యాకేజీపై చేసిన ప్రకటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేడు ఏపీ బంద్ కు పిలుపునిచ్చారు. బంద్ అనంతరం హోదా మీద జగన్ ఏం చేయనున్నారన్న విషయాన్ని ఆయన మాటల్లోనే చూస్తే..

= గతంలోనూ ప్రత్యేకహోదా డిమాండ్ మీద బంద్ కు పిలుపునిచ్చాం. బంద్ విజయవంతం అయితే హోదా వచ్చే అవకాశం ఉంటుందని తెలిసీ చంద్రబాబు బలవంతంగా ఆర్టీసీ బస్సులు తిప్పారు. గతంలో హోదా కోసం నిరవధిక దీక్షకు కూర్చుంటే మోడీ రావటానికి రెండు రోజుల ముందు బలవంతంగా దీక్షను భగ్నం చేశారు.

= ప్రత్యేకహోదా ఇవ్వమని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనను చంద్రబాబే కాదు ఎవరు స్వాగతించినా ఒప్పుకునేది లేదు. రాష్ట్రంలోని ప్రతి రాజకీయ పార్టీ.. మీడియా సంస్థ.. ప్రజాసంఘం బంద్ కు తోడ్పాటును ఇవ్వాలి. జైట్లీ పసలేని ప్రకటనను స్వాగతించిన చంద్రబాబు ఏపీ ప్రజలను.. యువతను దారుణంగా వెన్నుపోటు పొడిచారు.

= బాబు వైఖరిని అసెంబ్లీలో గట్టిగా ప్రశ్నిస్తున్నాం. ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని జాతీయస్థాయికి తీసుకెళ్తాం. తన స్వార్థం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిలో ఉండటానికి వీల్లేదు.ఆయన తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలి.

= ప్రత్యేక హోదా వస్తే ఆర్థికపరమైన ప్రోత్సాహకాలు.. జీఎస్టీ.. ఆదాయపన్ను మినహాయింపులు వస్తాయి. ఇవన్నీ ఉంటే పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు పెట్టటానికి ముందుకు వస్తారు.

= ఒక రాష్ట్రానికో.. ఒక ప్రాంతానికో మేలు జరిగే వీలుంటే అలాంటి ప్రకటనను పగటిపూట చేయాలని భావిస్తారు ఎవరైనా. కానీ.. జైట్లీ.. చంద్రబాబులుమాత్రం అర్థరాత్రి వేళ మీడియా సమావేశం పెట్టిన తీరు చూస్తేనే.. ఈ విషయంలో వారి నిజాయితీ ఎంతన్నది అర్థమవుతుంది. ప్యాకేజీని స్వాగతించిన చంద్రబాబు నిజాయితీ ఎక్కడుందని ప్రశ్నిస్తున్నా.

= ప్యాకేజీ ప్రకటన చేసిన రోజున ఇచ్చిన బిల్డప్ అంతాఇంతా కాదు. జైట్లీ చెబుతున్న ప్యాకేజీని ప్రకటించటానికి ముందే దాని తాలూకు డ్రాఫ్టును చంద్రబాబుకు ఇచ్చారు. ఆ డ్రాఫ్ట్ ను ఒకసారి కాదు 17సార్లు చంద్రబాబు చదివి తన ఆమోదాన్ని తెలిపారు. తర్వాతే దాన్ని విదేశాల్లో ఉన్న ప్రధాని మోడీకి పంపారు. మోడీ చూశాక మళ్లీ బాబుకు పంపారు. చివరకు బాబు మళ్లీ చూసి ఓకే అన్న తర్వాతే ప్రకటన చేశారు.

= ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని జైట్లీ చెప్పిన తర్వాత కూడా చంద్రబాబు ప్యాకేజీని స్వాగతిస్తున్నట్లు చెప్పటం ఏమిటి? హోదా కాదన్నప్పుడు ప్రత్యామ్నాయాన్ని వద్దనలేం. హోదాకు ధీటుగా వచ్చే సొమ్మునుకూడా వద్దంటే ఎలా? అని అంటున్నారు. కేంద్రం ఇంత స్పష్టంగా ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పినప్పుడు సీఎంగా ఉన్న వ్యక్తి ఏం చేయాలి? కేంద్రానికి బుద్ధి వచ్చేలా కేంద్రానికి తన మద్దతు ఉపసంహరించుకోవాలి. పోరాటం చేయాలి. ప్రత్యేక హోదా మా హక్కు అని నిలదీయాలి కదా? కేంద్రం చెబుతున్న కుంటి సాకుల్నినిలదీయాలి. కేంద్రంలోని తన మంత్రుల్ని ఉపసంహరించి ఉండాలి. అవేమీ చేయకుండా అర్థరాత్రి వేళ.. మీడియా మీటింగ్ పెట్టి ప్యాకేజీ ప్రకటనను స్వాగతిస్తున్నానని చెబుతారా? ఆయన ఎవరండి అలా చెప్పటానికి?

= కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకున్నా.. కేంద్రం వెళ్లిపో అన్నా బాబు వెళ్లేట్లు లేడు.వాళ్ల కాళ్లు పట్టుకొనైనా సరే వాళ్లేమీ చేయకున్నా సరే వాళ్లతోనే ఉండాలనుకుంటున్నారు. ఎందుకంటే.. ఓట్లకు నోట్ల కేసులో దొరికి.. ఇరుక్కుపోవటమే. ఆ కేసు నుంచి బయటపడేందుకు ఐదు కోట్ల ఏపీ ప్రజలను వెన్నుపోటు పొడిచారు. తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టిన ఇలాంటి వ్యక్తి తక్షణం రాజీనామా చేయాలి.

= రాష్ట్రానికి నష్టం జరుగుతుంటే దానిపై చర్చ జరగాల్సింది పోయి స్టేట్ మెంట్ ఏమిటి? మన హక్కుగా హామీ ఇచ్చిన ప్రత్యేక హోదాను సాధించుకోలేమా? పోరాటం చేస్తే అనుకున్నది సాధించగలం. ప్రత్యేక హోదా వచ్చి తీరుతుంది. బాబు లాంటి నేతలు ఉన్నంతవరకూ ఆలస్యంకావొచ్చేమో. న్యాయం.. ధర్మం ఎప్పటికైనా గెలుస్తాయి. రాష్ట్రం మొత్తం ఒక్కటై పోరాటం చేస్తే మనమూ ప్రత్యేక హోదా తెచ్చుకోవచ్చు. అయితే.. అది ఇవాళే.. రేపే వస్తుందని చెప్పను. ఒక నెలలోనే వస్తుందని కూడా చెప్పను. కానీ.. పోరాటం చేస్తే తప్పకుండా వస్తుంది. హోదా సాధనలో తాజాగా ఇచ్చిన బంద్ పిలుపు ఒక ముందు అడుగు మాత్రమే.