Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ ను పొగిడేసిన బాబు మాజీ స‌న్నిహితుడు

By:  Tupaki Desk   |   2 Jan 2017 7:02 AM GMT
కేసీఆర్‌ ను పొగిడేసిన బాబు మాజీ స‌న్నిహితుడు
X
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు కేసీఆర్ తీసుకునే నిర్ణ‌యాలు ఇత‌రుల‌ను సైతం ఏ విధంగా ప్ర‌భావితం చేస్తాయో తెలియ‌జెప్పేందుకు ఇదో నిద‌ర్శ‌నం. తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ నిర్వహణలోని 650 దేవాలయాలలో పనిచేస్తున్న అర్చకులకు - ఉద్యోగులకు వేతన వ్యవస్థను ఏర్పరిచేందుకు సమగ్ర నివేదికను రూపొందించాలని ఆదేశించారు. నేరుగా వారి అకౌంట్‌ లలో వేతనాలు చెల్లించేందుకు వీలుగా ప్రత్యేకంగా హెడ్‌ ఆఫ్ అకౌంట్‌ ను ఏర్పాటు చేసేందుకు చట్టపరమైన అంశాలను అధ్యయనం చేయాలని సూచించారు. అదేవిధంగా అన్యాక్రాంతమైన ఆలయ భూముల వివరాలతో ప్రభుత్వానికి నివేదికను ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణ‌యంపై ఏపీ ప్ర‌భుత్వ మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఐవైఆర్ కృష్ణారావు హ‌ర్షం వ్యక్తం చేశారు. ఉమ్మ‌డి రాష్ట్రం నిర్ణ‌యాల‌కు భిన్నంగా కేసీఆర్ వ్య‌వ‌హరించారటూ ఆయ‌న కితాబివ్వ‌డం గ‌మ‌నార్హం.

సీఎం కేసీఆర్ త‌న నూత‌న క్యాంప్ కార్యాల‌య‌మైన ప్రగతి భవన్‌ లో అర్చక - ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. దేవాలయాల సమస్యలపై సుదీర్ఘంగా వారితో చర్చించారు. సంక్రాంతి నాటికి అర్చకులు, ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం లభించేలా అధికారులు నివేదికలను సిద్ధం చేయాలని పేర్కొన్నారు. ఇందుకోసం వెనువెంటనే మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి సారథ్యంలో ఉన్నత స్థాయి కమిటీని సీఎం నియమించారు. ఈ కమిటీలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి - ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ - దేవాదాయశాఖ సెక్రటరీ శివశంకర్ - అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి - న్యాయశాఖ సెక్రటరీ సంతోష్‌ రెడ్డి - అర్చక - ఉద్యోగసంఘాల ప్రతినిధులు సభ్యులుగా ఉన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఒకే పనికి ఒకే వేతనం తీర్పు తదితర అంశాలను కమిటీ చర్చించాలని సీఎం సూచించారు. ఉద్యోగుల రెగ్యులరైజేషన్ - సీనియారిటీ - రోస్టర్ విధానం - దేవాలయాల ఆదాయాలు తదితర అంశాలతో రెండు రోజులలో నివేదికలు సిద్ధం చేయాలని చెప్పారు. గత ప్రభుత్వాల మితిమీరిన జోక్యంవల్ల ఆలయాలు కూడా అవినీతికి ఆలవాలమయ్యాయని, ఆధ్యాత్మిక వ్యవస్థకు విఘాతం కలిగిందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. వితరణశీలురకు - ధార్మిక పరాయణులకు మాత్రమే ఆలయాల ధర్మకర్తల మండలిలో అవకాశాలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ పద్ధతిలో నిమయావళిలో మార్పులు తీసుకురావాలని సూచించారు. ప్రతీ దేవాలయం భూముల వివరాలతో లెక్కలు తేల్చాలని ఆదేశించారు. విద్యుత్‌శాఖలో ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసిన పద్ధతిలోనే అర్చకులను - ఇతర సిబ్బందిని రెగ్యులర్‌ చేసే విషయం కూడా పరిశీలించాలని తెలిపారు. గతంలో యాదాద్రి - వేములవాడ - భద్రాద్రి వంటి దేవాలయాలను పాలకులు పట్టించుకోలేదని - అందుకే తెలంగాణ ప్రభుత్వం వందలకోట్ల నిధులు వెచ్చించి ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నదని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

ఈ నిర్ణ‌యంపై ఏపీ అర్చక సంక్షేమనిధి ట్రస్ట్ చైర్మన్ - ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేవాలయాలలోని అర్చకులకు - ఉద్యోగులకు వేతనవ్యవస్థను ఏర్పరిచేందుకు పూనుకోవడం హర్షణీయమని ఆయ‌న కొనియాడారు. గ్రామాలలో దేవాలయాలు హిందూధార్మిక పరిరక్షణ కేంద్రాలుగా విరాజిల్లేందుకు ఈ నిర్ణయాలు దోహదం చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన 30/87 చట్టం గ్రామీణ దేవాలయాల వ్యవస్థను దెబ్బతీసిందని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో దేవాలయాలు మరోసారి ధార్మిక కేంద్రాలుగా అభివృద్ధి చెందేందుకు కేసీఆర్ నిర్ణయాలు బాటలు వేస్తాయ‌ని కొనియాడారు. ఆరు దశాబ్దాల ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఏ సీఎం కూడా ఇంత వివరంగా, సుదీర్ఘంగా దేవాలయాల సమస్యలపైన చర్చించలేదని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు మాత్రమే ఈ ఘనత దక్కిందని తెలంగాణ అర్చక సమాఖ్య అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ అన్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/