Begin typing your search above and press return to search.

జ‌బ‌ర్ద‌స్త్ నటుడి కన్నుమూత.. అసలేం జరిగిందంటే?

By:  Tupaki Desk   |   28 Sept 2022 10:17 AM IST
జ‌బ‌ర్ద‌స్త్ నటుడి కన్నుమూత.. అసలేం జరిగిందంటే?
X
ఒక టీవీ షో పుణ్యమా అని ఎంతోమంది కమెడియన్లు వెండితెరకు పరిచయం కావటమే కాదు.. బోలెడంత మంది కళాకారులకు కొత్త బతుకును ఇప్పించిన షో ఏదైనా ఉందంటే అది.. జబర్దస్త్ మాత్రమే అవుతుంది.

వెగటు హాస్యమని కొందరు తిట్టినా.. బూతులతో షో ఏందిరా బాబు అని ఎటకారం చేసినా.. తెలుగోడికి ఉండే కొంటెతనాన్ని గుర్తు చేసేలా ఉండే జబర్దస్త్ ఎంటర్మైంట్ రంగంలో ఒక మైలురాయిగా చెప్పుకోక తప్పదు.

చాలావరకు కొంటె సంభాషణలు ఉన్నప్పటికీ..కొన్ని సందర్భాల్లో డబుల్ మీనింగ్.. మరికొన్ని సందర్భాల్లో అతి చేసే ఎపిసోడ్ లను మినహాయిస్తే.. జబర్దస్త్ ను మరీ వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. అలాంటి షో ద్వారా సుపరిచితుడైన ఒక నటుడి కన్నుమూత టీవీ ఇండస్ట్రీని విషాదంలో ముంచెత్తుతోంది.

జబర్దస్త్ షో తో పరిచయమైన ఎంతోమంది టాలెంటెడ్ ఆర్టిస్టుల్లో ఒకరు మిమిక్రీ ఆర్టిస్ట్ మూర్తి ఒకరు. ఆయన తాజాగా కన్నుమూశారు. తన సోదరుడు కన్నుమూసిన విషయాన్ని మూర్తి తమ్ముడు అరుణ్ కన్ఫర్మ్ చేశారు.

అనారోగ్యంతో మరణించినట్లు పేర్కొన్నారు. మిమిక్రీ ఆర్టిస్టు అయినప్పటికీ.. జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన ఆయన.. స్టేజ్ షోల మీద కూడా నవ్విస్తూ ఉంటారు.అయితే.. ఆయన నవ్వు వెనుక ఎవరూ తీర్చలేనంత విషాదం ఉంది.

ఆయన ప్యాంక్రియాస్ క్యాన్సర్ తో బాధపడేవారు. ఆ విషయాన్ని తన సన్నిహితులకే చెప్పుకునేవారు. క్యాన్సర్ మహమ్మారి మీద విజయం సాధించటం కోసం ఆయన చాలానే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ.. పరిస్థితి చేయి దాటిపోవటంతో ఆయన అనారోగ్యంతో మంగళవారం కన్నుమూశారు. ఆయన మరణ వార్త గురించి తెలిసిన వారు విషాదానికి గురవుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.