Begin typing your search above and press return to search.

కరోనా అంతు చూసేందుకు అపర కుబేరులు కోట్లు ఇచ్చేస్తున్నారు

By:  Tupaki Desk   |   31 Jan 2020 11:00 AM IST
కరోనా అంతు చూసేందుకు అపర కుబేరులు కోట్లు ఇచ్చేస్తున్నారు
X
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ లెక్క తేల్చేందుకు.. ఆ పిశాచి పీచమణిచేందుకు వీలుగా ప్రభుత్వాలు తమ వంతుగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. కరోనా వైరస్ కు అడ్డుకట్ట వేసి.. వైరస్ తయారు చేసేందుకు అవసరమైన పరిశోధనల కోసం ఇప్పుడు అపర కుబేరులు రంగంలోకి దిగారు. కరోనా వైరస్ ను నిరోధించేందుకు అవసరమైన వ్యాక్సిన్ ను కనిపెట్టేందుకు చైనాలో రెండో సంపన్నుడు.. అలీ బాబా సంస్థల అధినేత జాక్ మా.. తన ట్రస్టు ద్వారా 14 మిలియన్ డాలర్ల (మన రూపాయిల్లో వంద కోట్లకు పైనే) భారీ మొత్తాన్ని విరాళంగా ప్రకటించారు.

అంతేకాదు కరోనా వైరస్ పుట్టినిల్లు అయిన వూహాన్ నగరానికి అవరమైన వైద్య సదుపాయాల కోసం బిలియన్ యువాన్లతో ఒక ఫౌండేషన్ కూడా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనుగునేందుకు శాస్త్రవేత్తలు పెద్ద ఎత్తున శ్రమిస్తున్నారని.. ఒకవేళ మందు కనిపెట్టినా భారీ ఎత్తున ఉత్పత్తి చేయటం అంత తేలిక కాదన్నది అలీబాబా భావన. అందుకే.. వైరస్ కు చెక్ చెప్పే వ్యాక్సిన్ తో పాటు.. దాని మందుల తయారీ కోసం పని చేస్తున్న సంస్థలకు అవసరమైన అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను ఉచితం గా అందిస్తామని అలీబాబా గ్రూపు ప్రకటించింది. చైనాలోని పలు సంస్థలు కూడా కరోనా వ్యాక్సిన్ కనుగొనేందుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.

టిక్ టాక్ సంస్థ బైట్ డ్యాన్స్ లు 115 మిలియన్ డాలర్లు సాయంగా ప్రకటిస్తే.. హువాయ్ సంస్థ అత్యవసర వైద్య సేవల కోసం హౌషెన్ షాన్ ఆసుపత్రి నిర్మాణం లో సాయాన్ని అందించింది. చైనాలోని ప్రముఖ క్రీడా దుస్తుల తయారీ సంస్థ అధినేత డింగ్ షియోంగ్ 1.4 మిలియన్ డాలర్ల భారీ మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు. ఇక.. చైనా ప్రభుత్వం కరోనా వైరస్ కత తేల్చేందుకు ఏకంగా 3.94 బిలియన్ అమెరికా డాలర్ల మొత్తాన్ని కేటాయిస్తున్నట్లుగా ఆర్థిక శాఖ ప్రకటించింది.

అలీబాబా బాటలో పలువురు ప్రముఖులు స్పందించారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తమ బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ తరఫున 10 మిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటిస్తే.. ఫ్రెంచి కుబేరుడు బెర్నార్డ్ ఆర్నాల్డ్ 2.3 మిలియన్ డాలర్లు.. ఫ్రాన్స్ కే విలాస ఉత్పత్తుల సంస్థ అధినేత ఫ్రాంకోయిస్ పినాల్ట్ ఒక మిలియన్ డాలర్ల ను ప్రకటించారు. కరోనా భరతం పట్టేందుకు.. దాన్ని నిలువరించే వ్యాక్సిన్ కోసం ప్రపంచ వ్యాప్తంగా కుబేరులు ముందుకు వస్తున్నారు. ఇంతమంది ముందుకొచ్చిన వేళ.. కరోనా వ్యాక్సిన్ ను తయారు చేయటంలో ఎవరు సక్సెస్ అవుతారో చూడాలి.