Begin typing your search above and press return to search.

ఎంత ఆద‌ర్శం గురూ..అలీబాబా చైర్మ‌న్ రాజీనామా

By:  Tupaki Desk   |   10 Sep 2019 10:29 AM GMT
ఎంత ఆద‌ర్శం గురూ..అలీబాబా చైర్మ‌న్ రాజీనామా
X
రాజ‌కీయ నాయ‌కుల‌కైనా.. వ్యాపార దిగ్గ‌జాల‌కైనా.. ఆద‌ర్శం అనేది కేవ‌లం నేడు మాట‌ల‌కే ప‌రిమిత‌మైన రోజులు. స‌మాజానికి - ప‌క్క‌వారికి నీతులు చెప్పేవారు నేడు కోక‌ల్ల‌లు. కానీ, తాము ఆచ‌రించి చూపి - నిజ‌మైన ఆద‌ర్శ‌కులుగా ఉండేవారు వేళ్ల‌పైనే లెక్కించాలన్నా.. నేడు క‌నిపించ‌ని దుస్ధితి. ఇలాంటి స్థితిలో అత్యంత చిన్న వ‌య‌సులోనే పెద్ద బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకొంటూ.. ఈ ప్ర‌పంచ వ్యాపార వేత్త‌ల‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నారు.. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జ సంస్థ అలీబాబా సంస్థ చైర్మ‌న్ జాక్ మా అల్విదా. ప్ర‌స్తుతం ఆయ‌న వ‌య‌సు 55 ఏళ్లు నేటితో(సెప్టెంబ‌రు 10) పూర్తి అయ్యాయి.

నిజానికి ప్ర‌భుత్వ ఉద్యోగం చేస్తున్నా.. క‌నీసంలో క‌నీసం మ‌రో మూడేళ్ల‌పాటు స‌ర్వీసు ఉంది. ఇక‌, సొంత వ్యాపార‌మైతే.. క‌న్ను మూసే వ‌ర‌కు అంతా నాదే అంటూ.. ప‌గ్గాలు ప‌ట్టుకుని వేలాడొచ్చు. రాజ‌కీయాల్లోనూ అంతే ప‌రిస్థితి! మ‌రి వీటికి అతీతంగా తాను ప్రారంభించి - విత్త‌నం నాటి.. మొక్క‌గా సాగి.. మానులా ఎదిగేలా తీర్చిదిద్ది.. ప్ర‌పంచ వ్యాపార రంగంలో 66% వాటాతో మ‌హోజ్వ‌లంగా దూసుకుపోయే సంస్థ‌లా అలీబాబాను తీర్చిదిద్దిన ఆయ‌న ముంద‌స్తు ప‌క్కా ప్ర‌ణాళిక‌లో భాగంగా త‌న చైర్మ‌న్ గిరీని వ‌దులుకున్నారు. చైనాకు చెందిన జాక్ అత్యంత పేద కుటుంబం నుంచి ఇంతింతై.. వ‌టుడింతై.. అన్న‌ట్టుగా ఎదిగారు.

ఆంగ్ల ఉపాధ్యాయుడిగా కెరీర్ ప్రారంభించిన జాక్.. బిలియనీర్ వ్యాపారవేత్తగా అవతరించారు. ముఖ్యంగా 1999లో స్థాపించిన ఈ కామర్స్ దిగ్గజ కంపెనీ అలీబాబా సహ వ్యవస్థాపకుడిగా కంపెనీ ఎదుగలలో జాక్ మా కీలక పాత్ర పోషించారు. ప్రపంచంలోని టాప్‌ టెన్‌ ఇ-కామర్స్ సంస్థల్లో ఒకటిగా అలీబాబాను తీర్చిదిద్దా రు. అయితే, సంస్థ‌ను తాను తీర్చిదిద్దినా.. యువ‌ర‌క్తానికి అవ‌కాశం ఇవ్వాల‌నే పెద్ద ఉద్దేశంతో కొన్నాళ్ల కింద‌టే జాక్ త‌న రిటైర్మెంట్‌ను ప్ర‌క‌టించారు. ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన తనకు విద్య అంటే అమితమైన ప్రేమ అని వెల్లడించిన ఆయన.. భవిష్యత్‌ సమయాన్ని విద్యారంగ దాతృత్వానికే కేటాయిస్తానని పేర్కొన్నారు.

నాకు ఇంకా చాలా కలలు ఉన్నాయి. నేను పనిలేకుండా కూర్చోవడం నాకు ఇష్టం ఉందడని నా గురించి తెలిసిన వారందరికీ తెలుసు. ప్రపంచం పెద్దది, నేను ఇంకా చిన్నవాడిని, కాబట్టి నేను క్రొత్త విషయాలను ప్రయత్నించాల నుకుంటున్నాను - ఎందుకంటే కొత్త కలలతో కొత్త ఆవిషర్కణలకు - నూతన కలలను సాకారం చేసుకోవచ్చు గదా అంటూ గత ఏడాది ఒక బహిరంగ లేఖ ద్వారా తన రిటైర్‌ మెంట్‌ గురించి జాక్‌ మా ప్రకటించారు. ఇక‌, జాక్‌ స్థానంలో సంస్థ సీఈవో డేనియల్‌ జాంగ్‌ కొత్త చైర్మన్‌ గా బాధ్యతలను స్వీకరించనున్నారు. మ‌రి ఇలాంటి ఆద‌ర్శ వ్యాపార వేత్త ఈ ప్ర‌పంచంలో ఇంకెవ‌రైనా ఉన్నారా? మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.