Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ పార్టీని ఎన్‌ కౌంట‌ర్ చేసేస్తార‌ట‌!

By:  Tupaki Desk   |   13 Feb 2018 5:07 AM GMT
కాంగ్రెస్ పార్టీని ఎన్‌ కౌంట‌ర్ చేసేస్తార‌ట‌!
X
విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లల‌తో తెలంగాణ రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా న‌ల్ల‌గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నేత హ‌త్య త‌ర్వాత ఇవి మ‌రింత తారాస్థాయికి చేరాయి. తాజాగా ఆ జిల్లాకు చెందిన‌ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్‌ను 2019 ఎన్నికల్లో ప్రజలే ఎన్‌ కౌంటర్‌ చేస్తారని మంత్రి జి జగదీశ్‌ రెడ్డి అన్నారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నల్లగొండలో హత్యారాజకీయాలకు కాంగ్రెస్‌ కేంద్ర బిందువని మండిపడ్డారు. బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్యకేసులో నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశంకు సంబంధముందని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపించడాన్ని ఖండించారు.

నల్లగొండ నియోజకవర్గ రాజకీయాలతో వీరేశంకు సంబంధం లేదని మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి అన్నారు. బొడ్డుపల్లి శ్రీనివాస్‌ మృతదేహం ఉండగానే, విచారణ ప్రారంభం కాకముందే పోలీసులను ఎలా తప్పుపడతారని ప్రశ్నించారు. శ్రీనివాస్‌కు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఎప్పుడైనా ప్రభుత్వానికి - పోలీసు అధికారులకు పిటిషన్‌ ఇచ్చారా?అని అడిగారు. కాంగ్రెస్‌ నాయకులు నోరుతెరిస్తే అబద్ధాలే మాట్లాడతారని చెప్పారు. చిల్లర వేషాలతో రాజకీయాల్లో నిలబడతామనుకోవడం అవివేకం అవుతుందన్నారు. వీరేశం, తాను కాంగ్రెస్‌ నాయకులపై కేసులు నమోదు చేయించాలనుకోవాలనుకుంటే నకిరేకల్‌, సూర్యాపేట నియోజకవర్గాల్లో పెట్టిం చేవాళ్లం కదా?అని ప్రశ్నించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కడైనా రాజకీయ కేసులు నమోదయ్యాయా?అని అడిగారు. రాజకీయాల్లో కొత్తవాళ్లమైనా తాము రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం లేదన్నారు. కాంగ్రెస్‌ నాయకులు నిరాశానిస్పృహలకు లోనై ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

కాంగ్రెస్ ముఖ్య‌నేత‌లైన జానారెడ్డి - ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నియోజకవర్గాల్లో హత్యలు ఎందుకు జరుగడం లేదని, ఒక్క నల్లగొండలోనే ఎందుకు జరుగుతున్నాయో ప్రజలు గమనిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. మొన్న హత్య జరిగిన స్థలంలోనే 20 ఏళ్ల‌ క్రితం మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహను కాంగ్రెస్‌ నాయకులు హత్య చేయించారని ఆరోపించారు. అన్నా - తమ్ముడు అన్నవాళ్లే తన భర్తను చంపారంటూ శ్రీనివాస్ భార్య ఏడ్చిందని, ఆమె మొదట ఇచ్చిన ఫిర్యాదును చూసినా ఇదే విషయం తెలుస్తుందని చెప్పారు. శ్రీనివాస్‌ కు అపాయం ఉన్నట్టు ఎవరికైనా ఫిర్యాదు ఇచ్చారా? అని మంత్రి ప్రశ్నించారు.కాంగ్రెస్ నాయకులు లేవడంతోనే అబద్ధాలు మాట్లాడుతున్నారని అన్నారు. జిల్లా చరిత్రలో కాంగ్రెస్‌ పార్టీ వల్లే రాజకీయహత్యలు జరిగాయని - టీఆర్‌ ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత మూడేండ్లుగా ప్రజలు ప్రశాంతంగా ఉంటున్నారని చెప్పారు.