Begin typing your search above and press return to search.

ట్రంప్ కూతురు ఉండేది ఎక్క‌డంటే?

By:  Tupaki Desk   |   14 Aug 2017 9:53 AM GMT
ట్రంప్ కూతురు ఉండేది ఎక్క‌డంటే?
X
అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె హైద‌రాబాద్ ట్రిప్ అంద‌రి దృష్టిని విపరీతంగా ఆక‌ర్షిస్తోంది. న‌వంబ‌రులో జ‌రిగే గ్లోబ‌ల్ ఎంట‌ర్ ప్రెన్యూర్స్ స‌మ్మిట్ లో ఆమె పాల్గొన‌నున్నారు. ఈ స‌ద‌స్సుకు దాదాపు 150 దేశాల‌కు చెందిన ప్ర‌తినిధులు హాజ‌రు కానున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. అమెరికా నుంచి వ‌చ్చే బృందానికి అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ నేతృత్వం వ‌హించ‌టం తెలిసిందే. ఈ స‌మ్మేళ‌నానికి దాదాపుగా 3వేల మంది ప్ర‌తినిధులు హాజ‌రుకానున్నారు. న‌వంబ‌రు 28 నుంచి మూడు రోజుల పాటు సాగే ఈ స‌మ్మేళ‌నాన్ని తెలంగాణ ఐటీ శాఖామంత్రి కేటీఆర్ స్వ‌యంగా ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

ప్ర‌తిష్ఠాత్మ‌కమైన ఈ స‌ద‌స్సుతో హైద‌రాబాద్ బ్రాండ్ ఇమేజ్ మ‌రింత పెరుగుతుంద‌న్న అంచ‌నాలున్నాయి. ఇదిలా ఉంటే.. హైద‌రాబాద్‌కు వ‌చ్చే ఇవాంకా ట్రంప్ బ‌స ఎక్క‌డ‌న్న విష‌యంపై క్లారిటీ వ‌చ్చేసింద‌ని చెబుతున్నారు. ప్ర‌ఖ్యాత ఫ‌ల‌క్ నుమా ప్యాలెస్ లో ఇవాంకా బ‌స చేయ‌నున్న‌ట్లు చెబుతున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఈ స‌ద‌స్సుకు వీలైనంత ఎక్కువ‌గా మ‌హిళా ప్రతినిధులు హాజ‌ర‌య్యేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. దీంతో మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌లు పెద్ద ఎత్తున వ‌చ్చే నేప‌థ్యంలో వారికి అవ‌స‌ర‌మైన అన్ని ఏర్పాట్లు చేసేందుకు వీలుగా అన్ని ర‌కాల సౌక‌ర్యాల్ని ఏర్పాటు చేయాల‌న్న ఆదేశాలు ఇప్ప‌టికే ఇచ్చారు.

స‌ద‌స్సులో భాగంగా 12 వ‌ర్క్ షాప్ లు.. స‌మీక్ష‌లు.. డిబేట్స్ ఏర్పాటు చేశారు. హైద‌రాబాద్ లోనిప్ర‌ముఖ ఫైవ్ స్టార్ హోట‌ల్స్ తోపాటు.. ప్ర‌భుత్వ అతిధి గృహాల‌నుకూడా ఈ కార్య‌క్ర‌మం కోసం ముందుగా బుక్ చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని మోడీతో పాటు.. ఆర్థిక శాఖామంత్రి అరుణ్ జైట్లీ.. వాణిజ్య‌ప‌న్నుల శాఖామంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ లు రానున్నారు. ఈ సంద‌ర్భంగా మ‌హిళా పారిశ్రామివేత్త‌ల‌కు ప్ర‌త్యేక ప్రోత్స‌హ‌కాల్ని ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ స‌ద‌స్సుకు 150 దేశాల నుంచి ప్ర‌తినిధులు వ‌చ్చినా.. సెంట‌ర్ ఆఫ్ ద అట్రాక్ష‌న్ మాత్రం ట్రంప్ కూతురేన‌న్న విష‌యాన్ని చెప్ప‌క త‌ప్ప‌దు.