Begin typing your search above and press return to search.

మంత్రి కావటం దురదృష్టమేమిటి జగదీశా..?

By:  Tupaki Desk   |   22 Aug 2015 4:55 AM GMT
మంత్రి కావటం దురదృష్టమేమిటి జగదీశా..?
X
అనుకునేది ఒకటి.. అయ్యేది మరొకటన్నది సహజమే. డాక్టర్ ను కావాలనుకుంటే యాక్టర్ అని అయ్యా అని అందాల భామలు గతంలో తరచూ చెబుతుండేవారు. అలా అని డాక్టర్ కాలేదన్న చింత కనిపించదు.. యాక్టర్ అయ్యామన్న బాధ ఉండదు. అనుకున్నది వేరు.. జరిగింది వేరు అన్నది మాత్రమే ఇక్కడ పాయింట్.

కానీ.. అదేం చిత్రమో తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి మాత్రం అందుకు భిన్నమైన వ్యాఖ్యలు చేసి.. అందరి దృష్టి ఆకర్షించారు. తెలంగాణ సర్కారులో పదవుల కోసం కళ్లు కాయలు కాచేలా వెయిట్ చేసినా.. దక్కని వారెందరో. అలాంటిది తనకు దక్కిన మంత్రి పదవికి సంతోషించక.. మంత్రిని కావటం దురదృష్టకరమని వ్యాఖ్యానించటం జగదీశ్ రెడ్డికి మాత్రమే చెల్లుతుంది.

అయినా.. మంత్రిగారి నోటి నుంచి అంత పెద్ద మాట ఎందుకు వచ్చింది? కేసీఆర్ క్యాబినెట్ లో మంత్రిగా ఉండటం అంత దురదృష్టకరమా? అన్న ప్రశ్నలు తలెత్తే పరిస్థితి. ఇంతకీ మంత్రిగారి నోటి వెంట ఇలాంటి అమూల్యమైన మాటలు ఎలా వచ్చాయన్న విషయంలోకి వెళితే..

నల్లగొండ జిల్లా కనగల్ మండలం బోయినపల్లిలో జరిగిన గ్రామజ్యోతి కార్యక్రమంలో తెలంగాణ మంత్రివర్యులు జగదీశ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను లాయర్ కావాలనుకున్నానని.. కానీ.. దురదృష్టవశాత్తు మంత్రినయ్యాని వ్యాఖ్యానించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. చిన్నతనంలోనే తనలోని నాయకత్వ లక్షణాల్ని తన టీచర్ గుర్తించారంటూ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లిన ఆయన.. బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు.

తాను ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలో.. పిల్లల్ని తీసుకొని బడికి వెళ్లే దారిలో ఉన్న కంప చెట్లు కొట్టించేవాడినని.. దాన్ని చూసిన తమ టీచర్.. నువ్వు నాయకుడివి అవుతానని చెప్పారని.. అలానే అయ్యానని చెప్పిన జగదీశ్.. తనకు మాత్రం లాయర్ కావాలని ఉండేదన్నారు. అనుకోకుండా ఎమ్మెల్యేని అయి.. దురదృష్టవశాత్తు మంత్రినయ్యా అంటూ వ్యాఖ్యానించారు. మంత్రి కావటం దురదృష్టకరం ఎందుకైందన్న విషయం జగదీశ్ రెడ్డి చెబితే మరింద బాగుంటుంది.